రక్తం పోటెత్తుతోంది!

అధిక రక్తపోటు (హైబీపీ) నిశ్శబ్ద హంతకి. పైకేమీ తెలియకుండా లోలోపలే తీవ్ర నష్టం కలిగిస్తుంది. నిజానికిది తేలికగా గుర్తించదగిందే. జీవనశైలి, మందులతో సులభంగా అదుపులో ఉంచుకోదగిందే. అయినా ఎంతోమంది నిర్లక్ష్యం చేస్తుండటం ఆందోళనకరం.

Updated : 31 Oct 2023 07:09 IST


అధిక రక్తపోటు (హైబీపీ) నిశ్శబ్ద హంతకి. పైకేమీ తెలియకుండా లోలోపలే తీవ్ర నష్టం కలిగిస్తుంది. నిజానికిది తేలికగా గుర్తించదగిందే. జీవనశైలి, మందులతో సులభంగా అదుపులో ఉంచుకోదగిందే. అయినా ఎంతోమంది నిర్లక్ష్యం చేస్తుండటం ఆందోళనకరం. ప్రపంచ ఆరోగ్యసంస్థ తొలిసారి అధిక రక్తపోటు మీద వెలువరించిన నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది, మనదేశంలో 18.83 కోట్ల మంది దీంతో బాధపడుతున్నారని వివరిస్తోంది. వీరిలో దాదాపు సగం మందికి జబ్బుందన్న సంగతే తెలియకపోవటం.. తెలిసినవారిలోనూ ప్రతి ఐదుమందిలో నలుగురే సరైన చికిత్స తీసుకుంటుండటం విచిత్రం. అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేస్తే పక్షవాతం, గుండెజబ్బు, కిడ్నీ వైఫల్యం వంటి తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. ప్రాణాలకూ ముప్పు వాటిల్లొచ్చు. తగు చికిత్స తీసుకుంటే 2050 కల్లా అధిక రక్తపోటుతో సంభవించే 7.6 కోట్ల మరణాలను ఆపొచ్చు! కాబట్టి అధిక రక్తపోటు మీద అంతా అవగాహన కలిగుండటం తప్పనిసరి.

మన శరీరంలో ప్రతి కణానికీ రక్తం అవసరం. దీని ద్వారానే ఆక్సిజన్‌, పోషకాలు అందుతాయి. రక్తం అన్ని అవయవాలకూ సరిగ్గా సరఫరా కావటానికి గుండె కాస్త బలంగా పంప్‌ చేస్తుంటుంది. ఈ క్రమంలో రక్తనాళాల గోడల మీద కాస్త ఒత్తిడి పడుతుంది. ఇదే రక్తపోటు. దీన్ని రెండు సంఖ్యలతో (120/80) సూచిస్తుంటారు. ఇందులో మొదటి లేదా పైసంఖ్య సిస్టాలిక్‌ పోటుకు.. అంటే గుండె సంకోచించి, రక్తాన్ని పంప్‌ చేస్తున్నప్పుడు రక్తనాళాల గోడల మీద పడే ఒత్తిడికి సంకేతం. ఇక కింది లేదా తర్వాతి సంఖ్య డయాస్టాలిక్‌ పోటుకు.. గుండె వ్యాకోచించినప్పుడు రక్తనాళాల్లో ఉండే ఒత్తిడిని సూచిస్తుంది. రక్తపోటు 120/80, అంతకన్నా తక్కువగా ఉండటం నార్మల్‌. అదే 140/90 కన్నా పెరిగితే అధిక రక్తపోటుగా పరిగణిస్తారు. అయితే అందరిలోనూ రెండు సంఖ్యలు పెరగాలనేమీ లేదు. కొందరిలో ఒకటే పెరగొచ్చు. రెండు సంఖ్యల్లో ఏది పెరిగినా అధిక రక్తపోటుగానే భావిస్తారు.

రెండు రకాలు

అధిక రక్తపోటును రెండు రకాలుగా విభజించుకోవచ్చు. 1. ఇతరత్రా సమస్యలతో ముడిపడనిది (ప్రైమరీ హైపర్‌టెన్షన్‌). చాలామందిలో కనిపించేది ఇదే.
2. ఇతర జబ్బులతో ముడిపడినది (సెకండరీ హైపర్‌టెన్షన్‌). కిడ్నీ వైఫల్యం, థైరాయిడ్‌, అడ్రినల్‌ గ్రంథి సమస్యలు.. పుట్టుకతోనే గుండె రక్తనాళాల్లో లోపాలు ఉండటం, రక్తనాళాల లోపల కందిపోయి, వాపు తలెత్తటం (వ్యాస్కులైటిస్‌) వంటివి దీనికి దోహదం చేస్తుంటాయి. అందువల్ల అధిక రక్తపోటు విషయంలో ఇలాంటి సమస్యలనూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

ఎందుకొస్తుంది?

ఇతరత్రా సమస్యలేవీ లేకుండా తలెత్తే అధిక రక్తపోటుకు రకరకాల కారణాలు దోహదం చేస్తుండొచ్చు.

జన్యువులు: కొన్ని కుటుంబాల్లో అధిక రక్తపోటు వంశ పారంపర్యంగా రావొచ్చు. దీనికి జన్యు పరమైన అంశాలు దోహదం చేస్తుంటాయి. వీరిలో చిన్నవయసులోనే అధిక రక్తపోటు మొదలవుతుండటం గమనార్హం.
వయసు: వయసు మీద పడుతున్నకొద్దీ రక్తనాళాల మృదుత్వం తగ్గుతుంది. దీంతో రక్తనాళాలు సరిగా సాగవు. ఫలితంగా వీటి లోపల రక్తం అధిక పీడనంతో ప్రవహించొచ్చు.

అనారోగ్యకర జీవనశైలి: ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఇదే. పొగ అలవాటు, ఎక్కువగా మద్యం తాగటం రక్తపోటు పెరిగేలా చేయొచ్చు. వ్యాయామం, శారీరక శ్రమ అంతగా చేయకుండా బద్ధకంగా ఉండటం మరో కారణం.
అధిక బరువు: బరువు మితిమీరితే శరీరంలో ఇన్సులిన్‌, లెప్టిన్‌, కార్టిజోల్‌ వంటి హార్మోన్ల మోతాదులు పెరగొచ్చు. దీంతో ఒంట్లో ద్రవాల స్థాయులు, రక్తంలో గ్లూకోజు, కొలెస్ట్రాల్‌ పెరిగే అవకాశం ఎక్కువ. శరీరానికి అవసరమైన రక్తాన్ని పంప్‌ చేయటానికి గుండె మరింత బలంగా పనిచేయాల్సి ఉంటుంది కూడా. ఇవన్నీ రక్తపోటు పెరిగేలా చేసేవే. బరువు మామూలుగానే ఉన్నా బొజ్జ పెద్దగా ఉండటమూ ప్రమాదకరమే.
మానసిక ఒత్తిడి: ఇది ఎక్కువైనప్పుడు రక్తంలోకి ఒత్తిడి హార్మోన్లు (కాటాకొలమైన్స్‌)  విడుదలవుతాయి. ఇవి రక్తనాళాలు సంకోచించేలా చేయటమే కాదు, గుండె వేగాన్నీ పెంచుతాయి. గుండె మరింత బలంగా పనిచేసేలా పురికొల్పుతాయి. కాబట్టి దీర్ఘకాలం మానసిక ఒత్తిడితో బాధపడేవారికి అధిక రక్తపోటు ముప్పూ పెరుగుతుంది.
నిద్రలేమి: రాత్రిపూట సరిగా నిద్రపట్టకపోయినా ఒత్తిడి హార్మోన్ల మోతాదులు పెరుగుతాయి. ఫలితంగా రక్తపోటూ ఎక్కువవుతుంది. ప్రస్తుతం షిఫ్ట్‌ ఉద్యోగుల్లో అధిక రక్తపోటుకు ప్రధాన కారణమిదే అని చెప్పుకోవచ్చు.
మధుమేహం: దీనికీ అధిక రక్తపోటుకు దగ్గరి సంబంధముంది. మధుమేహంతో బాధపడే ప్రతి పది మందిలో ఆరుగురికి అధిక రక్తపోటు కూడా ఉంటుండటం గమనార్హం.
గురక: కొందరికి నిద్రలో కాసేపు శ్వాస ఆగిపోతుంటుంది (స్లీప్‌ అప్నియా). అప్పుడు బిగ్గరగా గురక పెడుతూ శ్వాస తీసుకుంటుంటారు. ఇదీ రక్తపోటు పెరగటానికి దారితీస్తుంది.

ఎప్పుడు సమస్య?

పరీక్ష రాసేటప్పుడు ఆదుర్దా పడొచ్చు. నలుగురిలో మాట్లాడే సమయంలో ఒత్తిడికి గురికావొచ్చు. గబగబా నడిచినప్పుడు, పరుగెత్తినప్పుడు శరీరానికి ఎక్కువ రక్తం అవసరమవుతుంది. ఇలాంటి సమయంలో గుండె వేగం ఎక్కువై రక్తపోటు పెరగొచ్చు. వీటిని సమస్యగా భావించాల్సిన పనిలేదు. ఒత్తిడికి గురికాకుండా, పూర్తిగా విశ్రాంతిగా ఉన్నప్పుడూ రక్తపోటు నిరంతరం ఎక్కువగా ఉండటమే సమస్య.

నిర్లక్ష్యం చేస్తే అంతే..

మనదగ్గర అధిక రక్తపోటుతో బాధపడేవారిలో సగం మందే మందులు వేసుకోవటం.. వీరిలోనూ సగం మంది మధ్యలోనే మానెయ్యటం చూస్తున్నాం. అంటే మన సమాజంలో వంద మందికి అధిక రక్తపోటు ఉంటే కేవలం 25-30 మందే అదుపులో ఉంచుకుంటున్నారన్నమాట. ఇదే ప్రమాదకరంగా పరిణమిస్తోంది. అధిక రక్తపోటు శరీరంలోని అన్ని భాగాల మీదా విపరీత ప్రభావం చూపుతుందని గమనించాలి.
గుండె జబ్బు: అదేపనిగా రక్తపోటు ఎక్కువగా ఉంటే రక్తనాళాల లోపలి పైపొర దెబ్బతిని, క్రమంగా పూడికలు ఏర్పడొచ్చు. గుండె రక్త నాళాల్లో పూడికలు ఏర్పడితే గుండెపోటు తలెత్తొచ్చు. దీర్ఘకాలంగా రక్తపోటు ఎక్కువగా ఉంటే గుండె కండరం మందం కావొచ్చు కూడా. దీంతో కండరం వ్యాకోచించే స్వభావం తగ్గుతుంది. ఫలితంగా ఒత్తిడి పెరిగి, గుండె వైఫల్యానికి దారితీయొచ్చు. కొందరికి గుండె లయ అస్తవ్యస్తం కావొచ్చు.  
పక్షవాతం: మెదడు రక్తనాళాల్లో పూడికలు గలవారికి వీటి మీద హఠాత్తుగా రక్తం గడ్డలు ఏర్పడి, నాళం మొత్తం మూసుకు పోవచ్చు. దీంతో మెదడులో ఆయా భాగాలకు రక్త సరఫరా నిలిచిపోయి, పక్షవాతం తలెత్తొచ్చు. రక్తపోటు మరీ ఎక్కువైతే మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి, రక్తస్రావమూ కావచ్చు. ఇదీ పక్షవాతానికి దారితీస్తుంది.
కిడ్నీ వైఫల్యం: కిడ్నీ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడితే మూత్రపిండాలకు రక్త సరఫరా తగ్గిపోతుంది. దీంతో కిడ్నీ సామర్థ్యం తగ్గొచ్చు. అదేపనిగా రక్తపోటు ఎక్కువగా ఉండటం మూలంగానూ కిడ్నీల పనితీరు మందగించొచ్చు. కిడ్నీ వైఫల్యానికి ప్రధాన కారణాల్లో అధిక రక్తపోటు ఒకటి.
చూపు మందగించటం: అధిక రక్తపోటుతో కంట్లోని రక్తనాళాలు దెబ్బతిని చూపు మందగించే ప్రమాదముంది.

నిర్ధరణ పద్ధతిగా..

తొలిసారి పరీక్షించినప్పుడు రక్తపోటు ఎక్కువున్నంత మాత్రాన సమస్యగా నిర్ధరించరు. కనీసం 24 గంటల తర్వాత మరోసారి పరీక్షించి చూస్తారు. ఇలా రెండు, మూడు సార్లు.. అదీ వేర్వేరు రోజుల్లో పరీక్షించి రక్తపోటు 140/90 కన్నా ఎక్కువుంటేనే హైబీపీగా నిర్ధరిస్తారు. అలాగే బీపీ పరీక్షను పద్ధతిగానూ చేయాల్సి ఉంటుంది. పరీక్షకు అరగంట ముందు వరకు కాఫీ, టీ, సిగరెట్లు, బీడీలు, చుట్టల వంటివేవీ తాగొద్దు. కఠినమైన వ్యాయామాలేవీ చేసి ఉండకూడదు. నడుచుకుంటూ ఆసుపత్రికి వచ్చిన వెంటనే కాకుండా కనీసం 5 నిమిషాలు విశ్రాంతిగా కూర్చున్నాకే పరీక్షించాల్సి ఉంటుంది. బీపీ పరికరానికి ఉండే పట్టీ కూడా వ్యక్తుల చేతికి తగిన సైజులో ఉండాలి. పట్టీని చుట్టిన చేయి గుండెకు సమాన ఎత్తులో ఉండాలి. పరీక్ష చేసేటప్పుడు పాదాలు నేలకు తాకించాలి. వీపు కుర్చీ వెనక భాగానికి ఆనుకొని ఉండాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలతో పరీక్షిస్తేనే రక్తపోటు సరిగ్గా తెలుస్తుంది.

కొందరికి ఆసుపత్రికి, డాక్టర్‌ దగ్గరికి రాగానే రక్తపోటు పెరగొచ్చు. ఇంట్లో మామూలుగా ఉండొచ్చు. దీన్నే వైట్‌ కోట్‌ బ్లడ్‌ప్రెషర్‌ అంటారు. ఇలాంటివారు ఇంట్లో అప్పుడప్పుడూ పరీక్షించుకోవాల్సి ఉంటుంది. కొందరికి వెంట తీసుకెళ్లటానికి వీలైన బీపీ పరికరం (ఆంబులేటరీ బీపీ మానిటరింగ్‌) అవసరపడొచ్చు. ఇది చిన్న పరికరం. చేతికి పట్టీ అలాగే కట్టి ఉంచి, పరికరాన్ని జేబులో పెడతారు. ఇది ప్రతి 15 నిమిషాలకోసారి బీపీని పరీక్షించి నమోదు చేస్తుంది. 24 గంటల తర్వాత సగటు బీపీని లెక్కించి సమస్య ఉన్నదీ, లేనిదీ నిర్ధరిస్తారు.

ఆరు నెలలకోసారైనా..

రక్తపోటు పరీక్ష తేలికైంది. అయినా చాలామందిలో సమస్యను గుర్తించలేకపోవటం ఆందోళనకరం. అధిక రక్తపోటులో పైకి లక్షణాలు కనిపించక పోవటం, పరీక్ష చేయించుకోకపోవటమే దీనికి మూలం. కాబట్టి 18 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ ఒకసారి రక్తపోటును పరీక్షించుకోవటం మంచిది. ఆ తర్వాత రెండు, మూడేళ్లకోసారి పరీక్షించుకుంటే చాలు. అదే 40 ఏళ్లు దాటితే ఏటా ఒకసారి రక్తపోటును కొలుచుకోవాలి. ఎక్కువ ఉన్నట్టయితే జీవనశైలి మార్పులు, మందులు ఆరంభించాలి. మందులు వేసుకునేవారూ ప్రతి ఆరు నెలలకోసారి డాక్టర్న్‌ు సంప్రదించటం మంచిది.

లక్షణాలు ఉండవు

అధిక రక్తపోటుతో పెద్ద ప్రమాదం పైకి ఎలాంటి లక్షణాలు లేకపోవటం. రక్తపోటు పెరిగినా మామూలుగానే ఉంటారు. చాలామందిలో సమస్యను గురించలేకపోవటానికి ముఖ్య కారణమిదే. కొందరు రక్తపోటు ఎక్కువైతే కోపమొస్తుందని, కోపం ఎక్కువవుతుందని భావిస్తుంటారు. ఇది నిజం కాదు. కానీ కోపంతో రక్తపోటు పెరిగే ప్రమాదమైతే ఉంది. అయితే రక్తపోటు మరీ ఎక్కువైతే.. అంటే 180/120 కన్నా ఎక్కువైనా, ఏ కారణంతోనైనా హఠాత్తుగా రక్తపోటు మరీ పెరిగినా తీవ్రమైన తలనొప్పి, కళ్లు తిరిగినట్టు అనిపించటం, యాసం, నీరసం, తికమక, గుండె లయ దెబ్బతినటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

చికిత్స- జీవనశైలి, మందులు

అధిక రక్తపోటు నిర్ధరణ అయినా అందరికీ వెంటనే మందుల అవసరం ఉండకపోవచ్చు. తీవ్రతను బట్టి చికిత్సను నిర్ణయిస్తారు. రక్తపోటు కాస్త ఎక్కువగా ఉండి, ఇతరత్రా సమస్యలేవీ లేనివారికి ముందుగా కొన్నివారాల పాటు ఆహార, వ్యాయామ మార్పులనే సూచిస్తారు. ఉప్పు తగ్గించటం, వ్యాయామం చేయటం, అధిక బరువుంటే తగ్గించుకోవటం, పొగ అలవాటుంటే మానెయ్యటం వంటి వాటితోనే మంచి ఫలితం కనిపిస్తుంది. వీటితో రక్తపోటు అదుపులోకి రాకపోతే మందులు ఆరంభిస్తారు. ఒకవేళ తొలిసారే రక్తపోటు మరీ ఎక్కువగా.. 180/120 ఉన్నట్టు తేలితే మాత్రం ముందు నుంచే మందులు అవసరమవుతాయి.


అవసరాన్ని బట్టి మందులు

అధిక రక్తపోటును నియంత్రించటానికి రకరకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ఎవరికి ఏ మందు అవసరమనేది ఆయా వ్యక్తుల ఆరోగ్య స్థితిని బట్టి నిర్ణయిస్తారు. సాధారణంగా 55 ఏళ్ల కన్నా తక్కువ వయసువారికి ఇతరత్రా సమస్యలేవీ లేకపోతే ఏసీఈ ఇన్‌హిబిటార్స్‌ లేదా యాంజియోటెన్సిన్‌ రిసెప్టర్‌ బ్లాకర్లు.. 55 ఏళ్లు పైబడినవారికి క్యాల్షియం ఛానెల్‌ బ్లాకర్‌ రకం మందులు ఉపయోగపడతాయి. అధిక రక్తపోటుతో పాటు గుండె సమస్యలు గలవారికి బీటా బ్లాకర్లు.. అధిక రక్తపోటు, మధుమేహం గలవారికి ఏసీఈ ఇన్‌హిబిటార్స్‌ లేదా యాంజియోటెన్సిన్‌ రిసెప్టర్‌ బ్లాకర్లు మేలు చేస్తాయి. కొందరికి ఒక్క మందుతోనే ఫలితం కనిపించొచ్చు. కొందరికి 2, 3 మందులూ అవసరపడొచ్చు. అవసరమైతే మూత్రం ఎక్కువగా వచ్చేలా చేసే డైయూరిటిక్‌ రకం మందులూ వేసుకోవాల్సి ఉంటుంది. మొత్తమ్మీద అధిక రక్తపోటును 140/90 కన్నా తక్కువకు తీసుకురావటం ముఖ్యం. అదే మధుమేహం, గుండె, కిడ్నీ జబ్బులు గలవారిలోనైతే 130/80 కన్నా తక్కువగా ఉండేలా చూడాల్సి ఉంటుంది.


మందులు క్రమం తప్పకుండా

అధిక రక్తపోటు దీర్ఘకాల సమస్య. దీనికి జీవితాంతం క్రమం తప్పకుండా మందులు వేసుకోవాల్సిందే. చాలామంది చేసే పొరపాటు కొన్ని రోజులు మందులు వాడి, రక్తపోటు తగ్గగానే మందులు ఆపెయ్యటం. ఇది తగదు. మందులు ఆపేస్తే రక్తపోటూ పెరిగిపోతుందని గుర్తుంచుకోవాలి.


ఆరోగ్యకర జీవనశైలి మేలు

అధిక రక్తపోటు నియంత్రణలో జీవనశైలి పాత్ర చాలా కీలకం. ఇది రక్తపోటు అదుపులో ఉండటానికే కాదు, నివారణకూ తోడ్పడుతుంది.
ఉప్పు పరిమితి: ఆహారంలో ఉప్పు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. నిల్వ పచ్చళ్లు తినటం.. పెరుగు, మజ్జిగలో ఉప్పు కలపటం మానెయ్యాలి. ఇప్పుడు తినటానికి సిద్ధంగా ఉండే వంటకాలు అందుబాటులో ఉంటున్నాయి. ఉప్పుతో కూడిన వీటి విషయంలోనూ అప్రమత్తత అవసరం. నిజానికి మనం తినే ఆహార పదార్థాల్లో సహజంగానే ఎంతో కొంత ఉప్పు ఉంటుంది. ఇది శరీర అవసరాలకు సరిపోతుంది. అందువల్ల ఉప్పు కలపకపోతే సోడియం మోతాదులు తగ్గుతాయని అనుకోవటానికి లేదు. ఇటీవల సైంధవ లవణం వాడకం ఎక్కువైంది. ఇందులో సోడియంకు బదులు పొటాషియం క్లోరైడ్‌ ఉంటుంది. అలాగని దీన్ని కూడా ఎక్కువగా వాడటం తగదు. ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తినాలి. వెన్న తీసిన పాలు, పెరుగు వాడుకోవాలి. మాంసం వంటివి తగ్గించాలి.
వ్యాయామం విధిగా: రోజుకు అరగంట చొప్పున.. వారానికి కనీసం ఐదు రోజులైనా వ్యాయామం చేయాలి. దీంతో రక్తనాళాల సామర్థ్యం, గుండె పనితీరు పుంజుకుంటాయి.
బరువు అదుపు: అధిక బరువు గలవారు తగ్గించుకోవటం ప్రధానం. ఒక కిలో బరువు తగ్గినా రక్తపోటు 1 ఎంఎంహెచ్‌జీ తగ్గుతుంది. బరువు తగ్గితే రక్తంలో గ్లూకోజు, కొలెస్ట్రాల్‌, గురక కూడా తగ్గుతాయి. ఇవన్నీ రక్తపోటు అదుపునకు తోడ్పడేవే.
పొగ మానెయ్యాలి: సిగరెట్లు, చుట్టలు, బీడీలు తాగితే రక్తనాళాల గోడలు దెబ్బతింటాయి. రక్తనాళాలు గట్టిపడే ప్రక్రియ ఎక్కువవుతుంది. కాబట్టి పొగ తాగే అలవాటుంటే వెంటనే మానెయ్యాలి.
మద్యం పరిమితం: మద్యంతో రక్తపోటు పెరుగుతుంది. అందువల్ల దీని జోలికి వెళ్లకపోవటం మంచిది. ఒకవేళ అలవాటుంటే 60 ఎం.ఎల్‌. కన్నా మించకుండా చూసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని