నీటికాసుల సునామీ

చూపును దొంగ దెబ్బతీసే నీటికాసుల సమస్య (గ్లకోమా) వృద్ధుల్లో సునామీలా విరుచుకుపడుతోంది. దీని బారినపడేవారి సంఖ్య 2050 వరకు 200% పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Published : 17 Oct 2023 00:28 IST

చూపును దొంగ దెబ్బతీసే నీటికాసుల సమస్య (గ్లకోమా) వృద్ధుల్లో సునామీలా విరుచుకుపడుతోంది. దీని బారినపడేవారి సంఖ్య 2050 వరకు 200% పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే నీటికాసులు గలవారిలో సుమారు సగం మందికి ఆ విషయమే తెలియకపోవటం. స్వీడన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ గోథెన్‌బర్గ్‌ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఇదే వెల్లడైంది. 70 ఏళ్లు పైబడ్డవారిలో 5% మందికి నీటికాసులు బయటపడగా.. వీరిలో సగం మందికి తమకు ఆ సమస్య ఉందన్న విషయమే తెలియదని వెల్లడైంది. గ్లకోమాను ముందుగానే గుర్తించటం, అధునాతన చికిత్సల రూపకల్పన అత్యావశ్యకమని ఇది సూచిస్తోంది. నీటికాసులకు మూలం కంట్లో ఒత్తిడి పెరగటం. నిరంతరం ఒత్తిడి పడటం వల్ల కళ్ల నుంచి మెదడుకు సమాచారాన్ని చేరవేసే దృశ్యనాడి దెబ్బతింటుంది. దీన్ని సత్వరం గుర్తించి, చికిత్స చేయటం తప్పనిసరి. లేకపోతే పాక్షికంగా చూపు తగ్గుతూ వస్తుంది. కొందరికి పూర్తిగానూ పోవచ్చు. గ్లకోమా నెమ్మదిగా ముదురుతూ రావటం వల్ల తొలిదశలో పెద్దగా లక్షణాలేవీ ఉండవు. మొదట్లో చుట్టుపక్కల నుంచి చూపు తగ్గుతూ వస్తుంది. అంటే గొట్టంలోంచి దృశ్యాలను చూసినట్టు ఉంటుందన్నమాట. చివరికి మధ్యలోని చూపూ పోతుంది. చాలామంది దీన్ని వయసుతో పాటు చూపు తగ్గటంగా భావిస్తుంటారు. నీటికాసులను పోల్చుకోవటంలో పొరపడుతుంటారు. గుర్తించే సరికే పరిస్థితి చేజారుతుంది. నీటికాసులతో పోయిన చూపు తిరిగి రాకపోవటం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని