రాబోతోంది డిమెన్షియా సునామీ

డిమెన్షియా బాధితుల సంఖ్య గణనీయంగా పెరగనుందా? ముప్పు కారకాలను పరిష్కరించకపోతే ఇదే నిజమవుతుందని లాన్సెట్‌ పబ్లిక్‌ హెల్త్‌లో ప్రచురితమైన అధ్యయనం హెచ్చరిస్తోంది. ఇందులో 195 దేశాల్లో డిమెన్షియా బాధితుల సంఖ్యను అంచనా వేశారు.

Published : 11 Jan 2022 01:03 IST

డిమెన్షియా బాధితుల సంఖ్య గణనీయంగా పెరగనుందా? ముప్పు కారకాలను పరిష్కరించకపోతే ఇదే నిజమవుతుందని లాన్సెట్‌ పబ్లిక్‌ హెల్త్‌లో ప్రచురితమైన అధ్యయనం హెచ్చరిస్తోంది. ఇందులో 195 దేశాల్లో డిమెన్షియా బాధితుల సంఖ్యను అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా 2019లో 40, అంతకన్నా ఎక్కువ వయసుగలవారిలో సుమారు 5.7 కోట్ల మంది డిమెన్షియాతో బాధపడుతున్నారని అంచనా. వీరి సంఖ్య 2050 నాటికి 15.3 కోట్లకు చేరుకోవచ్చని తాజా అధ్యయనం పేర్కొంటోంది. మనదేశంలోనైతే డిమెన్షియా బాధితుల సంఖ్య 38.43 లక్షల నుంచి 1.14 కోట్లకు చేరుకోనుంది. అంటే 197% పెరుగుతుందన్నమాట. దీనికి ప్రధానంగా పెరుగుతున్న జనాభా, వృద్ధాప్యంతో ముడిపడిన సమస్యలే దోహదం చేస్తున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలకు ఏడో అతిపెద్ద కారకం డిమెన్షియానే. వైకల్యం, ఇతరుల మీద ఆధారపడటానికి ఎక్కువగా కారణమవుతున్నవాటిల్లోనూ ఇదొకటి. డిమెన్షియా తీవ్రమైన మతిమరుపును తెచ్చిపెడుతుంది. ఆలోచన, నిర్ణయ శక్తినీ తగ్గిస్తుంది. దీంతో రోజువారీ పనులు చేసుకోవటమూ కష్టమైపోతుంది. డిమెన్షియా ఎక్కువగా వృద్ధుల్లో కనిపిస్తున్నా ఇది వృద్ధాప్య పరిణామేమీ కాదు. అంతగా చదువుకోకపోవటం, అధిక రక్తపోటు, వినికిడి లోపం, పొగ అలవాటు, మధ్యవయసులో ఊబకాయం, కుంగుబాటు, బద్ధకం, మధుమేహం, ఒంటరితనం, మద్యం అతిగా తాగటం, తలకు దెబ్బలు, గాలి కాలుష్యం వంటివి దీనికి దోహదం చేస్తాయి. ఈ ముప్పు కారకాలను పరిష్కరించగలిగితే 40% డిమెన్షియా కేసులను నివారించుకోవటమో లేదా ఆలస్యం చేసుకోవటమో సాధ్యమని పరిశోధకులు సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని