Updated : 06 Sep 2022 06:47 IST

హుషారే హుషారు!

హుషారు తగ్గినప్పుడు తెలుస్తుంది దాని విలువేంటో. ఏ పనీ చేయబుద్ధి కాదు. దేని మీదా మనసు నిలవదు. ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. మరి రోజంతా హుషారుగా ఉండాలంటే? కొన్ని చిట్కాలు, ఉపాయాలు లేకపోలేదు.


ఎండలోకి వెళ్లాలి

శరీరానికి కాస్త ఎండ తగిలేలా చూసుకుంటే హుషారుకు బీజం వేసుకున్నట్టే. ఎందుకంటే ఎండ మన మెదడులో సెరటోనిన్‌ అనే రసాయనాన్ని ప్రేరేపిస్తుంది. మెదడులో నాడీ కణాల మధ్య, శరీమంతటా సమాచార వాహకంగా పనిచేసే ఇది మానసిక స్థితినీ ఉత్తేజితం చేస్తుంది. కాబట్టి అలా ఆరుబయటకు వెళ్లి కాసేపు ఎండలో గడపటం మేలు. ఈ సమయాన్ని వ్యాయామానికి ఉపయోగించుకుంటే ఇంకా మంచిది. ఒక మాదిరి కుంగుబాటుకు వ్యాయామం మందుల మాదిరిగానే చికిత్సగా ఉపయోగపడుతున్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి. కుంగుబాటు తిరగబెట్టకుండా చూడటంలో వ్యాయామం మందుల కన్నా మరింత మెరుగ్గానూ ఉపయోగపడుతుంది. ఇది ఆందోళన తగ్గటానికీ తోడ్పడుతుంది. నిరాశ, నిస్పృహ, ఆందోళన తగ్గితే హుషారు దానంతటదే వచ్చేస్తుంది మరి.


కంటి నిండా నిద్ర

రాత్రిపూట నిద్ర సరిగా పట్టకపోతే తెల్లారి నీరసంగా, మత్తుగా ఉండటం తెలిసిందే. మరి కంటి నిండా నిద్ర పట్టేలా చూసుకుంటే వీటిని తరిమి కొట్టొచ్చు కదా. నిద్ర పట్టేలా చేయటంలో మెలటోనిన్‌ హార్మోన్‌ పాత్ర కీలకం. చీకటి పడుతున్న కొద్దీ మన మెదడు దీన్ని ఉత్పత్తి చేయటం ఆరంభిస్తుంది. పగటి పూట, సాయంత్రం వేళల్లో మనం చేసే కొన్ని పనులు మెలటోనిన్‌ మోతాదుల మీద గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇది పరోక్షంగా నిద్ర మీదా ప్రభావం చూపుతుంది. దీన్ని పెంచుకోవటానికి ఒక మార్గం ఉదయం పూట ఎండలో వ్యాయామం చేయటం. ఎందుకంటే సెరటోనిన్‌ తగ్గితే మెలటోనిన్‌ మోతాదులూ తగ్గే అవకాశముంది. అలాగే ఇంట్లో చల్లగా ఉండేలా చూసుకోవాలి. పడక గదిలో వెలుతురు ఎక్కువగా లేకుండా చూసుకోవటమూ ముఖ్యమే. శరీరం చల్లగా ఉన్నప్పుడు, చీకటిలో మెలటోనిన్‌ బాగా ఉత్పత్తి అవుతుంది. ఇది నిద్ర బాగా పట్టేలా చేస్తుంది.


సానుకూల భావనలతో

ఒకే విషయం, సంఘటన ఇద్దరికి వేర్వేరుగా కనిపించొచ్చు. ఒకరికి సానుకూలంగా అనిపిస్తే, మరొకరికి ప్రతికూలంగా అనిపించొచ్చు. ఇది చూసే తీరు, భావించే విధానాన్ని బట్టి ఉంటుంది. అందువల్ల మన చుట్టుపక్కల పరిస్థితులు, వ్యక్తుల్లోని మంచిని చూడటానికి ప్రయత్నించాలి. దీంతో ఆందోళన, కుంగుబాటును దూరం చేసుకోవచ్చు. సానుకూల దృక్పథం అలవడితే మనుసూ హుషారుగా ఉంటుంది.


వర్తమానం మీద దృష్టి

గతాన్ని తలచుకొని బాధపడటం, భవిష్యత్తు గురించి బెంగపడితే వచ్చేదేముంది? విచారం తప్ప. కాబట్టి మనసును కలవరపెడుతున్న ఇలాంటి విషయాలను గుర్తించి, వర్తమానం మీద దృష్టి పెట్టటం అలవరచుకుంటే హుషారు, ఉత్సాహం కలుగుతాయి. మన చుట్టుపక్కల వస్తువులు, రంగులు, శబ్దాలు, వాసనలను గుర్తించటానికి ప్రయత్నం చేయటం ద్వారా వర్తమానం మీద దృష్టి పెట్టటం అలవాటు చేసుకోవచ్చు. శ్వాస తీసుకునే తీరు మీదా మనసు పెట్టొచ్చు. బాధ పెట్టే ఆలోచనలకు మరీ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా, కుమిలిపోకుండా వాటిని మనసులోంచి తొలగించుకోవటానికి ప్రయత్నించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని