పేగు జారిందా?

బయటకు అంతా బాగానే ఉంటుంది. కానీ లోపల్నుంచే ఏదో బయటకు తోసుకొస్తూ వస్తుంటుంది. ఏదో కిందికి జారుతున్న భావన. ఇక పట్టి ఉంచటం అసాధ్యమనీ అనిపిస్తుంటుంది

Updated : 29 Aug 2023 05:37 IST

పెల్విక్‌ ఆర్గాన్‌ ప్రొలాప్స్‌

బయటకు అంతా బాగానే ఉంటుంది. కానీ లోపల్నుంచే ఏదో బయటకు తోసుకొస్తూ వస్తుంటుంది. ఏదో కిందికి జారుతున్న భావన. ఇక పట్టి ఉంచటం అసాధ్యమనీ అనిపిస్తుంటుంది. ఎవరికి? ఎలా? చెప్పాలో తెలియని నిస్సహాయత. ఎవరికైనా చెబితే ఏమనుకుంటారోనన్న సంకోచం. మనదేశంలో వయసు మీద పడ్డ మహిళల్లో ఎంతోమంది అనుభవిస్తున్న వ్యథే ఇది. దీనికి కారణం కటిభాగంలో ‘పేగు జారటం’. తెలిసో, తెలియకో పేగు జారిందని భావిస్తుంటారు గానీ నిజానికి తోసుకొచ్చేవి కటి భాగంలోని అవయవాలే. అనాదిగా మహిళలను వేధిస్తున్నదే అయినా, సరిదిద్దుకునే అవకాశమున్నా చాలామంది పైకి చెప్పుకోవటానికి వెనకాడుతుంటారు. లోలోపలే మథన పడుతుంటారు. సమస్యపై సరైన అవగాహన లేకపోవటమే దీనికి ప్రధాన కారణం. 

ఏది ఎక్కడుండాలో అక్కడే ఉండాలి. శరీరంలోని అవయవాల విషయంలో ఇది మరింత ముఖ్యం. లేకపోతే పక్క అవయవాలకు నొక్కుకుపోవచ్చు. అడ్డంకులు సృష్టించొచ్చు. కటి భాగంలోని అవయవాలు తోసుకు రావటం (పెల్విక్‌ ఆర్గాన్‌ ప్రొలాప్స్‌) ఇలాంటి సమస్యే. మహిళల్లో కటి కుహరంలోని అవయవాలను పట్టి ఉంచే నిర్మాణం సంక్లిష్టంగా ఉంటుంది. కటి మధ్యలో గర్భసంచి.. దీనికి ముందు మూత్రాశయం, మూత్రనాళాలు.. వెనకాల మలాశయం (రెక్టమ్‌) ఉంటాయి. కటి ఎముక మధ్యలోంచి వచ్చే మూడు మార్గాలే మల, మూత్ర విసర్జనకు, జననాంగ మార్గానికి దారి చూపుతాయి. అందువల్ల ఇక్కడి అవయవాలన్నీ కుదురుగా ఉండటం చాలా కీలకం. ఇందుకు కటి కండరాలు, అనుసంధాన కణజాలాలు, కండర బంధనాలు (లిగమెంట్లు) తోడ్పడతాయి. ఇవి మెదడు, వెన్నుపాముతో అనుసంధానమై.. వాటి నుంచి అందే సంకేతాలతో పనిచేస్తుంటాయి. వీటి మూలంగానే గర్భాశయ ముఖద్వారం తెరచుకోవటం, మూసుకోవటం.. మల, మూత్ర విసర్జన నియంత్రించుకోవటం వంటివన్నీ సాధ్యమవుతున్నాయి. శరీర నిర్మాణమూ అవయవాలు కుదురుగా ఉండటానికి తోడ్పడుతుంది. గర్భాశయం కిందికి జారకుండా కాస్త వెనక్కి వాలి ఉంటుంది. ఇలా గురుత్వాకర్షణ ప్రభావాన్ని తప్పించుకుంటుంది. అలాగే జననాంగం కూడా ముందు భాగం వెనక్కి, వెనక భాగం ముందుకు వాలి ఉంటాయి. ఇవన్నీ కటి భాగంలోని అవయవాలు కుదురుగా, భద్రంగా ఉండటానికి ప్రకృతి కల్పించిన రక్షణలే. కానీ కండరాలు, కండర బంధనాలు బలహీనం కావటం వల్ల కొందరిలో గర్భసంచి, మూత్రాశయం, జననాంగం, మూత్రమార్గం, మలాశయం వంటివి పట్టుతప్పి, కిందికి జారొచ్చు. జననాంగ మార్గంలోకీ చొచ్చుకు రావొచ్చు. మరికొందరిలో పూర్తిగానూ బయటకు తోసుకురావొచ్చు. కాబట్టి ‘పేగు జారటం’ గురించి తెలుసుకొని ఉండటం మంచిది. తగు చికిత్స తీసుకుంటే సమస్య నుంచి బయటపడొచ్చు. ఆ మాటకొస్తే ముందు నుంచే నివారించుకోవచ్చు.


అవయవాలను బట్టి రకాలు

కటి భాగంలో కండరాలు, కండర బంధనాలు ఎక్కడైనా బలహీనం కావొచ్చు. వీటిని బట్టి ఆయా అవయవాలు ప్రభావితమవుతాయి. జననాంగం మీదుండే కండరాలు బలహీనమైతే మూత్రాశయం కిందికి జారొచ్చు (సిస్టోసీల్‌). ఎక్కువమందిలో కనిపించేది ఇదే. కొందరిలో మూత్రనాళం కిందికి జారొచ్చు (యురెత్రోసీల్‌), జననాంగం, మలాశయం మధ్య కండరాలు బలహీనమైతే మలాశయం తోసుకురావొచ్చు (రెక్టోసీల్‌). కొందరిలో గర్భాశయమూ చొచ్చుకురావొచ్చు. జననాంగం కూడా జననాంగ మార్గంలోకి జారిపోవచ్చు.


ఎందుకు? ఎవరికి?

కటి అవయవాలన్నీ దగ్గర దగ్గరగా ఉంటాయి. వీటన్నింటినీ ఒకే విధమైన కండరాలు, కండర బంధనాలు పట్టి ఉంచుతాయి. ఇవి బలహీనం కావటమే సమస్యకు ప్రధాన కారణం. దీనికి రకరకాల అంశాలు దోహదం చేస్తుంటాయి.

  •  వెంట వెంటనే సంతానం: మహిళలు గర్భం ధరించినప్పుడు బిడ్డ ఎదుగుతున్నకొద్దీ గర్భాశయమూ పెద్దగా అవుతుంది. నెలలు నిండినప్పుడు కాన్పు సజావుగా కావటానికి కొన్ని హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి కండరాలు, అనుసంధాన కణజాలం మీదా ప్రభావం చూపుతాయి. దీంతో అవి కాస్త వదులవుతాయి. మరోవైపు కాన్పు సమయంలో బిడ్డ జననాంగ మార్గం నుంచి బయటకు వచ్చేటప్పుడు కండరాల మీద బాగా ఒత్తిడి పడుతుంది కూడా. ఫలితంగా కండరాలు, కండర బంధనాలూ సాగుతాయి. ఇవి పూర్వ స్థితికి రావటానికి కనీసం 18 నెలలు పడుతుంది. ఒకవేళ ఆలోపే తిరిగి గర్భం ధరిస్తే ఈ ప్రక్రియ దెబ్బతింటుంది. కవలలు, పిండం మరీ పెద్దగా ఉండటం వంటివీ కండరాలను దెబ్బతీయొచ్చు.
  •  పెద్ద వయసు: వయసు మీద పడుతున్నకొద్దీ మిగతా కండరాల మాదిరిగానే కటి కండరాల దృఢత్వమూ తగ్గుతూ వస్తుంది. ఇందుకు ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ తగ్గటమూ కారణమే. ఇది చాలా పనుల్లో పాలు పంచుకుంటుంది. కండరాలు, కండర బంధనాలు దృఢంగా ఉండటానికీ తోడ్పడుతుంది. నెలసరి నిలిచాక ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ఉత్పత్తి నిలిచిపోవటం వల్ల కండరాలూ బలహీనమవుతాయి. ముఖ్యంగా ఎక్కువ కాన్పులు అయినవారికి, పుట్టుకతో కణజాల సమస్యలు గలవారిలో ఇది ఎక్కువ.
  • అధిక బరువు, మరీ సన్నం: మరీ లావుగా ఉన్నవారికి పొట్టలో ఒత్తిడి పెరిగి కటి అవయవాలు తోసుకొచ్చే ప్రమాదముంది. మరీ సన్నగా ఉన్నవారికి దీని ముప్పు ఎక్కువే. వీరికి కాన్పు కష్టం కావటం వల్ల కండరాలు బలహీనమయ్యే అవకాశముంది.
  •  జన్యు కారణాలు: కొందరికి జన్యుపరంగా అనుసంధాన కణజాల సమస్యలుండొచ్చు. ఇలాంటివారికి పుట్టుకతోనే కండర బంధనాలు బలహీనంగా ఉంటాయి. వీరికి కాన్పులతో సంబంధం లేకుండా చిన్నవయసులోనే కటి అవయవాలు ముందుకు తోసుకురావొచ్చు.
  •  మల బద్ధకం: ఇది రెండు రకాలుగా ముప్పు తెచ్చిపెడుతుంది. మలబద్ధకం గలవారు విసర్జన సమయంలో గట్టిగా ముక్కుతుంటారు. అప్పటికే కటి కండరాలు బలహీనంగా ఉన్నట్టయితే ముక్కినప్పుడు అవయవాలు కిందికి జారొచ్చు. మరోవైపు కండరాలు బలహీనం కావటం వల్ల మలం ముందుకు కదలటమూ కష్టమవుతుంది. ఇది మలబద్ధకానికి దారితీస్తుంది. విసర్జనకు వెళ్లినప్పుడు ముక్కితే అవయవాలు మరింత ఎక్కువగా తోసుకురావొచ్చు.

    ప్రాణాంతకం కాకపోయినా..

  • పేగు జారటం ప్రాణాంతక సమస్యేమీ కాదు గానీ చాలా ఇబ్బంది పెడుతుంది. సంభోగ సమయంలో నొప్పి మూలంగా కొందరు శృంగారం మీదే విరక్తి చూపుతుంటారు. కొందరు నలుగురిలోకి వెళ్లటానికీ వెనకాడుతుంటారు. కొన్నిసార్లు పొడుచుకొచ్చిన అవయవాలను వేలితో లోపలికి తోస్తే గానీ విసర్జన సాధ్యం కాకపోవచ్చు. మూత్రాశయం మరీ కిందికి జారితే మూత్రనాళాలూ బయటకు రావొచ్చు. దీంతో మూత్రం పూర్తిగా బయటకు రాక కిడ్నీలు చెడిపోవచ్చు. గురుత్వాకర్షణ ప్రభావంతో అవయవాలు కిందికి జారుతున్నప్పుడు గర్భాశయ ముఖద్వారం వాచిపోతుంది. తోసుకొచ్చిన అవయం లోపలికి పోదు కూడా. రక్తసరఫరా నిలిచిపోయి ముఖద్వారం వద్ద పుండ్లూ పడొచ్చు.


    లక్షణాలు

  •  జననాంగంలో ఏదో ఉబ్బినట్టు, జారినట్టు అనిపించటం.
  •  కటి భాగం నిండుగా, బరువుగా ఉండటం. రోజు గడుస్తున్నకొద్దీ ఇవి ఎక్కువ కావటం.
  •  నడుం నొప్పి.
  • సంభోగ సమయంలో నొప్పి, లోపలేదో తాకినట్టు ఉండటం.
  •  దగ్గినా, తుమ్మినా ఉబ్బు ఎక్కువ కావటం. మూత్రం చుక్కలు పడటం.
  • మలబద్ధకం లేదా తెలియకుండానే విసర్జన కావటం

    చికిత్స

జననాంగ మార్గంలోకి తోసుకొచ్చిన గర్భసంచి

కటి అవయవాలు జారినవారికి మందులతో పెద్దగా ఉపయోగమేమీ ఉండదు. సమస్య అంత తీవ్రంగా లేనివారికి ముందుగా కటి కండరాలను బలోపేతం చేసే కీగెల్‌ వ్యాయామాలే సూచిస్తారు. ఫిజియోథెరిపిస్టు సాయంతో వీటిని నేర్చుకొని, సాధన చేయాల్సి ఉంటుంది. అలాగే జననాంగ మార్గంలో ప్రత్యేక సిలికాన్‌ పరికరాన్ని జొప్పించి, దాన్ని పట్టి ఉంచటానికి ప్రయత్నించే విధానమూ మేలు చేస్తుంది. వీటితో కండరాలు, కండర బంధనాలు బలోపేతమై అవయవాలు జారటం తగ్గుతుంది. ఆహారంలో తగినంత ప్రొటీన్‌ ఉండేలా చూసుకోవటమూ ముఖ్యమే.


అవసరమైతే శస్త్రచికిత్స

సంప్రదాయ పద్ధతులతో ఫలితం లేనప్పుడు శస్త్రచికిత్స అవసరమవుతుంది. ఆయా అవయవాలను పట్టి ఉంచే కండరాలు, కండర బంధనాలను సరిచేసి.. అవయవాలు వాటి స్థానంలో కుదురుకునేలా చూడటం ఇందులో కీలకాంశం. దీన్ని ఒకరకంగా ప్లాస్టిక్‌ సర్జరీ వంటిదని చెప్పుకోవచ్చు. వెడల్పుగా అయిన జననాంగ మార్గాన్ని చిన్నగా చేయటం (కాల్పోక్లీసిస్‌) ద్వారా అవయవాలు బయటకు పొడుచుకు రాకుండా చూడొచ్చు. జననాంగ గోడలకు కుట్లు వేస్తే (కాల్పోరఫీ) ద్వారా మూత్రాశయం, మలాశయానికి దన్నుగా నిలుస్తాయి. కండర బంధనాలు మరీ బలహీనమైతే కృత్రిమ బంధనాలనూ అమరుస్తారు. కొందరికి గర్భసంచి తొలగించాల్సి ఉంటుంది. గర్భసంచిని తొలగించినా సాగిన కండర బంధనాలను కురచగా, బిగుతుగా చేయాల్సి ఉంటుంది. గర్భసంచి తొలగించటం ఇష్టంలేనివారికి ల్యాప్రోస్కోపీతో మెష్‌ను అమర్చి (సాక్రోహిస్టెరోపెక్సీ), కండర బంధనాలను బలోపేతం చేస్తారు. ఇలాంటి శస్త్రచికిత్సలేవి చేసినా కూడా వ్యాయామాలు తప్పనిసరి.


దశలను బట్టి- నిర్ధరణ

కటి అవయవాలు జారటాన్ని నిర్ధరించటంలో ఆయా లక్షణాలు, జననాంగ మార్గాన్ని పరీక్షించటం ముఖ్యం. దగ్గినప్పుడు ఏదైనా పొడుచుకొని వస్తుందా? పడుకున్నప్పుడు, నిల్చునప్పుడు ఏదైనా తేడా ఉందా? అనేది చూస్తారు. అవసరమైతే మూత్రాశయ పనితీరు, అల్ట్రాసౌండ్‌, ఎంఆర్‌ఐ పరీక్షలు చేయిస్తారు. ఏదైనా తేడా ఉంటే పీఓపీ కోషెంట్‌ (పీఓపీ-క్యూ) పద్ధతితో సమస్య తీవ్రతను నిర్ధారిస్తారు. ఇందులో జననాంగ ద్వారానికి పైన అవయవాలు ఎంత దూరంలో ఉన్నాయో కొలిచి, అంకెలు కేటాయిస్తారు. వీటి ఆధారంగా దశలను నిర్ణయిస్తారు. సాధారణంగా ఇవి మైనస్‌ 3గా ఉండాలి. మైనస్‌ 2లోకి దిగితే మొదటి దశగా, మైనస్‌ 1కి వస్తే రెండో దశగా గుర్తిస్తారు. గట్టిగా ముక్కినప్పుడు గర్భాశయ ముఖద్వారం నుంచి అవయవం బయటకు తొసుకొస్తే ప్లస్‌1గా పరిగణిస్తారు. అక్కడి నుంచి  అవయవం ఎంత కిందికి దిగిందనే దాన్ని బట్టి దశలు మారతాయి.  పూర్తిగా గర్భాశయం బయటకు వస్తే నాలుగో దశగా భావిస్తారు. వీరిలో జననాంగం తలకిందులైపోతుంది. ఫలితంగా మూత్రాశయం, మలాశయం కూడా వెలుపలికి రావొచ్చు.


నివారించుకోవచ్చు

ముందు నుంచే జాగ్రత్త పడితే పేగు జారటాన్ని చాలావరకు నివారించుకోవచ్చు. కాన్పు అనంతరం కటి కండరాలను, పొట్ట కండరాలను బలోపేతం చేసే కీగెల్‌ వ్యాయామాలు ఇందుకు బాగా ఉపయోగపడతాయి. వీటితో కండరాలు తిరిగి దృఢమవుతాయి. వీటిని రోజూ చేస్తే ఇంకా మంచిది.

  •  వెంట వెంటనే పిల్లల్ని కనరాదు. బిడ్డకూ బిడ్డకూ మధ్య కనీసం రెండేళ్ల ఎడం పాటించాలి.
  •  బరువు మరీ పెరగకుండా జాగ్రత్త పడాలి.
  • మల విసర్జన సమయంలో ముక్కితే కటి కండరాల మీద ఒత్తిడి పడుతుంది. కాబట్టి మలబద్ధకం లేకుండా చూసుకోవాలి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని