Mental Health: మనసా క్షేమమా!

శరీరం, మనసు పరస్పర ఆధారితాలు. ఒకటి బాధపడితే మరోటీ దుఃఖిస్తుంది. ఒకటి ఆనందిస్తే మరోటీ సంతోషిస్తుంది.

Updated : 10 Oct 2023 07:21 IST

నేడు వరల్డ్‌ మెంటల్‌ హెల్త్‌ డే

శరీరం, మనసు పరస్పర ఆధారితాలు. ఒకటి బాధపడితే మరోటీ దుఃఖిస్తుంది. ఒకటి ఆనందిస్తే మరోటీ సంతోషిస్తుంది. అందుకే శారీరక ఆరోగ్యమే కాదు.. మానసిక ఆరోగ్యమూ ముఖ్యమే. ఆ మాటకొస్తే చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు.. ఇలా ఏ రంగంలోనైనా విజయం సాధించటంలో ముఖ్యపాత్ర పోషించేది ఇదే. శారీరక ఆరోగ్యం ఆయా పనులకు అవసరమైన సామర్థ్యం కల్పిస్తుండొచ్చు గానీ మనసు బాగా లేకపోతే పనులేవీ సక్రమంగా సాగవు. నైపుణ్యం, ఉత్పాదకతా తగ్గుతాయి. రోజువారీ పనులు, వ్యవహారాల్లో ఎదురయ్యే ఒత్తిళ్లను ఎదుర్కోవటం, ఇతరులతో సంబంధాలు నెరపటం, లక్ష్యాన్ని నిర్ణయించుకొని దాన్ని సాధించటం వంటి వాటికి మానసికంగా దృఢంగా ఉండటం కీలకం. అందుకే ‘మానసిక ఆరోగ్యం సార్వత్రిక హక్కు’ అని వరల్డ్‌ మెంటల్‌ హెల్త్‌ డే నినదిస్తోంది. ఈ నేపథ్యంలో మానసిక ఆరోగ్యం, సమస్యలు, నివారణ, చికిత్సల ఆవశ్యకతపై సమగ్ర కథనం మీకోసం.

కనిపించదు గానీ మనసు ఎన్నో మాయలు చేస్తుంది. మన ఆలోచనలు, ప్రవర్తన, భావోద్వేగ బంధాలు, బంధుత్వాలు అన్నీ దీని చలవే. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకూ జీవితంలో ప్రతి దశలోనూ ప్రభావం చూపుతుంది. మనం చేసే పనులు, నేర్చుకునే నైపుణ్యాలకిదే కీలకం. భావోద్వేగాలు, మానసిక ధోరణి, సామాజిక సంబంధాలన్నీ మానసిక ఆరోగ్యంలో భాగమే. మనమెలా ఆలోచిస్తున్నాం? ఎలా భావిస్తున్నాం? ఎలా పని చేస్తున్నాం? అనేవి దీని మీదే ఆధారపడి ఉంటాయి. ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటున్నాం? ఇతరులతో సంబంధాలను ఎలా ఏర్పరచుకుంటున్నాం? నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నాం? అవకాశాలను ఎలా అందిపుచ్చుకుంటున్నాం? అనే వాటినీ నిర్ణయిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీన్నే నొక్కి చెబుతోంది. ‘జీవితంలో సహజంగా ఎదురయ్యే ఒత్తిళ్లను ఎదుర్కొని.. నైపుణ్యంతో సమర్థంగా పనిచేసి తమకు, సమాజానికి మేలు చేయగల సామర్థ్యాలను గుర్తించ గలిగే వ్యక్తి ఆరోగ్య స్థితిని మానసిక ఆరోగ్యం’ అని నిర్వచిస్తోంది. శారీరక ఆరోగ్యం మాదిరిగానే మానసిక ఆరోగ్యమూ జీవితాంతం మారుతూ వస్తుంది. ఇది కొన్నిసార్లు బాగుండొచ్చు, కొన్నిసార్లు బాగానే ఉందనిపించొచ్చు. మరి కొన్నిసార్లు ఏమాత్రం బాగా లేకపోవచ్చు, ఒక్కోసారి సమస్యగానూ పరిణమించొచ్చు. కాబట్టి మానసిక ఆరోగ్యం ప్రాధాన్యాన్ని తెలుసుకోవటం, మానసిక సమస్యల బారినపడకుండా నివారించుకోవటం, వీటి బారినపడితే చికిత్స తీసుకోవటం తప్పనిసరి.

ఎక్కడివీ భావోద్వేగాలు?

మన శరీరం మొత్తాన్ని నియంత్రించేది మెదడే. దీన్నుంచి అందే సంకేతాలతోనే పనులన్నీ సాగుతాయి. మెదడు చేసే మరో పని ఆలోచించటం. ఇది ప్రతి నిమిషమూ ఈ పనిలోనే మునిగి ఉంటుంది. భావోద్వేగాలూ దీన్నుంచే పుట్టుకొస్తాయి. వీటికి మూలం మెదడులో విడుదలయ్యే హార్మోన్లు (న్యూరోట్రాన్స్‌మిటర్లు). అడ్రినలిన్‌తో కోపం, భయం, ఆందోళన తలెత్తితే.. ఆక్సిటోసిన్‌ ప్రేమ, నమ్మకం, సానుభూతిని కలిగిస్తుంది. కార్టిజాల్‌తో ఒత్తిడి.. సెరటోనిన్‌తో ఆనందం, విచారం.. డోపమిన్‌తో గర్వం, ఉత్సుకత పుడతాయి. మెదడులో ఏయే హార్మోన్లు ఉత్తేజితమైతే ఆయా భావాలు మనసులో రేగుతాయి. ఆనందం, ప్రేమ, నమ్మకం మనసును ఉల్లాసపరిస్తే.. కోపం, భయం, ఆందోళన, ఒత్తిడి, విచారం మనిషిని జావగారుస్తాయి. జీవితం ఎప్పుడూ ఒకేలా సాగదు. ఆటుపోట్లు, కష్టాలు, నష్టాలు సహజం. ఆత్మీయులు దూరం కావటమో, ఆశించిన ఉద్యోగం లభించకపోవటమో, తీవ్ర ప్రమాదాలకు గురికావటమో.. ఇలా అనూహ్య ఘటనలు ఎదురైనప్పుడు తీవ్ర భావోద్వేగాలకు లోనవ్వటం, విచారం, బాధ, దుఃఖం కలగటం మామూలే. వీటి నుంచి చాలామంది తేలికగానే బయటపడతారు. కొద్దిరోజుల్లోనే మామూలుగా అవుతారు. కానీ కొందరు అదేపనిగా వాటినే తలచుకుంటూ కుంగిపోతుంటారు. వారాలు, నెలలు దాటినా విచారం, బాధ వదలవు. ఇవే క్రమంగా సమస్యలుగా మారతాయి. మానసిక ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు వంటివన్నీ ఇలాంటివే.  

ఎవరికైనా రావొచ్చు

‘మానసిక సమస్యలు మా ఇంటా, ఒంటా లేవు. నాకెందుకు వస్తాయి’ అని అనుకోవద్దు. ఇవి ఎవరికైనా రావొచ్చు. దాదాపు ప్రతి ఐదుగురిలో ఒకరు వీటి బారినపడుతున్నారని అంచనా. ఉన్నట్టుండి, ఏదో ఒక ఘటన అనంతరం మానసిక సమస్యలు తలెత్తినట్టు కనిపిస్తుంటాయి గానీ వీటికి బీజం చాలాకాలం ముందే పడుతుంది. ఇందులో జన్యువుల దగ్గరి నుంచి మెదడు పనితీరు, ఆహారం, కాలుష్య ప్రభావాల వరకూ ఎన్నెన్నో అంశాలు పాలు పంచుకుంటాయి. బాల్యంలో ఎదురైన అనుభవాలూ.. అంటే హింస, వేధింపులు, అవమానాలకు గురికావటం వంటివీ దోహదం చేస్తుంటాయి.

లోపం, బలహీనత కాదు

మనదేశంలో రోజురోజుకీ మానసిక సమస్యలు ఎక్కువవుతుండటం ఆందోళనకరం. జీవనకాలంతో పాటు ఇవీ పెరుగుతూ వస్తున్నాయి. చిన్న కుటుంబాలు పెరగటం, అత్యవసర సమయాల్లో తోడు లేకపోవటం వంటివెన్నో దీనికి కారణమవుతున్నాయి. చదువులు కెరియర్‌ ఆధారితంగా మారటం, ఉద్యోగాల్లోనూ పోటీ తత్వం పెరగటం మనసు మీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయి కొందరు వ్యసనాలకు బానిస కావటం, ఆత్మహత్యలకు పాల్పడటమూ గమనిస్తున్నాం. కాబట్టి మానసిక సమస్యలను తేలికగా తీసుకోవటానికి లేదు. చిక్కేంటంటే- చాలామంది వీటిని జబ్బుగా గుర్తించకపోవటం. అదేదో తమ లోపమనో, బలహీనతనో భావిస్తుంటారు. మానసిక సమస్యలతో బాధపడుతున్నామని నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారో, చిన్నచూపు చూస్తారేమోననీ భయపడుతుంటారు. ఇది తగదు. జ్వరం, దగ్గు మాదిరిగా మానసిక సమస్యలూ జబ్బులేనని.. అవసరమైనప్పుడు వీటికీ చికిత్స తీసుకోవాలని, మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయని గుర్తించాలి.

హెచ్చరిక సంకేతాలు

మానసిక సమస్యలు గలవారిలో ఆలోచనలు, భావోద్వేగాలు, ప్రవర్తనలో స్పష్టంగా మార్పులు కనిపిస్తాయి. కొందరు తమకు తామే వీటిని గుర్తించగలుగుతారు. కొన్నిసార్లు చుట్టుపక్కల వాళ్లు గమనించి, చెబుతుంటారు. ప్రధానంగా కనిపించే హెచ్చరికలు ఇవీ..

  • మునుపటి కన్నా తక్కువగా లేదా ఎక్కువ తినటం.
  • నిద్ర సరిగా పోకపోవటం లేదా అతిగా పడుకోవటం.
  • హుషారు, ఉత్సాహం తగ్గటం.
  • నీరసం, నిస్సత్తువ, బద్ధకం.
  • ఆసక్తి తగ్గటం, దేని మీదా ఇష్టం లేకపోవటం. అలవాట్లు, హాబీలు మానెయ్యటం.
  • దేనికీ సంతోషించకపోవటం. ఒకప్పుడు సంతోషం కలిగించినవి ఇప్పుడు ఆనందం కలిగించకపోవటం.
  • నలుగురితో కలవకుండా ఒంటరిగా ఉండటానికి ప్రయత్నించటం.
  • కొన్నిసార్లు మానసికంగా తెలియని జబ్బులు శారీరకంగా కనిపించొచ్చు. ఇవి నొప్పులు.. కాళ్లు, మెడ పట్టేయటం వంటి వాటి రూపంలో బయట పడుతుంటాయి.
  • పొగ తాగటం, మద్యం తాగటం, మాదక ద్రవ్యాలు తీసుకోవటం వంటి దురలవాట్లకు లోనవటం. అప్పటికే ఇలాంటి అలవాట్లుంటే మరింత ఎక్కువ కావటమూ కనిపిస్తుంది.
  • కుటుంబ సభ్యులు, స్నేహితుల మీద అకారణంగా, అనవసరంగా అరవటం, కోప్పడటం, తగాదాలు పెట్టుకోవటం.
  • అప్పటికప్పుడే భావోద్వేగాలు విపరీతంగా మారటం. ఇది సంబంధాల విషయంలో చిక్కులు తెచ్చిపెడుతుంది.
  • అదే పనిగా ఆలోచనలు మనసును విడవకుండా వేధిస్తుండటం. వర్తమానంలో గడపకుండా పదే పదే పాత జ్ఞాపకాలను వల్లె వేసుకోవటం.
  • పరిస్థితి విషమిస్తే- ఎవరో ఏదో మాట్లాడుతున్నట్టు అనిపించటం, లేనివి ఉన్నట్టుగా ఊహించుకోవటం. ఇతరులు తమకు హాని తలపెడుతున్నట్టు భావించటం. తమను తాము గాయపరచుకోవటం, ఇతరుల మీద దాడి చేయటం. ఇంట్లో, ఆఫీసులో రోజువారీ పనులు చేయలేకపోవటం.

డాక్టర్‌ దగ్గరికి ఎప్పుడు?

ఆలోచనలు, భావాలు గణనీయంగా ప్రభావితం చూపుతున్నాయని అనిపించినప్పుడు.. వీటితో పక్కవారికి ఇబ్బంది కలుగుతున్నప్పుడు వెంటనే అప్రమత్తం కావాలి. ఇవి మన రోజువారీ పనులకు, ఉద్యోగాలు, చదువులు, వ్యాపారాలకు ఆటంకంగా పరిణమిస్తుంటే తాత్సారం చేయరాదు. వెంటనే మానసిక నిపుణులను సంప్రదించాలి. ముందుగానే చికిత్స ఆరంభిస్తే త్వరగా కోలుకోవచ్చు. మెదడు మీద ఎక్కువ ప్రభావం పడకుండా చూసుకోవచ్చు. మానసిక సమస్యల్లో అన్నింటికీ మందులే అవసరపడకపోవచ్చు. ప్రవర్తన సమస్యల వంటివి కౌన్సెలింగ్‌, కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీలతోనే నయమవుతాయి. కుంగుబాటు, భయాలు, అదే పని మళ్లీ మళ్లీ చేయటం, మద్యానికి బానిస కావటం వంటివి మందులతో త్వరగా తగ్గే అవకాశముంది. అవసరమైతే మందులతో పాటు కౌన్సెలింగ్‌ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. చికిత్స మొదలెట్టాక అంతా బాగానే ఉన్నట్టు అనిపించినా కూడా డాక్టర్‌ సలహా లేకుండా మందులు, చికిత్సలను మధ్యలో ఆపేయొద్దు.

స్వీయ శ్రద్ధ: మానసిక సమస్యలతో బాధపడేవారు వేధిస్తున్న సమస్య గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలి. దాన్నుంచి బయటపడటానికి తమకు తామే శ్రద్ధ తీసుకోవాలి. పనులను విభజించుకొని, వరుసగా చేయటం అలవరచుకోవాలి. దీంతో అనవసరమైన విషయాల మీదికి మనసు మళ్లకుండా చూసుకోవచ్చు. అదేపనిగా ఒకే గదిలో, ఇంట్లో ఉండకుండా అప్పుడప్పుడు బయటకు వెళ్లాలి. నాలుగడుగులు వేసినా శరీరానికి కొత్త శక్తి లభిస్తుంది. ఆటలాడినా, వ్యాయామం చేసినా మంచిదే. పెద్ద పెద్ద కసరత్తులే అవసరం లేదు. శరీరాన్ని సాగదీసే చిన్నపాటి కదలికలూ మేలు చేస్తాయి. ఆస్వాదిస్తూ చేసే ఏ పనైనా ఉపశమనం కలిగిస్తుందని గుర్తించాలి.

కాపాడుకోవటానికి మార్గముంది

మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అంత కష్టమేమీ కాదు. చిన్న చిన్న జాగ్రత్తలతోనే పరిరక్షించుకోవచ్చు. 

ప్రకృతితో సన్నిహితంగా..

ప్రకృతి మనసుకు చాలా ప్రశాంతత కలిగిస్తుంది. వేలాది ఏళ్లుగా మనం జంతువులు, వృక్షాల మధ్యే గడుపుతూ వస్తున్నాం. ఇప్పటికీ మనం అప్పుడప్పుడు వన భోజనాలకు వెళ్లటం చూస్తున్నదే. ఇది మనసుకు ఆహ్లాదం కలిగిస్తుంది. రోజువారీ అలసటను దూరం చేసి ఉత్తేజాన్నిస్తుంది. చెట్ల మధ్యలోకి వెళ్లినప్పుడు పక్షుల అరుపులు, ఆకుల రంగులు, మట్టి వాసన, జలపాతాలు, సరస్సులు.. అన్నింటినీ గమనిస్తూ వాటితో మమేకమైతే మరింత మంచి ఫలితం కనిపిస్తుంది.

భావోద్వేగాలను అర్థం చేసుకోవటం

ఎప్పుడెప్పుడు భావోద్వేగాలకు లోనవుతున్నామో తెలుస్తూనే ఉంటుంది. కానీ అది విచారమా? భయమా? ఒంటరితనమా? కోపమా? ఇంకేదైనా అనేది కచ్చితంగా తెలియదు. అలాంటి భావాలు ఎందుకు కలుగుతున్నాయో చాలాసార్లు తెలియదు. కారణాలను అర్థం చేసుకోగలిగితే అడ్డుకోవటం తేలికవుతుంది.

మనతో మనమే దయతో మాట్లాడుకోవటం

చిన్న పిల్లాడిని బుజ్జగించినట్టు మనతో మనమే దయ, కరుణతో మాట్లాడుకోవటమూ మేలే. ఇది విచిత్రంగా అనిపించినా ఎంతో సాంత్వన కలిగిస్తుంది. మనసులోని భావాలను కాగితం మీద రాసినా, బొమ్మలు గీసినా మనసు తేలిక పడుతుంది.

నమ్మకమైన వారితో చర్చించటం

మన సమస్యలను తమ సమస్యలుగా భావించే నమ్మకమైన వారితో చర్చించాలి. ఆలోచనలు, ఆందోళనలను పంచుకోవాలి. ఇతరులతో మాట్లాడితే మన దృక్కోణం, పరిస్థితుల పట్ల భావాలూ మారతాయి. సంబంధాలూ బలపడతాయి. దీంతో అవసరమైనప్పుడు సహాయం చేయటానికి ముందుకు వస్తారు కూడా.

ఆత్మీయ బంధాల తోడు

కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులతో మంచి సంబంధాలు నెలకొల్పుకోవాలి. విపత్కర పరిస్థితుల్లో ఆత్మీయులు తోడుంటే ఆ భరోసానే వేరు. ఇది మనసును దృఢంగా చేస్తుంది. ఒకవేళ ఏదైనా సమస్య ఉన్నా త్వరగా బయటపడేలా చేస్తుంది.

వ్యాయామం క్రమంగా  

వ్యాయామంతో మనసును ఉల్లాసపరిచే ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. కోపం వంటి భావోద్వేగాలను తగ్గిస్తాయి. వ్యాయామం, శారీరక శ్రమతో కంటి నిండా నిద్ర పడుతుంది కూడా. కావాలంటే ఆటలు ఆడొచ్చు. తోటపనీ చేయొచ్చు. ధ్యానం, యోగా, ప్రాణాయామం వంటివీ మేలే. ఇవి మనసును కుదురుగా ఉంచి, అనవసర ఆలోచనలు తలెత్తకుండా చూస్తాయి.

కంటి నిండా నిద్ర

నిద్రకూ మానసిక ఆరోగ్యానికీ దగ్గరి సంబంధముంది. మానసిక సమస్యలతో నిద్ర సరిగా పట్టకపోవచ్చు. కంటి నిండా నిద్ర పోకపోతే మనసు మీద విపరీత ప్రభావం చూపొచ్చు. నిద్రలేమితో మెదడులో కొన్ని భాగాల పనితీరు మారుతున్నట్టూ అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి కంటి నిండా నిద్రపోవాలి. సాయంత్రం వేళ స్నానం చేయటం, పడుకునే ముందు పాలు తాగటం, మంచి పుస్తకం చదవటం, సంగీతం వినటం, గంట ముందే టీవీలు, మొబైల్‌ ఫోన్లు కట్టేయటం వంటివి నిద్ర బాగా పట్టేలా చేస్తాయి.

ఇష్టమైన హాబీలు అలవరచుకోవాలి

ఎలాంటి పనులతో ఆహ్లాదం కలుగుతుందో గుర్తించి, పాటించాలి. వీటితో మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. నిజానికి ఇష్టమైన హాబీలు గలవారు తక్కువ ఒత్తిడికి గురవుతారు. వీరిలో ఆత్మ విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. కుంగిపోవటం తక్కువ.

సేవా మార్గం

సేవా కార్యక్రమాలు మనసుకు కొత్త ఉత్తేజాన్నిస్తాయి. ఇతరులకు చిన్న సహాయం చేసినా, నవ్వుతో పలకరించినా మంచి ఫలితం కనిపిస్తుంది. ఆత్మ విశ్వాసం ఇనుమడిస్తుంది. సంబంధాలూ మెరుగవుతాయి. ఇవన్నీ ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోవటానికి తోడ్పడేవే.

దురలవాట్లకు దూరం

బాధ, విచారం వంటివి తగ్గటానికి చాలామంది మద్యం, పొగ తాగటం వంటివి చేస్తుంటారు. మాదకద్రవ్యాలకూ అలవడుతుంటారు. వీటితో తాత్కాలికంగా ఉపశమనం కలగొచ్చు గానీ ఇవేమీ భావోద్వేగాలను తగ్గించవు. మరింత ఎక్కువ చేస్తాయి. ఆరోగ్యం, సంబంధాలు దెబ్బతినటం వంటి ఇతరత్రా సమస్యలూ మొదలవుతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని