కిడ్నీరాయి కరుగుతుందా?

నాకు 23 ఏళ్లు. కుడి కిడ్నీలో ఇంటర్‌ పోల్‌లో 6.5 ఎం.ఎం. రాయి ఉన్నట్టు స్కాన్‌లో తేలింది. రెండు నెలల నుంచి మాత్రలు, సిరప్‌ వాడుతున్నాను. కిడ్నీ ఉన్నచోట, కిడ్నీకి పైన, గజ్జల్లో నొప్పిగా ఉంటోంది.

Updated : 03 May 2022 06:11 IST

సమస్య: నాకు 23 ఏళ్లు. కుడి కిడ్నీలో ఇంటర్‌ పోల్‌లో 6.5 ఎం.ఎం. రాయి ఉన్నట్టు స్కాన్‌లో తేలింది. రెండు నెలల నుంచి మాత్రలు, సిరప్‌ వాడుతున్నాను. కిడ్నీ ఉన్నచోట, కిడ్నీకి పైన, గజ్జల్లో నొప్పిగా ఉంటోంది. రాయి అదే పడిపోతుందా? ఆపరేషన్‌ చేయించుకోవాలా? అసలు రాయి కరుగుతుందా? లేకపోతే మూత్రం నుంచి బయటకు వస్తుందా?

- సంతోష్‌ (ఈమెయిల్‌)

సలహా: మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే కిడ్నీ మధ్యలో రాయి ఉన్నట్టు అనిపిస్తోంది. ఇలాంటి రాళ్లు మూత్రనాళానికి అడ్డుపడే అవకాశం తక్కువ. అందువల్ల అంతగా నొప్పేమీ కలగదు. గజ్జల్లో నొప్పికి కిడ్నీ రాయికి సంబంధం లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కిడ్నీ రాళ్లతో తలెత్తే నొప్పి వెన్నుపూసలకు అటువైపు, ఇటువైపు వస్తుంటుంది. కాబట్టి ముందుగా వెన్ను, నాడీ సమస్యల వంటి ఇతరత్రా కారణాలతో నొప్పి వస్తుందేమో చూసుకోవాల్సి ఉంటుంది. ఇవేవీ లేనట్టయితే, కిడ్నీ రాయితోనే నొప్పి వస్తుందని అనుకోవచ్చు. కిడ్నీ రాళ్లలో రకరకాలుంటాయి. యూరిక్‌ ఆమ్లంతో కూడిన రాళ్లు మాత్రమే కరిగే అవకాశముంటుంది. క్యాల్షియంతో కూడిన రాళ్లు మాత్రలు, సిరప్‌లతో కరగవు. మీరు 6.5 ఎం.ఎం. రాయి ఉందంటున్నారు. ఇది మరీ పెద్ద రాయేమీ కాదు. నిజానికి నొప్పి లేకపోతే అలాగే వదిలేసినా ఏమీ కాదు. కిడ్నీ ఏమీ దెబ్బతినదు. రాయి ఉన్నచోటు నుంచి కదిలితే మాత్రం మూత్రనాళానికి అడ్డుపడే ప్రమాదముంది. దీంతో నొప్పి, కిడ్నీలో వాపు వంటి ఇబ్బందులు తలెత్తొచ్చు. కాబట్టి కిడ్నీ రాయితోనే నొప్పి వస్తున్నట్టు తేలితే రెట్రోగ్రేడ్‌ ఇంట్రా రీనల్‌ సర్జరీ (ఆర్‌ఐఆర్‌ఎస్‌) అవసరమవుతుంది. ఇందులో మూత్రమార్గం ద్వారా సన్నటి గొట్టాన్ని లోపలికి పంపించి, లేజర్‌ సాయంతో రాయిని ముక్కలు చేస్తారు. ఈ ముక్కలన్నీ మూత్రం ద్వారా బయటకు వస్తాయి. మీరు యూరాలజిస్టును సంప్రదిస్తే పరీక్షించి, తగు చికిత్స సూచిస్తారు.


చిరునామా: సమస్య-సలహా, సుఖీభవ, 

ఈనాడు కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512  email: sukhi@eenadu.in


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని