ఎముకకు ఆటల బలం!

యుక్తవయసులో శరీరం, ఎముకల ఎదుగుదల చురుకుగా, వేగంగా సాగుతుంది. ఒకవేళ దీనికి ఏదైనా అవాంతరం తలెత్తితే మున్ముందు జీవితాంతం ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఎముక సాంద్రత తగ్గిపోయి.. ఎముకలు క్షీణించటం, తేలికగా విరిగిపోవటం వంటి ముప్పులు పెరుగుతాయి.

Updated : 29 Nov 2022 12:53 IST

యుక్తవయసులో శరీరం, ఎముకల ఎదుగుదల చురుకుగా, వేగంగా సాగుతుంది. ఒకవేళ దీనికి ఏదైనా అవాంతరం తలెత్తితే మున్ముందు జీవితాంతం ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఎముక సాంద్రత తగ్గిపోయి.. ఎముకలు క్షీణించటం, తేలికగా విరిగిపోవటం వంటి ముప్పులు పెరుగుతాయి. అందువల్ల యుక్తవయసులో తగినంత శారీరకశ్రమ, వ్యాయామం చేసేలా పిల్లలను ప్రోత్సహించటం ఎంతో మంచిది. ఇవి కుదరకపోతే కనీసం ఆరుబయట ఆటలు ఆడేలా చూసినా మేలే. దీంతో ఎముకల్లోకి క్యాల్షియం బాగా చేరుకుని, ఎముక పుష్టికి తోడ్పడుతుంది. తాజా అధ్యయనం ఒకటి దీన్ని మరోసారి బలపరిచింది. ఫుట్‌బాల్‌ ఆడటం వల్ల యుక్తవయసు మగపిల్లల్లో ఎముకల వృద్ధి మెరుగ్గా ఉంటున్నట్టు బ్రిటన్‌లోని ఎక్స్‌టర్‌ విశ్వవిద్యాలయ అధ్యయనం పేర్కొంటోంది. ఈత కొట్టటం, సైకిల్‌ తొక్కటం వంటి వాటి కంటే కూడా ఫుట్‌బాల్‌తోనే మరింత మెరుగైన ఫలితం కనబడుతుండటం విశేషం. అధ్యయనంలో భాగంగా 12-14 ఏళ్ల భావి క్రీడాకారులను ఎంచుకొని ఏడాది పాటు పరిశీలించారు. ఈత, సైకిల్‌ క్రీడాకారులతో పోలిస్తే వీరిలో ఎముకలోని ఖనిజాల మోతాదు (బీఎంసీ) మరింత ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. వారానికి 9 గంటల సేపు ఫుట్‌బాల్‌ సాధన చేసేవారినే తాము పరిశీలించినప్పటికీ.. వారానికి 3 గంటల సేపు ఫుట్‌బాల్‌ ఆడినా గణనీయమైన ఫలితం కనబడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. తీవ్రమైన శారీరకశ్రమను కలగజేస్తూ, కండరాలపై బాగా ప్రభావం చూపే టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌ వంటి క్రీడలు కూడా ఇలాంటి ప్రభావమే చూపగలవని పేర్కొంటున్నారు. కాబట్టి వీలైనప్పుడల్లా పిల్లలను ఆటలు ఆడేలా ప్రోత్సహించటం మంచిది. ఇవి భవిష్యత్తు ఆరోగ్యానికి సోపానాలుగా పనిచేస్తాయి. పెద్దయ్యాక మరింత బలంగా, దృఢంగా ఉండేందుకు కూడా తోడ్పడతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని