జీవ జబ్బుల సునామీ!

అధిక రక్తపోటు, ముందస్తు మధుమేహం (ప్రి డయా బిటిస్‌), మధుమేహం విజృంభిస్తున్నాయి. మనదేశంలో 35.5% మంది అధిక రక్తపోటు, 15.3% మంది ముందస్తు మధుమేహం, 11.4% మంది మధుమేహంతో బాధ పడుతున్నట్టు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ఆధ్వర్యంలో మద్రాస్‌ డయాబిటిస్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడి కావటమే దీనికి నిదర్శనం.

Updated : 18 Jul 2023 09:10 IST

అధిక రక్తపోటు, ముందస్తు మధుమేహం (ప్రి డయా బిటిస్‌), మధుమేహం విజృంభిస్తున్నాయి. మనదేశంలో 35.5% మంది అధిక రక్తపోటు, 15.3% మంది ముందస్తు మధుమేహం, 11.4% మంది మధుమేహంతో బాధ పడుతున్నట్టు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ఆధ్వర్యంలో మద్రాస్‌ డయాబిటిస్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడి కావటమే దీనికి నిదర్శనం. బొజ్జ (39.5%), ఊబకాయం (28.6%) కూడా తక్కువేమీ కాదు. వేర్వేరు సమస్యలుగా అనిపించొచ్చు గానీ ఇవన్నీ జీవక్రియ రుగ్మత(మెటబాలిక్‌ సిండ్రోమ్‌)తో ముడిపడినవే. ఇది ప్రత్యేకించి భారతీయలు, భారత సంతతికి చెందినవారిలోనే అధికం. మిగతా దేశాల్లో 30% మంది జీవక్రియ రుగ్మత కనిపిస్తుండగా.. మనదేశంలో అంతకన్నా ఎక్కువమంది దీని బారినపడుతుండటం గమనార్హం. పైగా పదేళ్ల ముందుగానూ దాడి చేస్తోంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే సునామీలా విరుచుకు పడటం ఖాయం.

న శరీరంలో నిరంతరం బోలెడన్ని రసాయనిక, శారీరక మార్పులు జరుగుతుంటాయి. వీటినే జీవక్రియలు (మెటబాలిజమ్‌) అంటారు. శరీరం ఎదగటానికి, అవయవాలన్నీ సక్రమంగా పని చేయటానికివి అత్యవసరం. ఇవి అస్తవ్యస్తం కావటం వల్ల రకరకాల సమస్యలు తలెత్తుతాయి. వీటన్నింటినీ కలిపే ‘జీవక్రియ రుగ్మత’ అని పిలుస్తున్నారు. ఇది చడీ చప్పుడు లేకుండా చాప కింద నీరులా దాడి చేస్తుంది. గుర్తించేసరికే చాలామందిలో ఇతరత్రా దుష్ప్రభావాలూ మొదలై ఉండటం ఆందోళనకరం. కాబట్టే దీన్ని నిశ్శబ్ద హంతకిగా భావిస్తున్నారు. జీవక్రియ రుగ్మతలో బోలెడన్ని సమస్యలు ఇమిడి ఉండటం వల్ల దీన్ని వివిధ దేశాలు, సంస్థలు రకరకాలుగా నిర్వచించాయి. వీటిన్నింటిలో ఉమ్మడిగా కనిపించే, ముఖ్యమైన సమస్యలు ఐదు. అవి..

1. రక్తపోటు: రక్తం ప్రవహించేటప్పుడు రక్తనాళ గోడల మీద కొంత పీడనం పడుతుంది. ఇది 130/85 కన్నా మించితే జీవక్రియ రుగ్మత కిందే పరిగణిస్తారు.

2. రక్తంలో గ్లూకోజు: కణాల్లోకి గ్లూకోజు చేరుకునేలా చేసే ఇన్సులిన్‌కు కణాలు స్పందించకపోతే రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరుగుతాయి. మూడు నెలల గ్లూకోజు సగటును తెలిపే హెచ్‌బీఏ1సీ పరీక్షతో దీన్ని గుర్తించొచ్చు. దీని ఫలితాలు 5.7 కన్నా పెరిగితే జీవక్రియ రుగ్మత ఉన్నట్టే.

3. చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌): రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ చాలా సమస్యలు సృష్టిస్తుంది. ఇది 90 ఎంజీ/డీఎల్‌ కన్నా పెరిగితే ప్రమాదమే.

4. ట్రైగ్లిజరైడ్లు: రక్తంలో వీటి మోతాదులు 150 ఎంజీ/డీఎల్‌ కన్నా మించటం జీవక్రియ రుగ్మతకు సూచికే.

5. బొజ్జ: ఇది పైకి స్పష్టంగానే కనిపిస్తుంటుంది. బొడ్డు వద్ద కడుపు చుట్టుకొలత మగవారిలో 80 సెంటీమీటర్లు, ఆడవారిలో 90 సెంటీమీటర్లు దాటితే ప్రమాద సంకేతమే.

* వీటిల్లో అన్నీ ఉండాల్సిన పనిలేదు. ఏ రెండు సమస్యలున్నా జీవక్రియ రుగ్మతతో బాధపడుతున్నట్టే. ఇవన్నీ ఒకదాంతో మరోటి ముడిపడి ఉంటాయి కూడా. ఉదాహరణకు- రక్తంలో గ్లూకోజు పెరిగితే కొలెస్ట్రాల్‌ మోతాదులూ అస్తవ్యస్తమవుతాయి. బొజ్జ మూలంగా రక్తంలో గ్లూకోజు, రక్తపోటు పెరుగుతాయి. చివరికి ఇవన్నీ కలిసి తీవ్ర దుష్ప్రభావాలకు దారితీస్తాయి. కాలేయంలో కొవ్వు పేరుకోవటం, నిద్రలో శ్వాసకు అడ్డంకి తలెత్తటం, ఆడవారిలో అండాశయాల్లో నీటి తిత్తులు, మతిమరుపు, కొన్ని క్యాన్సర్ల వంటి సమస్యలూ జీవక్రియ రుగ్మతతో తలెత్తే సమస్యలే.


గుర్తించేదెలా?

జీవక్రియ రుగ్మతలో ప్రత్యేకించి బయటపడే లక్షణాలేవీ ఉండవు. రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు పెరిగినా పైకి మామూలుగానే ఉంటారు. అందువల్ల గుర్తించటం కష్టం. కడుపు వద్ద కొవ్వు పేరుకుపోతే బొజ్జ రూపంలో కనిపిస్తుంది. లావుగా లేకపోయినా కొందరికి బొజ్జ ఉండొచ్చు. గ్లూకోజు పెరిగితే మాత్రం నీరసం, నెలకు 2 కిలోల కన్నా ఎక్కువ బరువు తగ్గటం, గాయాలు త్వరగా మానకపోవటం వంటి లక్షణాలు కనిపించొచ్చు. జీవక్రియ రుగ్మతను ఏదో ఒక్క పరీక్షతో నిర్ధరించలేం. అందుకే మిగతా దేశాల్లో 40 ఏళ్లు దాటాక రక్తపోటును కొలుచుకోవటంతో పాటు రక్తంలో గ్లూకోజు, చెడు కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్ల మోతాదులను పరీక్షించుకోవాలని సూచిస్తున్నారు. అయితే భారతీయులు, భారత సంతతికి చెందినవారిలో ముందే తలెత్తుతుండం వల్ల అంతకన్నా ముందే పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. లక్షణాల మీద ఆధారపడకుండా 25 ఏళ్లు దాటినవారంతా ఏటా ఒక్కసారైనా పరగడుపున ఈ పరీక్షలు చేయించుకోవాలి. ఇవి చవకగా, అన్నిచోట్లా అందుబాటులో ఉన్నాయి. బొజ్జ విషయంలోనూ జాగ్రత్త అవసరం. బొడ్డు వద్ద కడుపు చుట్టుకొలత మగవారిలో 80 సె.మీ., ఆడవారిలో 90 సె.మీ. మించితే అప్రమత్తం కావాల్సిందే. జీవక్రియ రుగ్మతను గుర్తించటానికి ఇన్సులిన్‌, సీఆర్‌పీ, హోమోసిస్టీన్‌, లైపోప్రొటీన్‌ ఏ, యూరిక్‌ యాసిడ్‌, అడిపోనెక్టిన్‌ వంటి ఇతరత్రా పరీక్షలున్నాయి. కాకపోతే వీటి ఖరీదు ఎక్కువ.


చికిత్స- మందులు ప్రధానం

సేంద్రియ పదార్థాలు, పీచు ఎక్కువగా ఉన్న పదార్థాలు తినటం.. వ్యాయామం చేయటం ద్వారా అధిక రక్తపోటు, మధుమేహం వంటి జబ్బులు రాకుండా చూసుకోవచ్చనే ప్రచారాలు చూస్తూనే ఉన్నాం. అయితే ఇలాంటి ఆహార, వ్యాయామ నియమాలతో 3 నెలల దాటినా ఎలాంటి ఫలితం కనిపించకపోతే అవి ఉపయోగపడవనే సంగతి అంతా గుర్తించాలి. అందుకే జీవక్రియ రుగ్మత చికిత్సలో మందులకు ప్రాధాన్యం ఇవ్వాలనే భావన బలపడుతోంది. అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు నిర్ధరణ అయిన తొలిరోజు నుంచే మందులు వాడుకోవటం మంచిది. గ్లూకోజు ఎక్కువగా గలవారికి మెట్‌ఫార్మిన్‌ ఉపయోగపడుతుంది. అధిక రక్తపోటును తగ్గించటానికి డైయూరెటిక్స్‌, ఏసీఈ ఇన్‌హిబిటార్స్‌, బీటా బ్లాకర్స్‌ వంటి మందులు తోడ్పడతాయి. ఎల్‌డీఎల్‌కు స్టాటిన్లు, ట్రైగ్లిజరైడ్లకు ఫైబ్రేట్స్‌ రకం మందులు ఉపయోగపడతాయి. ఆయా సమస్యలకు తగిన మందులు వాడుతూనే జీవనశైలి మార్పులు పాటించాలి. ఆహార, వ్యాయామ నియమాలు పాటిస్తున్నాం కదాని మందుల వాడకం మానరాదు.


జీవనశైలి మార్పుతో మేలు

జీవక్రియ రుగ్మత నివారణకే కాదు, చికిత్సకూ మంచి జీవనశైలి తోడ్పడుతుంది. నివారణ అనేది జీవితాంతం అనుసరించాల్సిన విధానమే గానీ ఏదో కొన్ని రోజులకు పరిమితమయ్యేది కాదని తెలుసుకోవాలి.  
* ఆహారం: వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సంక్లిష్ట పిండి పదార్థాలు తీసుకోవటం. ఇందుకు చిరుధాన్యాలు మంచి ప్రత్యామ్నాయం. ఇవి ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగించి, తక్కువ తినేలా చేస్తాయి. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆహార పదార్థాలూ మేలు చేస్తాయి. అలాగే నూనె, కొవ్వు పదార్థాలు తగ్గించుకోవాలి. తగినంత ప్రొటీన్‌ తినటమూ చాలా ముఖ్యం. ఇది కండర వృద్ధికి దోహదం చేస్తుంది.
* వ్యాయామం: ఇది కేలరీలు ఖర్చవ్వటానికే కాదు.. శక్తిని వినియోగించుకునే కండరాలు పుంజుకోవటానికీ తోడ్పడుతుంది.
* యోగా: ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. కంటి నిండా నిద్ర పట్టేలా చేస్తుంది. ఇలా జీవక్రియ రుగ్మత తగ్గటానికి దోహదం చేస్తుంది.


ఎందుకొస్తుంది?

జీవక్రియ రుగ్మతకు రకరకాల కారణాలు దోహదం చేస్తుంటాయి. వీటిల్లో కొన్ని సరిదిద్దుకోలేనివి. కొన్ని సరిదిద్దుకునే అవకాశమున్నవి.

సరిదిద్దుకోలేని కారణాలు

* త్రిఫ్టీ జన్యువు (జీనోటైప్‌): సరిదిద్దుకోలేని కారణాల్లో ఇదే ప్రధానమైంది. భారతీయులు, భారత సంతతికి చెందినవారికే ప్రత్యేకించింది. ఇది పురాతన కాలం నుంచే సంక్రమించింది. కొంచెం తిన్నా కూడా భవిష్యత్‌ అవసరాల కోసం శక్తిని నిల్వ చేయటం దీని ప్రత్యేకత. తరచూ కరవు, క్షామం తాండ విస్తుండటం.. పస్తులుండటం, సుదీర్ఘ సముద్రయానం వంటి పరిస్థితులనూ తట్టుకొని మనుగడ సాగించటానికి వీలుగా మారిన జన్యు విధానమిది. వేలాది ఏళ్లుగా ప్రపంచంలోని అన్ని తెగల జాతులకు చెందినవారు భారత ఉపఖండానికి వచ్చి స్థిరపడ్డారు. దీనికి మూడు వైపులా సముద్రాలు ఉండటంతో మరోచోటుకు భూమార్గం ద్వారా వెళ్లటం సాధ్యం కాలేదు. దీంతో సుదీర్ఘ సముద్రయానాలు ఆరంభించారు. ఎంతోమంది మరణించారు. అన్ని కఠిన పరిస్థితులను తట్టుకొని కొందరు బతికి బట్టకట్టారు (జీన్‌ సెలెక్షన్‌). వీరి సంతానంలో త్రిఫ్టీ జీనోటైప్‌ పురుడు పోసుకుందని భావన. దీంతో నెలల తరబడి తిండి లభించకపోయినా బతికే సామర్థ్యం వచ్చింది. సైద్ధాంతిక ఊహే అయినా ఇది నిజమేనని చాలా అధ్యయనాల్లో బయటపడింది. ఇప్పటికీ ఎక్కువకాలం తిండి తినకపోయినా జీవించగలిగేది భారతీయలు, భారత సంతతి వారే. కరవు, క్షామం నెలకొన్నప్పుడు.. తిండి అందుబాటులో లేనప్పుడు వరంగా పనిచేసిన ఈ త్రిఫ్టీ జన్యువే ఇప్పుడు శాపంగా మారింది. ప్రస్తుతం తగినంత ఆహారం అందుబాటులో ఉంది. ముప్పూటలా తింటున్నాం. అయినా కూడా ఈ జన్యువు తన పని మానలేదు. మాంసకృత్తులు, కొవ్వు రూపంలో శక్తిని దాచుకుంటూనే వస్తోంది. ముఖ్యంగా కాలేయం చుట్టూ, కాలేయంలోనూ, మూత్రపిండాల చుట్టూ కొవ్వును నిల్వ చేసుకుంటోంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు పెరగటానికి, బొజ్జ వంటి సమస్యలకు కారణమవుతోంది.

* వయసు: మన శరీరంలో జరిగే అన్ని పనులనూ ప్రతీ కణమూ చేస్తుంది. శక్తిని వినియోగించుకోవటం, దాచుకోవటం, మరణించటం వంటి జీవక్రియలన్నీ చేస్తుంది. సాధారణంగా 40 ఏళ్లు దాటాక వీటి వేగం మందగిస్తూ వస్తుంది. కానీ మనలో పదేళ్ల ముందే ఇది మొదలవుతోంది. అందువల్ల భారతీయులు, భారత సంతతికి చెందిన ప్రతి ఒక్కరూ 25 ఏళ్లు దాటాక అప్రమత్తంగా ఉండటం మంచిది.

సరిదిద్దుకోగల కారణాలు

* బొజ్జ: పెద్దవారే కాదు, ఇటీవల మనదేశంలో చిన్నవారూ బాగా బరువు పెరిగిపోతున్నారు. గత పదేళ్లలోనే ఈ ధోరణి ఎక్కువైంది. 10 నుంచి 20 ఏళ్ల వయసువారిలో 50% మంది బరువు ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తిస్తున్నాం. ఇది గ్లూకోజు, రక్తపోటు పెరగటానికి దారితీస్తుంది. ఇలా చిన్నవయసులో గ్లూకోజు, రక్తపోటు ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీ, గుండెజబ్బుల వంటి వాటితో త్వరగా మరణించే ప్రమాదమూ పెరుగుతుండటం ఆందోళనకరం.

* శారీరక శ్రమ తగ్గటం: ఒకప్పుడు పట్టణాల్లోనే శారీరక శ్రమ తక్కువని అనుకునేవారు. వ్యవసాయ పనుల్లో యంత్రాల వాడకం వంటి వాటితో ఇప్పుడు గ్రామాల్లోనూ ఈ ధోరణి పెరిగిపోయింది. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, మధుమేహం వంటి సమస్యలన్నీ పట్టణాలు, గ్రామాల్లో దాదాపు సమానంగానే కనిపిస్తున్నాయి. శారీరక శ్రమ తగ్గితే లావు పెరగటం ఒక సమస్య అయితే కండరాల్లో కొవ్వు పేరుకోవటం మరో సమస్య. శ్రమ చేసేవారిలో కండరాల మోతాదు ఎక్కువగా ఉంటుంది. అదే శ్రమ చేయనివారిలో శరీరం ఎక్కడ వీలైతే అక్కడ కొవ్వును దాచుకోవటానికి ప్రయత్నిస్తుంది. కండర పోచల మధ్యలోనూ కొవ్వును దాచుకుంటుంది. కొవ్వు కణాలు ఎక్కడున్నా వినాళ గ్రంథుల్లాగానే పనిచేస్తాయి. సైటోకైన్ల వంటి వాపు కారకాలను పుట్టిస్తాయి. ఇవి నేరుగా రక్తంలోకే విడుదలవుతాయి. సాంక్రమికేతర జబ్బులకు ఈ వాపు కారకాలే మూలం.

* నూనె, కొవ్వు పదార్థాలు: ఒకప్పటికన్నా ఇప్పుడు నూనె, కొవ్వు పదార్థాల వాడకం బాగా పెరిగిపోయింది. వీటితో కేలరీలు ఎక్కువగా లభిస్తాయి. శరీరం వినియోగించుకోకుండా మిగిలిన కేలరీలు కొవ్వుగా మారి అవయవాల చుట్టూ పేరుకుపోతుంది. ఫలితంగా బరువు పెరుగుతుంది. బొజ్జ వస్తుంది. చెడ్డ కొలెస్ట్రాల్‌, టైగ్లిజరైడ్లూ పెరుగుతాయి.

* వాయు కాలుష్యం: జీవక్రియ రుగ్మత కారకాల విషయంలో ఇటీవల కొత్త విషయాలు బయటపడుతున్నాయి. వీటిలో ప్రధానంగా చెప్పాల్సింది వాయు కాలుష్యం గురించే. కొవిడ్‌ మహమ్మారి కన్నా ముందు నుంచే మనదేశంలో మిగతా దేశాల కన్నా వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. దీనికి ప్రధాన కారణం పొలాల్లో పంట వ్యర్థాలు కాల్చటం, వంట చెరకు వినియోగం, శిలాజ ఇంధనాల దహనం. వాయు కాలుష్యంతో మధుమేహం రావటమే కాదు.. మరణాలకూ దారితీస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. మధుమేహంతో ఏటా 5.5 లక్షల మరణాలు సంభవిస్తుండగా.. వీటిల్లో 50వేల మరణాలకు వాయు కాలుష్యమే కారణమవుతోంది. అంటే ప్రతి ఆరు మధుమేహ మరణాల్లో ఒకటి వాయు కాలుష్యంతోనే ముడిపడి ఉంటోది అన్నమాట. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు.. పొలాల్లో చల్లే ఆర్గనో ఫాస్ఫరస్‌, ఆర్గనో ఫ్లోరైడ్‌ క్రిమి సంహారకాలు.. కొన్నిరకాల ఎరువులు సైతం కాలుష్యానికి కారణమవుతున్నాయి. 


వరమే శాపమై

శక్తి వినియోగంలో హార్మోన్ల పాత్ర కీలకం. కొన్నేమో సంక్లిష్ట పదార్థాలను చిన్నవిగా విడగొట్టి, శక్తిని విడుదల చేస్తుంటాయి (కెటబాలిక్‌). కొన్నేమో చిన్న, సాధారణ పదార్థాలను సంక్లిష్టమైనవిగా మార్చి, శరీరంలో నిల్వ ఉండేలా చేస్తాయి (అనబాలిక్‌). చాలా హార్మోన్లు ఈ రెండు రకాల పనులను కలిపి నిర్వర్తిస్తుంటాయి. కానీ ఎందుకనో జీవ పరిణామక్రమంలో ఇన్సులిన్‌ ఒక్కటే కేవలం నిల్వ ఉంచుకునే హార్మోన్‌గా రూపొందింది. ఇది కణాల్లోకి గ్లూకోజు, అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు, లవణాలను చేరవేస్తుందే తప్ప తనకు తానుగా శక్తిని వెలువరించలేదు. సాధారణంగా రక్తంలో ఇన్సులిన్‌ 15-40 మైక్రోయూనిట్లు/మిలీ మోతాదులో ఉంటుంది. కానీ భారతీయులు, భారత సంతతికి చెందినవారిలో పరగడుపున, భోజనం చేశాక ఇంతకన్నా ఎక్కువే ఉంటుంది. ఇది మనకు మాత్రమే ప్రత్యేకమైన గుణం. ఇన్సులిన్‌ ఎక్కువగా ఉండటానికి కారణమూ త్రిఫ్టీ జీనోటైపే. మనం తిన్న ఆహారం జీర్ణమయ్యాక గ్లూకోజు, కొవ్వు ఆమ్లాలు, అమైనో ఆమ్లాల వంటి రూపాల్లోకి విడిపోతుంది. ఇవి రక్తం ద్వారా కాలేయంలోకి వెళ్తాయి. మున్ముందు ఆహారం అందుబాటులో ఉండదనే భావనతో శరీరం గ్లూకోజు, కొవ్వును వివిధ భాగాల్లో.. ముఖ్యంగా కాలేయంలో, కొవ్వు కణాల్లో, కండర పోచల మధ్యలో దాస్తుంది. ఇందుకు తోడ్పడే ఏకైక హార్మోన్‌ ఇన్సులినే. నిజానికి ఇది మంచి పనే. తిండి దొరకని పరిస్థితుల్లో శరీర మనుగడకు తోడ్పడుతుంది. కానీ ప్రస్తుతం తగినంత.. ఆ మాటకొస్తే ఎక్కువ ఆహారం తింటున్నా కూడా ఇన్సులిన్‌ తన మానాన తను పని చేసుకుపోతోంది. పిండి పదార్థాన్ని గ్లైకోజెన్‌గా, కొవ్వు పదార్థాన్ని కొవ్వు ఆమ్లాలుగా, అమైనో ఆమ్లాలను ప్రొటీన్‌ రూపంలో దాస్తోంది. ఇదే కొన్ని దుష్ప్రభావాలకు దారితీస్తుంది. వీటిల్లో ప్రధానమైనవి రక్తంలో గ్లూకోజు, చెడు కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు పెరగటం. ట్రైగ్లిజరైడ్లతోనే శరీరానికి శక్తి లభిస్తుంది గానీ ఎక్కువైతేనే సమస్యలు సృష్టిస్తుంది. అలాగే ఎల్‌డీఎల్‌ కూడా. సాధారణంగా ఇది రక్తనాళాల లోపలి గోడల్లో పగుళ్లు ఏర్పడినప్పుడు, వాటిని పూడ్చటానికి తోడ్పడుతుంది. అయితే దీని మోతాదులు పెరిగితే మాత్రం అక్కడే పోగుపడుతుంది. అక్కడికి తెల్ల రక్తకణాల వంటివి చేరుకొని, క్రమంగా పూడికలు ఏర్పడతాయి. అందుకే దీన్ని చెడు కొలెస్ట్రాల్‌గా భావిస్తున్నాం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని