పాత మెదడు గాయాలకూ పరికరం చేదోడు

తలకు తీవ్రమైన దెబ్బ తగిలితే విషయ గ్రహణ సామర్థ్యం తగ్గే ప్రమాదముంది. ఏకాగ్రత కుదరకపోవటం, మతిమరుపు, నిర్ణయాలు తీసుకోలేకపోవటం వంటివి ఇబ్బంది పెడతాయి.

Published : 12 Dec 2023 01:10 IST

తలకు తీవ్రమైన దెబ్బ తగిలితే విషయ గ్రహణ సామర్థ్యం తగ్గే ప్రమాదముంది. ఏకాగ్రత కుదరకపోవటం, మతిమరుపు, నిర్ణయాలు తీసుకోలేకపోవటం వంటివి ఇబ్బంది పెడతాయి. చదువుల్లో, ఉద్యోగాల్లో చిక్కులు తెచ్చిపెడతాయి. ఇలాంటివారికి ప్రయోగాత్మకంగా మెదడులో అమర్చే పరికరం మేలు చేస్తున్నట్టు స్టాన్‌ఫర్డ్‌ మెడిసిన్‌లో నిర్వహిస్తున్న పరిశోధనలో బయటపడింది. చాలా ఏళ్ల క్రితం దెబ్బ తగిలినవారికీ ఈ పరికరం పనిచేస్తుండటం విశేషం. మెదడుకు దెబ్బతగలటం మూలంగా జ్ఞాపకశక్తి కోల్పోయినవారికి మెదడులో పరికరాన్ని అమర్చి, గాయం మూలంగా నిర్వీర్యమైన అనుసంధానాలను ప్రేరేపించేలా చేయటం దీనిలోని కీలకాంశం. పరికరాన్ని అమర్చిన వెంటనే మార్పు కనిపించటం విచిత్రం. అప్పటివరకూ సాధ్యం కాని వస్తువుల జాబితాను చదవటం, పండ్లు కూరగాయల పేర్లు వల్లె వేయటం వంటివి చేస్తుండటం.. అదే పరికరాన్ని ఆఫ్‌ చేస్తే ఇవన్నీ ఆగిపోవటం గమనార్హం. కోమా నుంచి బయటపడి, విషయ గ్రహణ సామర్థ్యాన్ని చాలావరకు తిరిగి పొందినవారిలో ఏకాగ్రత, అప్రమత్తత వంటి పనులతో ముడిపడిన మెదడు వ్యవస్థలు సురక్షితంగా ఉండే అవకాశముంది. కాకపోతే అవి ఉత్తేజితం కావు. మెదడులో పరికరాన్ని అమర్చి వీటిని ప్రేరేపించొచ్చు. అంటే మసకగా వెలిగే బల్బుకు తగినంత విద్యుత్తు సరఫరా అయితే బాగా ప్రకాశిస్తుంది కదా. ఇదీ అలాగే ఉపయోగపడుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు