సహజ కాన్పా? సిజేరియనా?

ఆసుపత్రుల్లో అందరికీ సిజేరియన్‌ చేసేస్తున్నారని చాలామంది భావిస్తుంటారు గానీ సహజ కాన్పు కావటానికి గర్భిణి సహకారం చాలా అవసరం. డాక్టర్‌ చెప్పినట్టు నడుచుకోవాలి.

Updated : 17 Jan 2023 09:15 IST

ఆసుపత్రుల్లో అందరికీ సిజేరియన్‌ చేసేస్తున్నారని చాలామంది భావిస్తుంటారు గానీ సహజ కాన్పు కావటానికి గర్భిణి సహకారం చాలా అవసరం. డాక్టర్‌ చెప్పినట్టు నడుచుకోవాలి. నొప్పులను భరించాలి. ఇప్పుడు కాన్పు సమయంలో గర్భిణికి భరోసా ఇవ్వటానికి తోడుగా ఒకరిని అనుమతిస్తున్నారు. వీరిలో కొందరు అమ్మాయి నొప్పులు భరించలేదని భయపడుతూ సిజేరియన్‌ చేయాలని ముందే పోరు పెడుతుంటారు. కొందరు గర్భిణులు కాన్పు నొప్పుల భయంతోనూ (టోకోఫోబియా) సిజేరియన్‌ చేయమని అడుగుతుంటారు. సాధారణంగా 38 వారాల తర్వాత సహజ కాన్పు అవుతుందా? లేదా? అన్నది తెలుస్తుంది. గర్భస్థ శిశువు బరువు మామూలుగా ఉండి.. గర్భిణి మరీ పొట్టిగా, మరీ లావుగా లేకపోతే చాలావరకు కాన్పు సహజంగానే అవుతుంది. ఇందుకు కాన్పయ్యే దారి సక్రమంగా ఉండటమూ ముఖ్యమే. దీన్ని ముందుగానే పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. గర్భం ధరించిన 39-41 వారాల వరకు పూర్తికాలంగా (టర్మ్‌) భావిస్తారు. అదే 37-39 వారాల్లో కాన్పయితే ముందస్తు కాన్పు అంటారు. ఈ సమయంలో బిడ్డ చాలావరకు ఎదుగుతుంది కానీ పూర్తిస్థాయిలో ఎదగదు. అయినా శిశు సంరక్షణ పద్ధతులతో బిడ్డకు ఎలాంటి హాని కలగకుండా చూసుకోవచ్చు. మనదగ్గర.. ముఖ్యంగా దక్షిణాదిలో 40 వారాలు దాటాక మాయ పనిచేయటం తగ్గిపోతుంది. దీంతో పిండానికి రక్తసరఫరా తగ్గుతుంది. ఫలితంగా సమస్యలు తలెత్తొచ్చు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ 41 వారాలు దాటకముందే కాన్పయ్యేలా చూడాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో అంటే గర్భిణికి మధుమేహం, అధిక రక్తపోటు, పెద్ద ప్రాణానికి ముప్పు, మాయ కిందికి ఉండటం వంటి సందర్భాల్లో ముందుగానే సిజేరియన్‌ చేయాల్సి రావొచ్చు. ఏదైనా కారణంతో సిజేరియన్‌ అవసరమైనా 39 వారాల తర్వాత చేయటమే మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని