తల మీద పొలుసులేంటి?

నాకు 27 ఏళ్లు. రెండేళ్ల నుంచీ తల మీద సోరియాసిస్‌ సమస్యతో బాధపడుతున్నా. మందులు వాడుతున్నా ఫలితం లేదు. ఇది చాలా చికాకుకు గురిచేస్తోంది. దీన్ని తొలగించుకునేదెలా?

Published : 01 Feb 2022 00:37 IST

సమస్య: నాకు 27 ఏళ్లు. రెండేళ్ల నుంచీ తల మీద సోరియాసిస్‌ సమస్యతో బాధపడుతున్నా. మందులు వాడుతున్నా ఫలితం లేదు. ఇది చాలా చికాకుకు గురిచేస్తోంది. దీన్ని తొలగించుకునేదెలా?

- వనిత (ఈమెయిల్‌)

సలహా: తల మీద సోరియాసిస్‌ గలవారిలో చర్మం పైన అక్కడక్కడా ఉబ్బెత్తుగా, ఎర్రగా, పొలుసులు ఏర్పడుతుంటాయి. చుండ్రు మాదిరిగా కనిపిస్తుంది. చూడటానికి ఇబ్బందికరంగా ఉంటుంది. దీనికి కారణమేంటన్నది కచ్చితంగా తెలియదు. రోగనిరోధకశక్తి పొరపాటున చర్మ కణాల మీద దాడిచేయటం వల్ల వస్తుందని భావిస్తుంటారు. దీంతో చర్మకణాలు చాలా త్వరగా పెరుగుతూ, అట్టుకట్టినట్టు ఏర్పడతాయి. మీరు మందులు వాడుతున్నానని రాశారు గానీ ఏయే మందులు వాడుతున్నారో తెలపలేదు. చర్మ నిపుణులను సంప్రదించారో లేదో కూడా తెలియజేయలేదు. తల మీద సోరియాసిస్‌కు ప్రధానంగా నాలుగు రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. వయసు, వైవాహిక స్థితిని బట్టి వీటిని ఇవ్వాల్సి ఉంటుంది. మీరు పెళ్లయ్యిందో లేదో తెలియజేయలేదు. పెళ్లి అయినా,  కాకపోయినా అప్రిమిలాస్ట్‌ మాత్రలను వాడుకోవచ్చు. ఇవి ఒంట్లో వాపుప్రక్రియకు (ఇన్‌ఫ్లమేషన్‌) దారితీసే పదార్థాలను అడ్డుకోవటం ద్వారా ఉపశమనం కలిగిస్తాయి. వీటిని ఉదయం, రాత్రి ఒకటి చొప్పున మూడు నెలలు వాడి చూడండి. అలాగే కోల్‌ టార్‌, స్టిరాయిడ్లతో కూడిన  కొన్ని లోషన్లు వాడుకోవచ్చు. వీటిని రాత్రిపూట తలకు పెట్టుకొని ఉదయాన్నే  కోల్‌ టార్‌ షాంపూతో స్నానం చేస్తే పొలుసులు తగ్గుముఖం పడతాయి. ఆహారం విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వాపు ప్రక్రియను ప్రేరేపించే మాంసాహారం, మసాలాలు,  వేపుళ్లు ఎక్కువగా తీసుకోవద్దు. పండ్లు, కూరగాయలు.. బాదం, పిస్తా వంటి గింజపప్పులు ఎక్కువగా తినాలి. ఒత్తిడి, విచారంతో సోరియాసిస్‌ ఎక్కువయ్యే అవకాశముంది కాబట్టి వీటిని తగ్గించుకోవటానికి ప్రయత్నించాలి. ఏదేమైనా ఒకసారి చర్మ నిపుణులను సంప్రదిస్తే, పరీక్షించి తగు మందులు సూచిస్తారు.


చిరునామా: సమస్య-సలహా, సుఖీభవ, ఈనాడు కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512 email: sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని