అంగం చిన్నగా ఉందేం?

సమస్య: మా మనవడికి 11 ఏళ్లు. అతనికి అంగం చిన్నగా ఉంది. పుట్టినప్పుడు ఎంత ఉందో అంతే ఉంది. ఏ మాత్రం పెరగలేదు. నపుంసకుడు అవుతాడేమోనని భయంగా ఉంది. దీనికి పరిష్కారమేంటో తెలియజేయండి.

Updated : 28 Dec 2021 04:07 IST

సమస్య: మా మనవడికి 11 ఏళ్లు. అతనికి అంగం చిన్నగా ఉంది. పుట్టినప్పుడు ఎంత ఉందో అంతే ఉంది. ఏమాత్రం పెరగలేదు. నపుంసకుడు అవుతాడేమోనని భయంగా ఉంది. దీనికి పరిష్కారమేంటో తెలియజేయండి.

- వి.రామాంజి, నారపల్లి

సలహా: ఇది తరచూ చూసే సమస్యే. పిల్లాడికి అంగం చిన్నగా ఉందని తల్లిదండ్రులు, ఇంట్లో పెద్దవాళ్లు కంగారు పడుతూ డాక్టర్ల దగ్గరికి తీసుకురావటం చూస్తూనే ఉంటాం. మగ పిల్లలకు యుక్త వయసు.. అంటే 13, 14 ఏళ్లు వచ్చి, ఒంట్లో పురుష హార్మోన్లు ఉత్పత్తి అయ్యాకే అంగం పెరగటం ఆరంభిస్తుంది. అప్పటివరకు చిన్నగానే ఉంటుంది. దీని గురించి బెంగ పడాల్సిన పనిలేదు. అంగం విషయంలో నార్మల్‌ సైజు అంటూ ఏదీ ఉండదని తెలుసుకోవాలి. మనుషులు పొట్టిగా, పొడవుగా ఉన్నట్టే అంగం సైజు వేర్వేరుగా ఉంటుంది. మీ మనవడికి వృషణాల వంటివి మామూలుగా ఉన్నాయా అనేది చూసుకుంటే చాలు. పురుష హార్మోన్లు వృషణాల నుంచే తయారవుతాయి. వీటి సైజు మామూలుగా ఉండి, తిత్తిలోకి దిగి ఉన్నట్టయితే బాధపడాల్సిన పని లేదు. ఇక ఈ వయసులో నపుంసకత్వం గురించి ఆలోచించటం తగదు. అంగం చిన్నగా ఉంటే నపుంసకత్వం వస్తుందనేది అపోహ మాత్రమే. శృంగారానికి అంగం గట్టిపడటమే ప్రధానం. సైజుతో సంబంధం లేదు. లేనిపోని భయాలు పెట్టుకొని పిల్లల మీద ఒత్తిడి తేవద్దు. మిగతా పిల్లలతో పోల్చి చూడటం వంటివి చేయొద్దు. దీంతో పిల్లలు మానసికంగా కుంగిపోతారు. ఆత్మన్యూనతకు లోనవుతారు. ఇది మున్ముందు దుష్ప్రభావాలకు దారితీస్తుంది. కొన్నిసార్లు మైక్రోఫాలస్‌ అనే జబ్బులో అంగం చాలా చిన్నగా కనిపించొచ్చు. కాకపోతే ఇది చాలా అరుదు. మరీ అనుమానంగా ఉంటే మీ మనవడిని ఒకసారి చిన్న పిల్లల డాక్టర్‌కు చూపించండి. వృషణాలు సరిగా ఉన్నాయా? అంగం సైజు ఉండాల్సినంత ఉందా? అనేవి పరిశీలిస్తారు. అన్ని మామూలుగా ఉంటే పిల్లాడిని అలా వదిలేస్తే చాలు. పెద్దగా అవుతున్నకొద్దీ అన్ని అవయవాల మాదిరిగానే అంగమూ పెరుగుతుంది. భయపడాల్సిన అవసరం లేదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని