పునరుత్పత్తి అంశాలతో మహిళల్లో గుండెజబ్బులు

గుండెజబ్బు ముప్పు కారకాలు మహిళల్లో భిన్నంగా ఉంటుంటాయి. ఇందులో పునరుత్పత్తి అంశాలూ పాలు పంచుకుంటున్నట్టు ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ అధ్యయనంలో బయటపడింది

Published : 07 Mar 2023 00:24 IST

గుండెజబ్బు ముప్పు కారకాలు మహిళల్లో భిన్నంగా ఉంటుంటాయి. ఇందులో పునరుత్పత్తి అంశాలూ పాలు పంచుకుంటున్నట్టు ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ అధ్యయనంలో బయటపడింది. త్వరగా తొలి సంతానాన్ని కన్నవారికి, ఎక్కువ మంది పిల్లల్ని కన్నవారికి, త్వరగా రజస్వల అయినవారికి గుండెజబ్బు ముప్పు పెరుగుతున్నట్టు తేలింది. లక్షకు పైగా మంది మహిళలపై గతంలో నిర్వహించిన అధ్యయనాలను పరిశీలించి ఈ విషయాన్ని గుర్తించారు. మహిళల్లో వృద్ధాప్యంలో తలెత్తే గుండెజబ్బుకూ పునరుత్పత్తి అంశాలకూ సంబంధం ఉంటున్నట్టు కొన్ని పరిశీలనాత్మక పరిశోధనలు చెబుతున్నాయి. కానీ అవన్నీ కార్యకారణ సంబంధాన్ని స్పష్టంగా వివరించలేకపోయాయి. అందుకే తాజా అధ్యయనంలో గణాంక పద్ధతిలో విశ్లేషించారు. త్వరగా తొలి సంతానం కలగటం, ఎక్కువమంది పిల్లల్ని కనటం, చిన్నతనంలోనే రజస్వల కావటం మూలంగా మహిళల్లో గుండెలయ తప్పటం, గుండె రక్తనాళాల్లో పూడికలు, గుండె వైఫల్యం, పక్షవాతం ముప్పు పెరుగుతున్నట్టు గుర్తించారు. త్వరగా రజస్వల అయినవారిలో శరీర ఎత్తు-బరువుల నిష్పత్తి (బీఎంఐ) ఎక్కువగా ఉండటం వల్ల వీరికి మరింత ఎక్కువ ప్రమాదం పొంచి ఉంటున్నట్టూ తేలింది. బీఎంఐని తగ్గించుకుంటే గుండెజబ్బు ముప్పునూ తగ్గించుకోవచ్చని ఇది సూచిస్తోంది. త్వరగా తొలి సంతానాన్ని కనటంతో పొంచి ఉన్న గుండెజబ్బు ముప్పునూ అధిక బరువు, కొలెస్ట్రాల్‌, రక్తపోటు వంటి సంప్రదాయ ముప్పు కారకాలను తగ్గించుకోవటం ద్వారా పరిమితం చేసుకోవచ్చు. గుండెజబ్బు ముప్పు పెరగటంలో పునరుత్పత్తి అంశాలు ఎంతవరకు కారణమవుతున్నాయో కచ్చితంగా బయట పడకపోయినా ఇవి చాలా ముఖ్యమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు. వీటి గురించి స్త్రీలకు అవగాహన కల్పించి, నివారణ చర్యలు పాటించేలా చూడాలని సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని