Better Sleep: మీకు నిద్ర సరిపోతోందా.. తెలుసుకోవడం ఇలా?

మనకు ఎన్ని గంటల నిద్ర (Sleep) అవసరమనేది కచ్చితంగా తెలియదు. ఆయా వ్యక్తుల అవసరాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. సాధారణంగా పెద్దవారికి రాత్రిపూట 7-9 గంటల నిద్ర అవసరమని నిపుణులు చెబుతుంటారు. మరి మిగిలిన వాళ్ల సంగతేంటి?

Updated : 08 Jan 2023 17:09 IST

సాధారణంగా పెద్దవారికి రాత్రిపూట 7-9 గంటల నిద్ర (Sleep) అవసరమని నిపుణులు చెబుతుంటారు. మరి మనకు నిద్ర సరిపోతోందా, లేదా అనేది తెలుసుకోవటమెలా? దీన్ని కొన్ని విషయాల ద్వారా గుర్తించే అవకాశముంది. అవేంటో చదివేయండి మరి. అలాగే మంచి నిద్రకు చేయాల్సిన పనులు కూడా తెలుసుకోండి.

  • టీవీ చూస్తున్నప్పుడు కునికి పాట్లు పడుతున్నారా? కారు నడుపుతున్నప్పుడు నిద్ర వస్తున్నట్టు అనిపిస్తోందా? అయితే నిద్ర సరిపోనట్టే. మెలకువగా, చురుకుగా ఉండాల్సిన సమయంలో నిద్ర వస్తోందంటే ఏదో తేడా ఉందనే అర్థం.
  • రోజూ ఉదయం అలారం మోగితే గానీ మెలకువ రాకపోవటమూ నిద్ర సరిపోటం లేదనటానికి సూచికే. మన నిద్ర, మెలకువలను జీవ గడియారం నియంత్రిస్తుంటుంది. నిద్ర సరిపోయినట్టయితే సమయానికి దానంతటదే మెలకువ వచ్చేస్తుంది. కాబట్టి లేవాల్సిన వేళకు మెలకువ రాలేదంటే రాత్రిపూట సరిగా నిద్రపోనట్టే.
  • సెలవు దినాల్లో పగటిపూట గంటల కొద్దీ నిద్రపోతున్నారా? అయితే మిగతా రోజుల్లో సరిగా నిద్రపోవటం లేదనే అనుకోవచ్చు. కోల్పోయిన నిద్రను భర్తీ చేసుకునే ప్రయత్నంలో శరీరం ఇలా వెసులుబాటు ఉన్నప్పుడు పగటిపూట ఎక్కువసేపు విశ్రాంతిని కోరుకుంటుంది మరి.

శారీరక శ్రమ లేకపోవటం: నిద్ర సరిగా పట్టకపోవటానికి జీవనశైలీ కారణమే. అందుకే రోజులో కనీసం 30 నిమిషాలు నడక వంటి వ్యాయామాలను భాగం చేసుకోవాలి.

మంచి నిద్రకు చేయాల్సిన పనులు(Good sleep tips)

  • రోజూ ఒకే సమయానికి పడుకోవటం, లేవటం చాలా ప్రధానం. రాత్రి ఆలస్యంగా పడుకున్నా కూడా ఉదయం అదే సమయానికి లేవాలి. మర్నాడు కాస్త పెందలాడే పడుకోవాలి. వీలైతే మధ్యాహ్నం కాసేపు కునుకు తీయొచ్చు. ఇలా కోల్పోయిన నిద్రను భర్తీ చేసుకోవటానికి ప్రయత్నించాలి. అంతే తప్ప, రాత్రిపూట ఆలస్యంగా పడుకున్నామని ఉదయం ఆలస్యంగా నిద్ర లేవాలని అనుకోవద్దు.
  • నిద్రపోయే గదిలో మసక చీకటి ఉండేలా చూసుకోవాలి. నిద్రకు ఉపక్రమించటానికి ముందు నుంచే ఇంట్లో వెలుతురు తక్కువగా ఉండేలా చూసుకుంటే ఇంకా మంచిది.
  • నిద్రపోయే సమయానికి గంట ముందు సెల్‌ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు కట్టేయాలి. పడకగదిలో ఇలాంటి పరికరాలేవీ లేకుండా చూసుకోవాలి.
  • పడుకోవటానికి ముందు కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా కబుర్లు చెప్పుకోవాలి.
  • పడక సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి.
  • నిద్రపోయే సమయానికి గంటా, రెండు గంటల ముందే భోజనం పూర్తి చేయాలి.
  • పడుకోవటానికి 2 గంటల్లోపు కాఫీ, టీ, మద్యం తాగకుండా చూసుకోవాలి.
  • సాయంత్రం ఒక అరగంట చిన్నపాటి వ్యాయామం చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే కమ్మటి నిద్ర పడుతుంది.
  • నిద్ర పట్టనప్పుడు మంచం మీద అలాగే దొర్లటం సరికాదు. లేచి కుర్చీలో కూర్చొని చక్కటి సంగీతం వినాలి. ఏదైనా మంచి పుస్తకం చదవుకోవాలి. నిద్ర వస్తున్నప్పుడే పక్క మీదికి వెళ్లి, పడుకోవాలి.
  •  స్నానం నీటిలో ఒక కప్పు రోజ్‌వాటర్‌ కలపండి. చర్మం ఆరోగ్యంగా, మెరవడంతోపాటు ఒత్తిడీ దూరమవుతుంది. పడుకోబోయే ముందు దిండు మీద స్ప్రే చేస్తే.. మెదడు విశ్రాంతి పొందుతుంది. నిద్రా బాగా పడుతుంది.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని