ఏఐతో క్యాన్సర్ల అంచనా

ఇటీవల కొన్నిరకాల అన్నవాహిక, జీర్ణాశయ క్యాన్సర్లు ఎక్కువవుతున్నాయి. ఈసోఫేగల్‌ అడినోకార్సినోమా (ఈఏసీ), గ్యాస్ట్రిక్‌ కార్డియా అడినోకార్సినోమా (జీసీఈ) బారినపడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

Updated : 29 Aug 2023 05:43 IST

ఇటీవల కొన్నిరకాల అన్నవాహిక, జీర్ణాశయ క్యాన్సర్లు ఎక్కువవుతున్నాయి. ఈసోఫేగల్‌ అడినోకార్సినోమా (ఈఏసీ), గ్యాస్ట్రిక్‌ కార్డియా అడినోకార్సినోమా (జీసీఈ) బారినపడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే నివారణ పద్ధతులతో వీటిని తగ్గించుకునే అవకాశం లేకపోలేదు. ఇందుకు ముందస్తు పరీక్షలు (స్క్రీనింగ్‌) బాగా ఉపయోగపడతాయి. జీర్ణాశయ రసాలు గొంతులోకి ఎగదన్నుకొని వచ్చే (జీఈఆర్‌డీ) సమస్యతో దీర్ఘకాలంగా బాధపడేవారిలో బారెట్స్‌ ఈసోఫేగస్‌ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవి కొన్నిసార్లు క్యాన్సర్‌కూ దారితీస్తాయి. ఇలాంటి క్యాన్సర్‌ ముందు మార్పులను గుర్తిస్తే నివారించుకునే ప్రయత్నం చేయొచ్చు. అందుకే అన్నవాహిక, జీర్ణాశయ క్యాన్సర్ల ముప్పు ఎక్కువగా ఉన్నవారికి ముందస్తు పరీక్షలు చేయాలని ప్రస్తుత మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. కానీ చాలామందికి ఈ విషయమే తెలియదు. అన్నవాహిక, జీర్ణాశయ క్యాన్సర్ల బారినపడ్డవారిలో ఎంతోమంది వీటిని చేయించుకోక పోవటమే దీనికి నిదర్శనం. అయితే కృత్రిమ మేధ (ఏఐ) పరికరం సాయంతో క్యాన్సర్ల ముప్పు గలవారిని గుర్తించే అవకాశముందని మిషిగన్‌ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు గుర్తించారు. ఇందుకోసం కెటెల్స్‌ ఈసోఫేగల్‌ అండ్‌ కార్డియా అడినోకార్సినోమా ప్రిడిక్షన్‌ (కె-ఈక్యాన్‌) అనే టూల్‌ను రూపొందించారు. ఎలక్ట్రానిక్‌ వైద్య రికార్డులతో దీన్ని సంధానం చేసి పరీక్షించారు. ఇది జబ్బు నిర్ధరణ కావటానికి కనీసం మూడేళ్ల ముందే క్యాన్సర్లను అంచనా వేస్తుండటం విశేషం. ఇది ఆరోగ్య వివరాల్లో నమోదు చేసిన రోగుల నివాస ప్రాంతం, బరువు, గత జబ్బుల నిర్ధరణ, పరీక్షల ఫలితాల వంటి వాటిని విశ్లేషించి క్యాన్సర్‌ను అంచనా వేసింది. అన్నవాహిక క్యాన్సర్‌ ముప్పు కారకాల్లో ఛాతీమంట వంటి జీఈఆర్‌డీ లక్షణాలు అతి ముఖ్యమైనవని అధ్యయనానికి నేతృత్వం వహించిన రుబెన్‌స్టీన్‌ చెబుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని