Lung Cancer: ఊపిరికి పెను గండం
ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఊపిరితిత్తి క్యాన్సర్ త్వరగా ప్రాణాలు తోడేస్తుంది. దీని బారినపడ్డవారిలో ఐదేళ్లకు మించి జీవిస్తున్నవారు 19% లోపే మరి. అంటే ప్రతి 100 మంది ఊపిరితిత్తి క్యాన్సర్ బాధితుల్లో కేవలం 19 మందే ఐదేళ్లు, అంతకన్నా ఎక్కువ కాలం బతుకుతున్నారన్నమాట.

ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఊపిరితిత్తి క్యాన్సర్ త్వరగా ప్రాణాలు తోడేస్తుంది. దీని బారినపడ్డవారిలో ఐదేళ్లకు మించి జీవిస్తున్నవారు 19% లోపే మరి. అంటే ప్రతి 100 మంది ఊపిరితిత్తి క్యాన్సర్ బాధితుల్లో కేవలం 19 మందే ఐదేళ్లు, అంతకన్నా ఎక్కువ కాలం బతుకుతున్నారన్నమాట. మంచి విషయం ఏంటంటే- క్యాన్సర్ ఊపిరితిత్తులకే పరిమితమైనప్పుడు గుర్తించి, చికిత్స చేస్తే సగానికి పైగా మందిని ఎక్కువకాలం జీవించేలా చూడొచ్చు. అయితే ఇది కేవలం 16% మందిలోనే తొలిదశలో బయటపడుతోంది. అదీ ఇతరత్రా జబ్బులకు చేసే పరీక్షల్లో యాదృచ్ఛికంగానే. మొదట్లో పెద్దగా లక్షణాలేవీ కనిపించకపోవటమో, లక్షణాలు మొదలైనా ఇతరత్రా సమస్యలుగా పొరపడటమో.. కారణమేదైనా మనదగ్గర క్యాన్సర్‌ను గుర్తించే సరికే బాగా ఆలస్యమవుతోంది. ఇదే పెను శాపంగా మారుతోంది. కాబట్టి ఊపిరితిత్తి క్యాన్సర్‌పై అవగాహన కలిగుండటం, లక్షణాలు, నివారణ మార్గాలను తెలుసుకొని ఉండటం ఎంతైనా అవసరం.
ఊపిరితిత్తులు చేసే ప్రధానమైన పని గాల్లోంచి ఆక్సిజన్‌ను గ్రహించి రక్తంలోకి చేరవేయటం. అలాగే రక్తంలోని కార్బన్ డయాక్సైడ్‌ను తీసుకొని శ్వాస ద్వారా బయటకు పంపించటం. మన శరీరంలోని ప్రతి కణానికీ ఆక్సిజన్ అవసరం. ఇది అందకపోతే కణాలు నిమిషాల్లోనే చనిపోతాయి. ఊపిరితిత్తులు సరిగా పని చేయకపోతే ప్రతి భాగమూ ప్రభావితమవుతుంది. చిన్న సమస్య తలెత్తినా ఇబ్బందికరంగా పరిణమిస్తుంది. ఇక క్యాన్సర్ వస్తే చెప్పేదేముంది? చాలామంది ఊపిరితిత్తి క్యాన్సర్ అరుదైనదని అనుకుంటుంటారు గానీ మనదేశంలో అతి ఎక్కువగా కనిపించే క్యాన్సర్లలో నాలుగోది ఇదే. మగవారికి వచ్చే క్యాన్సర్లలో రెండో స్థానమూ దీనిదే. గ్లోబోక్యాన్ నివేదిక ప్రకారం మనదేశంలో 2020లో 72,510 మంది దీని బారినపడగా.. 66,279 మంది మరణించటం గమనార్హం. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఇదెంత ప్రమాదకరమైందో. నిజానికి ఆరంభంలోనే గుర్తించి, చికిత్స తీసుకుంటే 90% వరకు నయమవుతుంది. కానీ మనదగ్గర ఊపిరితిత్తి క్యాన్సర్ మీద సరైన అవగాహనే లేకపోవటం వల్ల మొదట్లో గుర్తించటం లేదు. తొలిదశలో పెద్దగా లక్షణాలు లేకపోవటంతో పాటు ఇది క్షయ మాదిరిగా కనిపిస్తుండటమూ పొరపడటానికి తావిస్తోంది. క్షయకు చికిత్స తీసుకుంటున్నా లక్షణాలు తగ్గని సందర్భాల్లోనూ క్యాన్సర్‌గా అనుమానించ లేకపోవటం గమనించదగ్గ విషయం. ఊపిరితిత్తి క్యాన్సర్ ఆలస్యంగా బయటపడటానికి ఇలాంటివన్నీ కారణమవుతున్నాయి. రోజురోజుకీ పెరిగిపోతున్న పొగాకు అలవాట్లు, వాయు కాలుష్యం వంటివీ ఇప్పుడు ఊపిరితిత్తి క్యాన్సర్లు పెరిగేలా చేస్తుండటం మరింత ఆందోళనకరం.
ఎక్కడిదీ క్యాన్సర్?
ఒక్కమాటలో చెప్పాలంటే కణాలు అనవసరంగా, అసాధారణంగా విభజన చెందుతూ పెరగటమే క్యాన్సర్. శరీరంలో బోలెడన్ని కణాలుంటాయి. ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో విభజన చెందుతూ, పెరుగుతుంటాయి. ఈ ప్రక్రియను జన్యువులు నియంత్రిస్తుంటాయి. విభజన చెందాల్సిన అవసరం లేనప్పుడు కణంలోని లేదా పక్క కణంలోని సంకేత వ్యవస్థ ‘ఆపు’ అని చెబుతుంది. ఎందుకనో కొన్నిసార్లు ఈ నియంత్రణ ప్రక్రియ గాడి తప్పుతుంది. దీంతో అవసరం లేకపోయినా కణ విభజన జరుగుతుంది. లేదూ కణాలు చనిపోకుండా అలాగే పెరుగుతూ రావొచ్చు. ఇవన్నీ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయి క్యాన్సర్ కణితులుగా మారతాయి. మన శరీరంలో ఆయా కణాల అసాధారణ విభజనను బట్టి క్యాన్సర్ రకాలు ఆధారపడి ఉంటాయి. వీటిల్లో ఒకటి కార్సినోమా. ఇది నోరు, ముక్కు, గొంతు, శ్వాసమార్గాలు, రొమ్ము, ప్రోస్టేట్, పెద్దపేగు వంటి అయవాల్లోని పైపొర మీది కణాల్లో తలెత్తుతుంది. ఊపిరితిత్తి క్యాన్సర్ దీనిలోకే వస్తుంది.
క్షయగా పొరపడొద్దు!
ఊపిరితిత్తి క్యాన్సర్(Lung Cancer), క్షయ లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. రెండింటిలోనూ దగ్గు, జ్వరం, కళ్లెలో రక్తం పడటం, బరువు తగ్గటం, ఆయాసం వంటివి కనిపిస్తుంటాయి. దీంతో చాలామంది పొరపడుతుంటారు. క్యాన్సర్‌ను గుర్తించే సరికే ఆలస్యమైపోతుంటుంది. అందువల్ల నిశిత పరిశీలన అవసరం. ఊపిరితిత్తి క్యాన్సర్ తొలిదశలో ప్రధాన లక్షణం పొడి దగ్గు. దీన్ని చాలాసార్లు మామూలు జలుబు, పడిశంగా పొరపడి నిర్లక్ష్యం చేసేస్తుంటారు. మూడు వారాలు దాటినా దగ్గు తగ్గకపోతే తాత్సారం చేయొద్దు. పొగతాగే అలవాటు గలవారైతే అసలే నిర్లక్ష్యం చేయొద్దు. కొందరికి తొలిదశలో దగ్గు ఉండకపోవచ్చు కూడా. వీరిలో దగ్గు, ఆయాసం వచ్చేసరికే జబ్బు ముదిరిపోయి ఉంటుంది. కొందరిలో దగ్గుతో పాటు కళ్లె పడొచ్చు. కళ్లెలో రక్తం చారలూ కనిపించొచ్చు. ఇది అప్పటికే జబ్బు ముదిరిపోయిందనటానికి సంకేతం.
- దగ్గుతో పాటు స్వల్పంగా జ్వరం రావటం మరో లక్షణం. క్షయలోనూ జ్వరం ఉంటుంది గానీ సాయంత్రం వేళల్లో వస్తుంది. అదే ఊపిరితిత్తి క్యాన్సర్‌లో జ్వరం రోజంతా ఉంటుంది.
- ఊపిరితిత్తి క్యాన్సర్, క్షయ రెండింటిలోనూ బరువు తగ్గుతుంది. అయితే క్షయలో నెమ్మదిగా బరువు తగ్గుతూ వస్తుంటుంది. కానీ ఊపిరితిత్తి క్యాన్సర్‌లో హఠాత్తుగా బరువు తగ్గుతుంది. కొందరు ఒకట్రెండు నెలల్లోనే 2, 3 కిలోల వరకూ బరువు తగ్గొచ్చు.
ఇతర లక్షణాలు
- గాలి గొట్టాలు మూసుకోవటం, ఊపిరితిత్తి చివరిభాగం పాక్షికంగా లేదా పూర్తిగా కుప్పకూలటం మూలంగా ఆయాసమూ వస్తుంటుంది.
- సుమారు 60% మందిలో ఛాతీలో నొప్పి, అసౌకర్యమూ ఉండొచ్చు.
- కొందరిలో గొంతు బొంగురుపోవటం ఒక్కటే కనిపించొచ్చు. ఎడమ స్వరపేటికకు వెళ్లే నాడులు ప్రభావితం కావటంతో స్వరతంత్రులు చచ్చుబడటం దీనికి కారణం. ఇలాంటివారు దగ్గినప్పుడు చప్పుడు అంతగా రాదు.
- ఊపిరితిత్తి క్యాన్సర్ తీవ్రమై (నాలుగో దశ) వేరే చోట్లకూ వ్యాపించొచ్చు. అప్పుడు ఆయా భాగాలను బట్టి లక్షణాలు కనిపిస్తాయి. ఉదాహరణకు- ఎముకకు వ్యాపిస్తే ఎముక నొప్పి, ఎముకలు విరగటం.. మెదడుకు వ్యాపిస్తే తలనొప్పి వంటివి తలెత్తుతాయి.
ఎందుకొస్తుంది?
ఊపిరితిత్తి క్యాన్సర్‌కు ముఖ్యమైన ముప్పు కారకం సిగరెట్లు, చుట్టలు, బీడీలు తాగటం. గుట్కా, జర్దా వంటి పొగాకు ఉత్పత్తులు తినటం, నమలటం కూడా ప్రమాదమే. ఊపిరితిత్తి క్యాన్సర్ బారినపడుతున్నవారిలో 70% మంది పొగాకు అలవాటు గలవారే. పొగాకులో ఆర్సెనిక్, బెంజీన్, తారు వంటి క్యాన్సర్ కారకాలెన్నో ఉంటాయి. ఇవి శ్వాసనాళం లేదా రక్తం ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరుకొని, స్థిరపడతాయి. నెమ్మదిగా అక్కడి జన్యువుల పనితీరును దెబ్బతీసి, కణితులకు దారితీస్తాయి.
- కాలుష్యమూ తక్కువదేమీ కాదు. దాదాపు 3-5% మంది కాలుష్యంతోనే ఊపిరితిత్తి క్యాన్సర్ బారినపడుతున్నారు. రసాయన పరిశ్రమల నుంచి వెలువడే పొగలతో మరో 2-3% మంది క్యాన్సర్‌కు గురవుతున్నారు.
- ఊపిరిత్తి క్యాన్సర్‌కు జన్యువులూ కారణం కావొచ్చు. సుమారు 2% మందికి ఇవే కారణమవుతున్నాయి.
- ఎలాంటి ముప్పు కారకాలేవీ లేకుండానూ కొందరికి క్యాన్సర్ రావొచ్చు. తల్లిదండ్రులకు క్యాన్సర్ లేనంతమాత్రాన పిల్లలకు రాకూడదనేమీ లేదు. అలాగే రక్త సంబంధీకులకు క్యాన్సర్ ఉన్నా తప్పకుండా వస్తుందనీ చెప్పలేం.
నివారించుకోవచ్చు!
జన్యువులు, వయసు వంటి ముప్పు కారకాల విషయంలో మనం పెద్దగా చేయగలిగిందేమీ లేదు. కానీ కొన్ని జాగ్రత్తలతో ఊపిరితిత్తి క్యాన్సర్‌ను నివారించుకునే అవకాశమైతే ఉంది.
- పొగాకు జోలికి వెళ్లొద్దు: క్యాన్సర్ నివారణకు అన్నింటికన్నా ప్రధానమైంది, ప్రథమ మార్గం ఇదే. ఎందుకంటే పొగాకును ఏ రూపంలో వాడినా క్యాన్సర్ కారకమే. కాబట్టి సిగరెట్లు, చుట్టలు, బీడీల జోలికి వెళ్లకపోవటం ఉత్తమం. ఒకవేళ వీటిని కాల్చే అలవాటుంటే మానెయ్యాలి. జర్దా, గుట్కా, పొగాకు, పొగాకు కట్టెలు నమిలే అలవాటున్నా వెంటనే వదిలెయ్యాలి. ‘చాలాకాలం నుంచి పొగ తాగుతున్నాం. ఇప్పుడు మానేస్తే ఒరిగేదేముంది?’ అని అనుకోవద్దు. పొగాకు వాడకం మానేసిన క్షణం నుంచే మంచి ఫలితం కనిపించటం మొదలవుతుంది. అలాగే ఇంట్లో, చుట్టుపక్కల ఎవరూ సిగరెట్లు, చుట్టలు కాల్చకుండా చూసుకోవాలి. వీళ్లు వదిలే పొగను పీల్చినా ప్రమాదమేనని తెలుసుకోవాలి.
- కాలుష్యానికి దూరంగా: వీలైనంత వరకు వాహనాల నుంచి వెలువడే పొగలకు గురి కాకుండా చూసుకోవాలి. అనవసరంగా వాహనాలు రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లొద్దు. త్వరగా పని ముగించుకొని ఇంటికి రావాలి. ముక్కుకు మాస్కు ధరిస్తే మంచిది. బయటే కాదు.. దోమలను తరమటానికి వెలిగించే బత్తీలు, కట్టెల పొయ్యిలు, బొగ్గు కుంపట్ల వంటివి ఇంట్లోనూ గాలి కాలుష్యానికి దారితీస్తాయి. దీన్ని కూడా తగ్గించుకోవాలి. సిమెంట్, ఆర్సెనిక్, కాడ్మియం, నికెల్ పరిశ్రమల్లో.. బొగ్గు గనుల్లో పనిచేసేవారు విధిగా ముక్కుకు రక్షణ కవచాలు ధరించాలి. కొన్ని ఇళ్లల్లో, ప్రాంతాల్లో రేడాన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇదో రేడియోధార్మిక వాయువు. దీనికి వాసన ఉండదు. కంటికి కనిపించదు. రాళ్లు, నేల, నీటి నుంచి వెలువడుతుంది. బేస్‌మెంట్లు, సెల్లార్లు, నేల మాళిగల్లో ఎక్కువ మోతాదులో ఉండే ఇది క్యాన్సర్ ముప్పు పెరిగేలా చేస్తుంది. వీలున్నవారు న్యూక్లియర్ పరీక్షతో దీని మోతాదులను తెలుసుకోవచ్చు.
- మంచి ఆహారం: తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి. వీటిల్లోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ రాకుండా కాపాడతాయి.
- వ్యాయామం: అధిక బరువుతో అడినోకార్సినోమాలు ఎక్కువగా వచ్చే అవకాశముంది. బరువు మితిమీరకుండా చూసుకుంటే వీటిని నివారించుకోవచ్చు. ఇందుకు వ్యాయామం, శారీరక శ్రమ తోడ్పడతాయి. రోజుకు అరగంట చొప్పున వారానికి కనీసం ఐదు రోజులైనా వ్యాయామం చేయాలి.
- ముందస్తు పరీక్షలు: అరుదే అయినా కొందరికి జన్యువుల మూలంగా ఊపిరితిత్తి క్యాన్సర్ రావొచ్చు. ఇలాంటివారికి ముందస్తు పరీక్ష ఉపయోగపడుతుంది. ఇప్పుడు తక్కువ మోతాదు రేడియేషన్‌తోనే అతి స్పష్టమైన చిత్రాలను తీసే అధునాతన సీటీ స్కాన్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. 55 ఏళ్లు పైబడి, 20 ఏళ్లకు పైగా పొగ తాగే అలవాటు గలవారిలోనూ ఈ పరీక్ష ద్వారా ముందుగానే గుర్తించొచ్చు. పొగ తాగే అలవాటు లేకపోయినా తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఊపిరితిత్తి క్యాన్సర్ వచ్చి ఉన్నవారికి జన్యు పరీక్ష కూడా మేలు చేస్తుంది. క్యాన్సర్ కారక జన్యువు పాజిటివ్‌గా ఉన్నట్టయితే రోజూ ప్రాణాయామం వంటి పద్ధతులతో నివారించుకునే అవకాశమూ ఉంది.
- ఊపిరితిత్తి జబ్బులపై కన్ను: క్షయ, సీవోపీడీ, ఆస్థమా వంటి జబ్బులు గలవారిలో చాలాకాలం తర్వాత ఊపిరితిత్తుల్లో కణజాలం గట్టిపడొచ్చు (ఫైబ్రోటిక్ లంగ్). ఇదీ క్యాన్సర్లకు దారితీయొచ్చు. వీటిని స్కార్ క్యాన్సర్లు అంటారు. ఇవి ఎక్కువగా మహిళల్లో కనిపిస్తుంటాయి. గతంలో ఇతరత్రా జబ్బులకు ఛాతీ భాగానికి రేడియేషన్ తీసుకున్నవారికీ ప్రమాదం పొంచి ఉండొచ్చు. కాబట్టి ఇంతకుముందు ఇలాంటి జబ్బులు వచ్చినవారు క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించి, తగు పరీక్షలు చేయించుకోవాలి. ఊపిరితిత్తిలో ఏవైనా మార్పులు తలెత్తితే వెంటనే జాగ్రత్త పడటానికి వీలుంటుంది.
ఆధునాతన చికిత్సల ఆశ
ఊపిరితిత్తి క్యాన్సర్‌కు శస్త్రచికిత్స, రేడియేషన్, కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీలు అందుబాటులో ఉన్నాయి. ఏ దశలోనైనా రేడియేషన్ ఇవ్వచ్చు. అవసరాన్ని బట్టి రేడియేషన్‌తో పాటు కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ కలిపి చేయొచ్చు. ఈ చికిత్సలను నిర్ణయించటానికి ముందు క్యాన్సర్ తీవ్రత, ముప్పు అంచనాతో పాటు మాలిక్యులర్ పరీక్షలు చేస్తారు.
తొలిదశలో..
తొలిదశ క్యాన్సర్ గలవారిలో కణితి ఏర్పడిన లంబిక(లోబ్)ను శస్త్రచికిత్సతో తొలగిస్తారు. అవసరమైతే ఊపిరితిత్తి మొత్తాన్నీ తీసేయొచ్చు. అయితే లంబికలో ఆ భాగాన్ని మాత్రమే తొలగించినా మంచి ఫలితం కనిపిస్తున్నట్టు ప్రయోగ ఫలితాలు సూచిస్తున్నాయి. వీరికి జబ్బు తిరగబెట్టే అవకాశముంటే కీమోథెరపీ, రేడియోథెరపీ చేస్తారు. ఈజీఎఫ్‌ఆర్ జన్యువు పాజిటివ్‌గా ఉన్నవారికి టార్గెటెడ్ థెరపీ (ఓసిమెర్టినిబ్) కూడా ఇవ్వచ్చు. కొందరికి శస్త్రచికిత్స, కీమోథెరపీ అనంతరం ఇమ్యునోథెరపీ మందులు (అటిజోలిజుమాబ్, పెంబ్రోలిజుమాబ్) మేలు చేస్తాయి. మరికొందరికి శస్త్రచికిత్సకు ముందు కీమోథెరపీతో పాటు నివోలుమాబ్ అనే ఇమ్యునోథెరపీ మందు ఇవ్వచ్చు. ఇది ఎక్కువ కాలం జీవించటానికి తోడ్పడుతుంది. శస్త్రచికిత్సకు ముందు కీమోథెరపీ, పెంబ్రోలిజుమాబ్ తీసుకున్నవారు, అలాగే శస్త్రచికిత్స అనంతరం పెంబ్రోలిజుమాబ్ తీసుకున్నవారిలో మంచి ఫలితం కనిపిస్తున్నట్టూ బయటపడింది.
ముదిరిన దశలో..
క్యాన్సర్ ముదిరిన వారికి ఒకే సమయంలో కీమో, రేడియేషన్ థెరపీలు ఇస్తారు. కొందరికి శస్త్రచికిత్స అవసరపడొచ్చు. చికిత్స చేసినా 70% మందికి పూర్తిగా జబ్బు తగ్గకపోవచ్చు. ఒకవేళ తగ్గినా తిరగబెట్టొచ్చు. మరీ ముదిరితే.. అంటే నాలుగో దశలో క్యాన్సర్ నయం కావటం దాదాపు అసాధ్యమని చెప్పుకోవచ్చు. అలాగని నిరాశ అవసరం లేదు. తీవ్రదశ ఊపిరితిత్తి క్యాన్సర్‌కూ ఇప్పుడు అధునాతన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లో ప్రధానమైనవి ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ. వీటిని కీమోథెరపీతో కలిపి గానీ విడిగా గానీ ఇవ్వచ్చు. ఇవి ఉన్నంతకాలం హాయిగా జీవించటానికి తోడ్పడతాయి.
- ఇమ్యునోథెరపీ రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించి, క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తుంది. క్యాన్సర్ కణాలను గుర్తించే, ఆ కణాలను నిర్వీర్యం చేసే ప్రొటీన్లను తిరిగి ఉత్తేజితం చేస్తుంది. ఇందుకు పెంబ్రోలిజుమాబ్, అటిజోలిజుమాబ్, సెమిప్లిమాబ్, డుర్వలుమాబ్, నివోలుమాబ్ వంటి ఇమ్యూన్ చెక్‌పాయింట్ ఇన్‌హిబిటార్ రకం మందులు తోడ్పడతాయి. కణితి కణాల మీద పీడీ-ఎల్1 అనే ప్రొటీన్ పెద్దమొత్తంలో ఉన్నవారికి, క్యాన్సర్ కణాల్లో డీఎన్‌ఏ మార్పుల సంఖ్య (టీఎంబీ) ఎక్కువగా ఉన్నవారికివి మరింత బాగా పనిచేస్తాయి.
- టార్గెటెడ్ థెరపీలు మామూలు కణాలకు హాని కలిగించకుండా క్యాన్సర్ కణాల మీదే దాడిచేస్తాయి. ఇటీవల చాలా టార్గెటెడ్ చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఏఎల్‌కే ఇన్‌హిబిటార్స్(సెరిటినిబ్, అలెక్టినిబ్ వంటివి), ఈజీఎఫ్‌ఆర్ ఇన్‌హిబిటార్స్ (ఓసిమెర్టినిబ్, అఫటినిబ్, అమివంటమాబ్ వంటివి), రాస్1 ఇన్‌హిబిటార్స్ (క్రిజోటినిబ్, ఎంట్రెక్టినిబ్), బీఆర్‌ఏఎఫ్ ఇన్‌హిబిటార్స్ (డాబ్రఫెనిబ్ వంటివి) వీటిల్లో కొన్ని.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Meenakshi Chaudhary: ‘గుంటూరు కారం’.. ఆరోజు ఎంతో కంగారుపడ్డా: మీనాక్షి చౌదరి
-
Team India: యువ టాలెంట్‌కు కొదవేం లేదు.. జట్టు కూర్పే భారత్‌కు సవాల్: మాజీ క్రికెటర్
-
డిజిటల్ రుణాలపై ఆర్బీ‘ఐ’.. లోన్ అగ్రిగేటర్లకు త్వరలో రూల్స్
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
TSRTC: పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
-
Canada visa: కెనడా కీలక నిర్ణయం.. స్టూడెంట్ వీసా డిపాజిట్ రెట్టింపు!