పులిపిర్లకు శాశ్వత పరిష్కారమేది?

నాకు ముఖం మీద పులిపిర్లు వచ్చాయి. మందు రాసినప్పుడు తగ్గుతున్నాయి. మళ్లీ వేరే దగ్గర వస్తున్నాయి. వీటిని శాశ్వతంగా తొలగించుకునే మార్గమేంటి?...

Published : 31 May 2022 00:32 IST

సమస్య-సలహా

సమస్య: నాకు ముఖం మీద పులిపిర్లు వచ్చాయి. మందు రాసినప్పుడు తగ్గుతున్నాయి. మళ్లీ వేరే దగ్గర వస్తున్నాయి. వీటిని శాశ్వతంగా తొలగించుకునే మార్గమేంటి?

- ఎం. పార్థసారథి నాయుడు

సలహా: పులిపిర్లు ఒక రకమైన చర్మ ఇన్‌ఫెక్షన్‌. దీనికి కారణం హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (హెపీవీ). ఇది చర్మం మీద పగుళ్లు, కోతల వంటి వాటి ద్వారా లోనికి ప్రవేశిస్తుంది. దీని మూలంగా కొందరికి గరుకుగా, చర్మం రంగులో చిన్న కాయల మాదిరిగా పులిపిర్లు ఏర్పడుతుంటాయి. కొన్ని పులిపిర్లు చర్మానికి అతుక్కుపోయినట్టుగానూ (ఫ్లాట్‌) ఉండొచ్చు. సాధారణంగా ఇవి చేతులపై ఎక్కువగా కనిపిస్తుంటాయి గానీ పాదాలు, ముఖం, జననాంగాలు, మోకాళ్ల మీదా రావొచ్చు. పులిపిర్లను చాలామంది చేత్తో గిల్లి, తీసేయాలని చూస్తుంటారు. ఇది తగదు. దీంతో సమస్య మరింత ఎక్కువవుతుంది. కాయల మాదిరి పులిపిర్లను రేడియో ఫ్రీక్వెన్సీతో కత్తిరించి, తీసేయొచ్చు. నున్నటి పులిపిర్లయితే క్రయోథెరపీ చేయాల్సి ఉంటుంది. వీటితో పులిపిర్లు శాశ్వతంగా పోతాయి. క్రయోథెరపీలో మైనస్‌ 67 డిగ్రీల ద్రవ నత్రజనితో వైరస్‌ను గడ్డకట్టిస్తారు. దీంతో వైరస్‌ చనిపోతుంది. చర్మంతో పాటు వైరస్‌ కూడా ఊడిపోయి పడిపోతుంది. ముక్కు పక్కల కాయల మాదిరి పులిపిర్లకూ క్రయోథెరపీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కత్తిరించినప్పుడు పొరపాటున శ్వాస ద్వారా వైరస్‌ లోపలికి వెళ్తే గొంతులోనూ పులిపిర్లు ఏర్పడే ప్రమాదముంది. ఒకట్రెండు పులిపిర్లు ఉన్నప్పుడే తీయించుకోవటం మంచిది. లేకపోతే క్రమంగా సంఖ్య పెరుగుతూ వస్తుంది. చికిత్స తీసుకున్నాక కొద్దిరోజుల పాటు జింక్‌ మాత్రలు వేసుకోవాల్సి ఉంటుంది. ఇవి యాంటీవైరల్‌గా పనిచేస్తాయి. రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి. దీంతో వైరస్‌ వృద్ధి చెందదు. చికిత్స ఫలితమూ త్వరగా కనిపిస్తుంది. చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్లు వాడుకోవటం ద్వారా పులిపిర్లు వ్యాపించకుండా చూసుకోవచ్చు. గడ్డం భాగంలో పులిపిర్లు ఉన్నప్పుడు బ్లేడుతో షేవింగ్‌ చేసుకోవద్దు. బయట షేవింగ్‌ చేయించుకుంటే పూర్తిగా శుభ్రం చేసిన పరికరాలనే వాడేలా చూసుకోవాలి.


మందులతో పచ్చబొట్టు పోతుందా?

సమస్య: చేతి మీద పచ్చబొట్టు తొలగించుకోవటానికి ఏవైనా మందులున్నాయా?

- మొహమ్మద్‌ షఫీ

సలహా: పచ్చబొట్టు చర్మం పైపొర కింద ఉండే ‘డెర్మిస్‌’లో ముద్రితమవుతుంది. అంత లోపలికి వెళ్లే మందులేవీ లేవు. దీనికి లేజర్‌ చికిత్స ఉత్తమం. శస్త్రచికిత్సతోనూ తొలగించొచ్చు గానీ మచ్చ ఏర్పడుతుంది. క్యూ స్విచ్‌ లేజర్‌తో మచ్చలేవీ పడకుండా పచ్చబొట్టును శాశ్వతంగా తొలగించొచ్చు. అవసరమైతే దీన్ని రెండు మూడు సార్లు చేయాల్సి ఉంటుంది. నల్లరంగు పచ్చబొట్టు తేలికగా పోతుంది. నీలం రంగు పచ్చబొట్టు కాస్త కష్టం. ఆకుపచ్చ, ఎరుపు పచ్చబొట్లను తొలగించటం ఇంకాస్త కష్టం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని