Published : 08 Nov 2022 00:09 IST

హలో.. వినిపిస్తోందా?

కళ్లద్దాలు చూపు సమస్యను అధిగమించటానికే కాదు.. ఫ్యాషన్‌ చిరునామాగానూ మారిపోయాయి. చూపు బాగానే ఉన్నా అందం, ఆకర్షణ కోసమూ ఎంతోమంది ధరిస్తుండటం చూస్తూనే ఉంటాం. ఈ ధోరణి వినికిడి పరికరాల విషయంలో భిన్నంగా ఉండటం విచిత్రం. వీటిని వాడుకోవటానికి ఎంతోమంది వెనకాడుతుంటారు. ఇందుకు చాలా అంశాలు కారణమవుతుండొచ్చు గానీ అన్నింటికన్నా ప్రధానమైంది విముఖతే. వీటిని ధరిస్తే తమకు బాగా వినిపించదనే విషయం అందరికీ తెలిసిపోతుందని నామోషీ పడుతుంటారు. కానీ మన ప్రపంచం వినికిడి మీదే ఆధారపడి ఉందని గుర్తించాలి.

వినికిడి లోపానికి రకరకాల అంశాలు కారణమవుతుంటాయి. అయితే దీనికి కారణమేంటన్నది సమస్య మొదలయ్యాక గానీ బయటపడదు. వినికిడి లోపం తలెత్తినప్పుడు చికిత్స తీసుకోవటం తప్పనిసరి. లేకపోతే మతిమరుపు, కుంగుబాటు, కింద పడిపోవటం వంటి తీవ్ర సమస్యలు ముంచుకొచ్చే ప్రమాదముంది. అందువల్ల సమస్యను తేలికగా తీసుకోవటం తగదు. ఎదుటివారిని బిగ్గరగా మాట్లాడాలని తరచూ అడుగుతుండటం, టీవీ సౌండ్‌ బాగా పెంచటం, రణగొణధ్వనుల మధ్య ఆయా వ్యక్తుల గొంతులను సరిగా పోల్చుకోలేకపోవటం వంటివన్నీ వినికిడి పరీక్ష చేయించుకోవాల్సిన అవసరముందని సూచించే సంకేతాలే. ఇలాంటి లక్షణాలను గుర్తిస్తే విధిగా డాక్టర్‌ను సంప్రదించి, సలహా తీసుకోవాలి. ఒక్క చెవిలోనే వినికిడి తగ్గినట్టు గుర్తిస్తే మాత్రం అసలే తాత్సారం చేయరాదు. వినికిడి తగ్గినా అందరికీ సాధనాలు అవసరం ఉండకపోవచ్చు. డాక్టర్లు పరీక్ష చేసి, ఎలాంటి రకం లోపమనేది గుర్తిస్తారు. దీని ఆధారంగా వినికిడి పరికరాల అవసరముందో, లేదో నిర్ణయిస్తారు. వీలైనంత త్వరగా చికిత్స తీసుకుంటే సమస్య మరింత ముదరకుండా, ఇబ్బందుల బారినపడకుండా చూసుకోవచ్చు.

ఉపాయాలు లేకపోలేదు

వినికిడి సాధనాలను అంగీకరించకపోవటానికి బహుశా మనసే కారణం కావొచ్చు. ఇతరుల కన్నా భిన్నంగా కనిపించటానికి ఎవరూ ఇష్టపడరు కదా. అయితే రోజువారీ జీవితంలో వీటిని భాగస్వామ్యం చేసుకోగలిగితే పెద్ద మార్పే కనిపిస్తుంది. ఇందుకు కొన్ని ఉపాయాలు తోడ్పడతాయి.

ముందుగా ఇంట్లో: వినికిడి పరికరాలను ధరించి బయటకు వెళ్లటానికి ముందు ఇంట్లోనే ప్రయత్నించటం మంచిది. తెలిసిన వారి మధ్య, ప్రశాంతమైన వాతావరణంలో ధరిస్తే బెరుకు తగ్గుతుంది. ఎదుటివారితో తగినంత బిగ్గరగా మాట్లాడటం, కొత్త సామర్థ్యాలకు తగినట్టుగా టీవీ శబ్దం సరిచేసుకోవటం వంటివి అలవడతాయి.

ఓపిక అవసరం: వినికిడి పరికరాలు చెవిలో సహజమైన భాగమేననే భావన కలగటానికి కొంత సమయం పడుతుంది. వీటిని ధరించే సమయాన్ని ప్రతిరోజూ కొద్ది కొద్దిగా పెంచుకుంటూ పోతే క్రమంగా అలవడుతుంది. కొద్ది వారాల్లోనే రోజూ ధరించటానికి మానసికంగా సన్నద్ధమవుతారు.

అవసరాలను బట్టి: కొన్ని సందర్భాల్లో వినికిడి పరికరాలు లేకపోతే పనులు జరగకపోవచ్చు. కొన్ని చోట్ల వీటి అవసరమేమీ ఉండకపోవచ్చు. ఉదాహరణకు- ఏదైనా సమావేశానికో, సినిమాకో వెళ్తున్నారనుకోండి. పరికరాలు ధరించటం తప్పనిసరి. అదే ఇంట్లో పుస్తకం చదువుకుంటుంటే వీటి అవసరమే ఉండదు. కాబట్టి ఆయా అవసరాలకు అనుగుణంగా వాడుకోవటం అలవాటు చేసుకోవాలి.

సరిపడేలా సవరణ: వినికిడి సాధనాలను వాడుకోవటం మొదలెట్టాక ఓసారి డాక్టర్‌ను సంప్రదించటం ముఖ్యం. అవసరమైతే మన అవసరాలకు అనుగుణంగా వీటిని సవరిస్తారు. పరికరాలతో నొప్పి కలుగుతున్నా డాక్టర్‌కు చెప్పాలి. సౌకర్యంగా లేవని వాడుకోవటం మానెయొద్దు. చెవి ఆకారానికి అనుగుణంగా సవరించుకునే అవకాశం లేకపోలేదు.

అభిప్రాయాలు పంచుకోవటం: వినికిడి పరికరాలను వాడే స్నేహితులు, బంధువుల అనుభవాలను తెలుసుకోవటానికి ప్రయత్నించటం మంచిది. మొదట్లో వాళ్లూ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు. వాటిని ఎలా అధిగమించారో తెలుసుకుంటే ఎంతగానో ఉపయోగపడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు