మలి దంతం పదిలం

వృద్ధులకు దంత సమస్యల ముప్పు ఎక్కువ. వయసుతో పాటు తలెత్తే మార్పులు, నోటి ఆరోగ్యం మీద ప్రభావం చూపే మందులు, లాలాజలం ఉత్పత్తి తగ్గటం, చిగుళ్లు కిందికి జారటం, వాడకంలో భాగంగా దంతాలు క్షీణించటం వంటివన్నీ ఇందుకు కారణమవుతుంటాయి.

Updated : 31 Oct 2023 06:50 IST

వృద్ధులకు దంత సమస్యల ముప్పు ఎక్కువ. వయసుతో పాటు తలెత్తే మార్పులు, నోటి ఆరోగ్యం మీద ప్రభావం చూపే మందులు, లాలాజలం ఉత్పత్తి తగ్గటం, చిగుళ్లు కిందికి జారటం, వాడకంలో భాగంగా దంతాలు క్షీణించటం వంటివన్నీ ఇందుకు కారణమవుతుంటాయి. ప్రత్యేకించి వృద్ధాప్యంలో కొన్ని దంత సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటి గురించి తెలుసుకొని, జాగ్రత్త పడటం మంచిది.


దంత క్షీణత

సరిగా శుభ్రం చేసుకోకపోవటమో, లాలాజల ఉత్పత్తి తగ్గటమో.. కారణమేదైనా వృద్ధాప్యంలో పళ్లు పుచ్చిపోయే అవకాశముంది. కొందరికి పళ్ల మీద గుంతలు, రంధ్రాలు స్పష్టంగానూ కనిపిస్తుంటాయి. దీంతో ఆహారం నములుతుంటే నొప్పి పుట్టటం.. వేడి, చల్లటి పదార్థాలను తట్టుకోలేకపోవటం వంటివి వేధిస్తుంటాయి. పిప్పి పళ్లను నిర్లక్ష్యం చేయొద్దు. రంధ్రాలను పూడ్చి సరిచేస్తే చాలావరకు నయమైపోతుంది.
నివారణ: నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఉదయం నిద్ర లేచాక, రాత్రి పడుకోబోయే ముందు ఫ్లోరైడ్‌ టూత్‌పేస్టుతో దంతాలను బ్రష్‌ చేసుకోవాలి. సన్నటి దారాన్ని వేళ్లతో పట్టుకొని, పళ్ల మధ్య దూర్చి శుభ్రం చేసుకున్నా (ఫ్లాజింగ్‌) మంచిదే. తీపి పదార్థాలు, పానీయాలు తగ్గించాలి.


చిగుళ్ల జబ్బు

ఇది తీవ్రంగా బాధిస్తుంది. ఇందులో చిగుళ్లు ఉబ్బటం, ఎర్రగా అవటం, రక్తం రావటం, దుర్వాసన, చిగుళ్లు కిందికి జారటం.. దంతాలు, చిగుళ్ల మధ్య బుడిపెలు ఏర్పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మొదట్లోనే చికిత్స తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఒక మాదిరి సమస్యకు దంతాలను ప్రత్యేకంగా శుభ్రం చేయటం, పళ్లు సరిగా తోముకోవటంతోనే నయమవుతుంది. మరీ తీవ్రమైతే దంత మూలం నుంచీ శుభ్రం చేయాల్సి ఉంటుంది. యాంటీబయాటిక్‌ మందులూ అవసరమవుతాయి.
నివారణ: నోటిని శుభ్రంగా ఉంచుకోవటం ముఖ్యం. యాంటీమైక్రోబియల్‌ మౌత్‌వాష్‌తో నోటిని పుక్కిలిస్తే మేలు. సిగరెట్లు, చుట్టలు, బీడీలు తాగరాదు. జర్దా, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులు నమలరాదు.


నోరు తడారటం

వృద్దుల్లో లాలాజలం ఉత్పత్తి తగ్గటం వల్ల నోరు పొడిబారుతుంది (జెరోస్టోమియా). కొన్ని మందులు, నాడులు దెబ్బతినటం, మధుమేహం, పక్షవాతం వంటివీ దీనికి కారణం కావొచ్చు. దీంతో ముద్ద మింగటం కష్టమవుతుంది. రుచీ మారుతుంది. పెదాలు పగలొచ్చు. తరచూ కొద్దికొద్దిగా నీళ్లు తాగటం, అవసరమైతే కృత్రిమ లాలాజలం వాడుకోవటం, నోరు ఎండిపోవటానికి కారణమయ్యే మందులు మార్చటం వంటివి మేలు చేస్తాయి.
నివారణ: ఒంట్లో నీటిశాతం తగ్గకుండా చూసుకోవాలి. దాహం వేయకపోయినా అప్పుడప్పుడూ నీరు తాగాలి. మద్యానికి దూరంగా ఉండాలి. పొగాకు ఉత్పత్తులేవీ వాడొద్దు. లాలాజలం ఊరేందుకు బిళ్లల వంటివి చప్పరించాలి.


పళ్లు జివ్వు

కొందరికి వేడి లేదా చల్లటి పదార్థాలు నోట్లో పెట్టుకోగానే పళ్లు జివ్వుమని లాగినట్టు అనిపించొచ్చు. పుల్లటి పదార్థాలు, పానీయాలు తీసుకున్నా.. బ్రష్‌తో కాస్త గట్టిగా పళ్లు తోముకున్నా ఇలాంటి అనుభూతి కలగొచ్చు. పళ్ల మీది గట్టి పొర ఎనామిల్‌ క్షీణించటం, చిగుళ్ల జబ్బులు, దంత క్షీణం.. వంటివన్నీ పళ్లు జివ్వుమనటానికి కారణమవుతాయి. ఇది తగ్గటానికి డీసెన్సిటైజింగ్‌ టూత్‌పేస్ట్‌, ఫ్లోరైడ్‌ చికిత్సలు ఉపయోగపడతాయి.
నివారణ: పళ్లు జివ్వుమనేవారు మృదువైన బ్రష్‌లు వాడుకోవాలి. మరీ గట్టిగా బ్రష్‌ చేయొద్దు.


పళ్లూడటం

చిగుళ్లు జబ్బు, దవడ ఎముక క్షీణించటం వల్ల వృద్ధుల్లో పళ్లు కదులుతుంటాయి, ఊడిపోతుంటాయి. దీంతో పళ్ల మధ్య ఖాళీలు ఏర్పడతాయి. మాట తీరు మారుతుంది. నమలటం కష్టమవుతుంది. సరిగా తినకపోవటంతో పోషణ లోపమూ తలెత్తుతుంది. కాబట్టి నిర్లక్ష్యం పనికిరాదు. వీరికి డెంటల్‌ ఇంప్లాంట్స్‌, బ్రిడ్జెస్‌ అమర్చుకోవటం.. కట్టుడుపళ్ల వంటి పద్ధతులు మేలు చేస్తాయి.
నివారణ: నోటిని శుభ్రంగా ఉంచుకోవటం కీలకం. క్రమం తప్పకుండా దంత వైద్యుడిని సంప్రదించి పరీక్షించుకోవాలి. ఆటలు ఆడేవారైతే మౌత్‌గార్డులు వాడుకుంటే దంతాలకు దెబ్బలు తగలకుండా కాపాడుకోవచ్చు.


నోటి థ్రష్‌

రోగ నిరోధక శక్తి తగ్గటం వల్ల వృద్ధాప్యంలో నోట్లో ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ తలెత్తొచ్చు. రోగ నిరోధక శక్తిని అణచిపెట్టే మందులూ దీనికి కారణం కావొచ్చు. దీని బారినపడ్డవారిలో నాలుక మీద, బుగ్గల లోపల తెల్లటి తరకలు ఏర్పడతాయి. మంట పుట్టొచ్చు. రుచీ మారి పోవచ్చు. నోటిని శుభ్రంగా ఉంచుకోవటంతో పాటు డాక్టర్‌ సలహా మేరకు యాంటీఫంగల్‌ మందులు వాడితే త్వరగా నయమవుతుంది.
నివారణ: నోటి శుభ్రతను కాపాడుకోవాలి. థ్రష్‌కు కారణమయ్యే జబ్బులకు చికిత్స తీసుకోవాలి.


కట్టుడు పళ్ల సమస్యలు

కట్టుడు పళ్లతోనూ కొన్ని సమస్యలు తలెత్తొచ్చు. అసౌకర్యంగా ఉండటం, పుండ్లు పడటం, నమల్లేక పోవటం, కట్టుడు పళ్లు సరిగా అమరకపోవటం వంటివి ఇబ్బంది కలిగించొచ్చు. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించాలి. కట్టుడు పళ్లను సరిచేయటం, అమరికను మార్చటం వంటివి మేలు చేస్తాయి.
నివారణ: కట్టుడు పళ్లను రోజూ శుభ్రం చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు తీసి పక్కన పెట్టాలి. దీంతో చిగుళ్లకు విశ్రాంతి లభిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని