కీడెంచి..

‘‘నువ్వెపుడు వచ్చావ్‌ పిన్నీ?’’ అప్పుడే బయటనుంచి వచ్చిన స్వర్ణ హాల్లో కూర్చున్న కామేశ్వరిని ఆనందంగా పలకరించింది. కామేశ్వరి ముభావంగా ‘‘నేనొచ్చి ఒక గంట అయిందిలే’’ అంది.

Published : 09 Apr 2020 14:04 IST

గోగినేని మణి

‘‘నువ్వెపుడు వచ్చావ్‌ పిన్నీ?’’ అప్పుడే బయటనుంచి వచ్చిన స్వర్ణ హాల్లో కూర్చున్న కామేశ్వరిని ఆనందంగా పలకరించింది.

కామేశ్వరి ముభావంగా ‘‘నేనొచ్చి ఒక గంట అయిందిలే’’ అంది.

స్వర్ణ అక్కడే ఉన్న తల్లిదండ్రుల వైపు చూసింది. జయమ్మ, రామచంద్రం కూడా ఏదో ఆలోచనలో ఉన్నట్టుగా దిగులుగా కనిపించారు.

స్వర్ణకేమీ అర్థంకాలేదు. కామేశ్వరి పక్కన కూర్చుని ‘‘ఏంటీ, అందరూ అదోలా ఉన్నారు?’’ అనడిగింది.

కామేశ్వరి గట్టిగా నిట్టూర్చింది. ‘‘నేను మోసుకొచ్చిన వార్త అలాంటిది... అందరి మనసులూ పాడయ్యాయి’’ అంది.

‘‘ఊళ్లో ఎవరికైనా బా..గా..లేదా?’’ సంశయంగా అడిగింది స్వర్ణ.

‘‘అందరూ నిక్షే..పం..గానే ఉన్నారు’’ ఒత్తి పలుకుతూ అంది కామేశ్వరి. ‘‘మొన్నీమధ్య మా పక్కింట్లో ఉండే రామాయమ్మ వాళ్ళ బంధువులింటికి వెళ్లొచ్చిందిలే. నీక్కాబోయే అత్తారి ఊరే అది. రామాయమ్మ బంధువులకీ మీ అత్తగారువాళ్ళకీ బీరకాయపీచు చుట్టరికం ఉందట. ఈవిడా ఆ బంధువులతో కలిసి ఒకరోజు మీ అత్తగారింటికీ వెళ్లొచ్చింది. ఆవిడ చెప్పిన సంగతులు విన్నాక నాకు మతిపోయిందనుకో. రెండేళ్ళపాటు మంచి సంబంధం కోసం వెతికివెతికి చివరకు ఇలాంటి గోతిలోపడ్డామేమిటా అని’’.

స్వర్ణ కొంచెం ఆశ్చర్యంగా ‘‘నాన్న వాకబుచేస్తే కుమార్‌ గురించీ వాళ్ళ కుటుంబం గురించీ అందరూ చాలా మంచిగా చెప్పారు కదా’’ అంది.

పెదిమలు విరిచి చేతులు బారజాపుతూ కామేశ్వరి విసురుగా అంది ‘‘కొందరు అలాగే చెబుతారు... మనదేంపోయిందని ఏదో ఒకటి చెప్పేసి చేతులు దులిపేసుకుంటారు. 

ఏదైనా నష్టం జరిగితే మనకేగానీ వాళ్ళకి పోయేదేం ఉండదుగా’’.

‘‘అసలు సంగతేమిటో చెప్పు పిన్నీ...’’ కొంచెం అసహనంగా అడిగింది.

‘‘అయ్యో, చెప్పకుండా ఎలా ఉంటానే... నేను పనిగట్టుకుని వచ్చిందందుకేగా’’ అంటూ మెటికలు విరుచుకుంది. ‘‘మనకేదైనా పిండివంట తినాలనిపిస్తే వండుకోవటానికి బద్ధకిస్తాంగానీ నూనె, పిండి అయిపోతాయేమోనని అలాంటి చిన్న ఖర్చుల గురించి ఆలోచించం కదా. కానీ మీ అత్తగారింట్లో మాత్రం అలా ఆలోచిస్తారు... అంత పిసినారులన్నమాట. నెలకి సరిపడా తెచ్చుకున్న సరుకుల్లో ఏ కారణంవల్లయినా ఏదయినా అయిపోతే, అలాగే సర్దుకోవాలిగానీ మధ్యలో మళ్ళీ తెప్పించకూడదని వాళ్ళింట్లో ఓ రూలుందట. అది పెట్టిందెవరు... పెద్దవాళ్ళనుకునేవ్, కాదు... పెళ్ళికొడుకు కుమార్‌ చెల్లెలు... పేరేదో అన్నారు... అంజూనో ముంజూనో...’’.

‘‘సంజన’’ అంటూ అందించి, ‘‘నీకీ కబుర్లన్నీ ఎవరు చెప్పారు పిన్నీ?’’ అడిగింది స్వర్ణ.

‘‘ఇంకెవరో కాదు, మీ అత్తగారే స్వయంగా చెప్పిన మాటలివి. రామాయమ్మవాళ్ళు వెళ్ళినప్పుడు ఆవిడ అందరికీ పకోడీల ప్లేటు అందిస్తూ ‘నూనె అయిపోతుందని మా అమ్మాయి ఇలాంటి టిఫిన్లు చేయనివ్వదు. ఈరోజుకి పర్మిషన్‌ ఇచ్చింది. మీ పుణ్యాన మేమూ తింటున్నాం’ అని సంబరపడిందట. ఇదే విడ్డూరమనుకుంటే ఇంకా గొప్ప సంగతి ఏమిటంటే... ఆ పిల్లే ప్రతీనెలా అన్నగారి జీతమంతా తీసేసుకుని అతని ఖర్చులకి తనకి తోచినంత ఇస్తుంది. ఆ నెల ఫ్రెండ్సెవరో వస్తున్నారని ఖర్చులకి కొంచెం ఎక్కువ ఇమ్మని కుమార్‌ అడుగుతోంటే ఆ పిల్ల ససేమిరా వీల్లేదంటోందట. అన్నాచెల్లెళ్ళిద్దరి మాటలూ పక్కగది నుండి వీళ్ళ చెవినపడ్డాయిగదా, ఇక దాచటమెందుకని కాబోలు, మీ అత్తగారు అసలు సంగతిని చెప్పేసిందట. ‘సంపాదిస్తున్నాగానీ మా అబ్బాయికి చెల్లెలి పర్మిషన్‌లేందే ఖర్చుపెట్టుకునే స్వతంత్రంలేదు’ అని. తనమాట ఎవరు 

వినకపోయినా అలిగి అన్నం తినకుండా సాధిస్తుందట మరి. చిన్నపిల్లని ముందు వీళ్ళే బాగా గారాబం చేసి ఉంటారు... ఇపుడేమో ఏకు మేకైనట్లు అందరి నెత్తికెక్కి పెత్తనం చెలాయిస్తోందన్నమాట!’’

ఒక నిమిషం ఆగి డైనింగ్‌ టేబిల్‌ దగ్గరకెళ్ళి మంచినీళ్ళు తాగివచ్చి కూర్చుని జయమ్మ వైపు చూస్తూ మళ్ళీ మొదలుపెట్టింది. ‘‘అక్కయ్యా, నువ్విది చెప్పు... మన స్వర్ణ వాళ్ళింటికి వెశ్ళాక తనకంటే చిన్నదైన 

ఆ పిల్ల పెత్తనాన్ని సహించగలదా, లేనిపోని గొడవలు రావూ?’’

జయమ్మ ఏం మాట్లాడాలో తెలియనట్లుగా మౌనంగా ఉండిపోయింది.

స్వర్ణ కలుగజేసుకుంటూ ‘‘వాళ్ళమ్మాయంటే వాళ్ళకి ముద్దు కాబట్టి వాళ్ళంతా తనమాట వింటారేమోగానీ నేనెందుకు వింటానూ, నాకేమవసరం? అయినా తనుమాత్రం ఆ ఇంట్లో ఎన్నాళ్ళుంటుంది, పెళ్ళయాక వెళ్ళిపోతుందిగా’’ అంది.

‘‘అయ్యో, నే చెప్పబోయే అసలు సంగతి అదేనే తల్లీ’’ కామేశ్వరి చేతులు తిప్పుతూ విసురుగా అంది. ‘‘ఎంత దూరంలోకి వెళ్లొస్తుందనుకుంటున్నావ్‌... ఒక గంట ప్రయాణం, అంతే! చక్కెర ఫ్యాక్టరీ గురవయ్యగారులేరూ, వాళ్ళబ్బాయికీ ఈ అమ్మాయికీ పెళ్ళిమాటలు జరుగుతున్నాయి. వాళ్ళే ముందుకు వచ్చారని మీ అత్తగారూవాళ్ళు చెప్పుకుంటున్నారుగానీ అసలు సంగతి పిల్లల మధ్య ప్రేమాయణం నడిచి ఉంటుందిలే. అందుకే ఇక తప్పనిసరి కాబట్టి వాళ్ళ తాహతుకి సరితూగేట్టు కాకపోయినా తమ శక్తికొద్దీ కట్నకానుకలిస్తామని కబురు చేశారట! మీ మామగారు తనకున్న ఎనిమిదెకరాల పొలాన్నీ అందులో ఉన్న చిన్న పెంకుటిల్లుతో సహా అమ్మాయి పేర రాసెయ్యటమేగాక, ఇంకో మూడునెలల్లో తను రిటైరవుతున్నపుడు అందే డబ్బుతో పెళ్ళి ఘనంగా చేసి, లోటులేకుండా అన్ని లాంఛనాలూ జరుపుతానని ఒప్పుకున్నారట! వాళ్ళ మధ్యవర్తే నాకీ విషయం చెప్పాడు’’.

‘‘వాళ్ళమ్మాయికి వాళ్ళిష్టప్రకారం ఇచ్చుకుంటారు. దానికి మనమేం చేయగలం?’’ అంది స్వర్ణ.

‘‘సరిగ్గా మీ అమ్మా నాన్న అన్నట్లే నువ్వూ అన్నావు. మీకు లోకంపోకడ తెలిస్తేగా - నల్లనివన్నీ నీళ్ళూ తెల్లనివన్నీ పాలు అనుకుంటారు. మనమేం చేయగలం అంటావేంటీ, సంబంధాన్ని కాన్సిల్‌ చేసుకోవటం మన 

చేతిలోని పనేగా? రిటైరయ్యాక ఆ పెద్దవాళ్ళకి జీవితమంతా పెన్షనుతోనే గడవాలి. 

ఈ రోజుల్లో అవేమూలకి సరిపోతాయి? 

ఏ కష్టమొచ్చినా ఏ పెద్ద ఖర్చుమీదపడినా ఇక కొడుకే భరించాలి. పెద్దవాళ్ళతో వియ్యమందగానేసరా, వాళ్ళ తాహతుకి తగ్గట్లుగా అచ్చట్లూ ముచ్చట్లూ జరపొద్దూ. ఆస్తి మొత్తం గుత్తంగా కూతురికిచ్చేసి, బాధ్యతలన్నీ మీ నెత్తికి ఎక్కిస్తారన్నమాట’’ అక్కసుగా అంది కామేశ్వరి.

రామచంద్రం కుర్చీలో అసహనంగా కదిలాడు. ‘‘ముహూర్తం ఇరవై రోజుల్లోకి వచ్చాక ఇలాంటి విషయాలు పట్టుకుని వెనకడుగు వేయలేంగా?’’ అన్నాడు.

కామేశ్వరి రుసరుసలాడుతూ ‘‘అదేంటి బావా, అలా మాట్లాడుతున్నావు? ఈరోజుల్లో పెళ్ళయినవాళ్ళు విడాకులు తీసుకోవటమే మామూలు విషయం అయిపోయింది. 

విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మనకీ విషయాలన్నీ ముందే తెలిశాయి కాబట్టి ముందే కాదనుకోవటం మంచిది కాదూ?’’ అంది.

కామేశ్వరి అందరివైపూ తన చూపులు తిప్పింది. ఎవరూ మాట్లాడలేదు. నిట్టూరుస్తూ జయమ్మతో అంది ‘‘అక్కయ్యా, చేతులు కాలాక ఆకులు పట్టుకోవటంలా కాకుండా ముందే ఆలోచించమని చెబుతున్నాను. నీకు గుర్తుందిగా, మన ఊళ్లో బంగారమ్మ పెద్దకూతురు అత్త, ఆడబడుచుల ఆరళ్ళు పడలేకేగదూ ఉరేసుకుని చనిపోయిందీ. అంతెందుకు మొన్నీమధ్యేగా మా అత్తగారి చిన్న ఆడబిడ్డ రెండోకూతురు కూడా ఆడబడుచుల అఘాయిత్యాలు భరించలేకేగదా నూతిలోకి దూకిందీ... కాకపోతే చావుతప్పి కన్ను లొట్టపోయినట్లుగా చెయ్యిరగ్గొట్టుకుని చివరకు ప్రాణాలతో బయటపడిందిగానీ. అక్కడక్కడా అయినా ఇలాంటి ఘోరాలు వింటూనే ఉన్నాంగా! 

మన స్వర్ణ నోట్లో నాలుకలేనంత మెత్తన... అవతల ఆడబడుచు అందర్నీ తన చెప్పుచేతల్లో ఉంచుకోగలిగేంత గడుసుపిండం. అంతేకాకుండా వాళ్ళేమో అబ్బాయికి పైసా ఆస్తి లేకుండా చేస్తున్నారు. ఇవీ లొసుగులు... ఆపైన మీ ఇష్టం... ఆలోచించండి’’.

ఏదో ఆలోచనలో మునిగినట్లున్న స్వర్ణ తేరుకుని చిరునవ్వు నవ్వింది. ‘‘పిన్నీ, నువ్వేం భయపడకు. సంజన గడుసయితే నేను మహా గడుసు. సాగనిస్తేనే ఎవరైనా మనమీద స్వారీ చేయగలుగుతారు. వాళ్ళు ఆస్తి అంతా అమ్మాయికిచ్చేస్తున్నారని మనం ఈ సంబంధాన్ని వదులుకోవటంకంటే, వాళ్ళే ఆ సంబంధాన్ని వదులుకునేట్లుగా చేస్తే సరిపోతుందిగా’’ అంది కామేశ్వరితో.

కామేశ్వరి గట్టిగా నిట్టూరుస్తూ ‘‘వాళ్ళందరూ ఒకటి. నీ మాట ఎందుకు వింటారే’’ అంది.

‘‘సంజన చదువు పూర్తయ్యాక నాలుగు నెలల తర్వాతనేగదా పెళ్ళి చేయాలనుకుంటున్నారు. నేను ఈలోగానే వాళ్ళ కోడలినవుతానుగా, నా మాట ఎందుకు వినరూ? అయినా నా దగ్గర ఒక అస్త్రముందిలే’’ అంది ధీమాగా.

ఆందోళనగా ఉన్న రామచంద్రానికి స్వర్ణ మాటలతో స్థిమితం వచ్చి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. అతను కూతురుకు ఈ సంబంధం నిశ్చయించినపుడు... మంచి కుటుంబం, అబ్బాయికి మంచి ఉద్యోగం ఉంది, బుద్ధిమంతుడు... ఈ విషయాలకే ప్రాధాన్యత ఇచ్చాడు. ఇపుడేమో మరదలు వచ్చి  కొత్త సంగతులతో మెలికపెట్టింది. జయమ్మ చెల్లెలు మాటలకే మొగ్గు చూపిస్తోంది. భార్యను ఒప్పించేగాని, ఒప్పించి 

ఏ పనీ చేయలేడతను. అందుకే మనసులోనే మథనపడుతున్న అతనికి  స్వర్ణ మాటలతో భరోసా వచ్చింది.

‘‘స్వర్ణ ఫరవాలేదంటోంది కాబట్టి ఇక వాదనలనవసరం’’ అని చెప్పి అదే ఆఖరుమాట అన్నట్లుగా రామచంద్రం అక్కడినుంచి లేచి వెళ్ళిపోయాడు.

కామేశ్వరి మొహం చిన్నబోయింది. 

‘‘ఇదేమంత పట్టించుకోవాల్సిన సంగతి కాదన్నట్లుగా తేల్చేశాడు బావ. తోచీతోచనమ్మ తోడికోడలి పుట్టింటికి వెళ్ళిందన్నట్లుగా చివరకు నాకనవసరమైన విషయంలో నేను వేలు పెట్టినట్లయింది’’ అంది నిష్ఠూరంగా.

‘‘బావుంది, నీ తప్పులేకుండా నీకు తెలిసిన విషయాలు మా చెవిన వేశావు. ఎవరి కర్మకు ఎవరు కర్తలన్నట్లుగా ఎలా జరగాల్సివుందో అలా జరుగుతుంది... ఏం చేస్తాం’’ అంది జయమ్మ నిట్టూరుస్తూ.

* * *

పెళ్ళిరోజున.. విడిది నుండి సంజన తన బంధువులావిడను తీసుకుని స్వర్ణ ముస్తాబవుతున్న గదిలోకి వచ్చింది. ఆవిడ స్వర్ణను ముందుగా చూడాలనుకుంటే తీసుకువచ్చానని స్వర్ణకు పరిచయం చేసింది.

పట్టుచీరె కట్టుకుని కూర్చున్న స్వర్ణకు పూలజడ వేయటం పూర్తయిందిగానీ ఇంకా నగలు అలంకరించలేదు. మెడలో సన్నటి గొలుసు మాత్రమే ఉంది.ఆ బంధువులావిడ స్వర్ణను పరిశీలనగా చూస్తూ ‘‘అమ్మాయికి సింపుల్‌గా ఉండటమే ఇష్టం, నగలు పెట్టుకోదు అని చెప్పి, మా ఇంటికి ఇలాగే పంపించెయ్యరు కదా’’ అంది హాస్యంగా.

‘‘అది నిజమే, మీరు బాగానే తెలుసుకున్నారు. ఇంకా సమయం మించిపోలేదు, ఆలోచించుకోండి’’ అంది అక్కడే ఉన్న కామేశ్వరి వేశాకోళంగానే.

సంజన స్వర్ణ వైపు ఇష్టంగా చూసి చిరునవ్వుతో ‘‘మా వదినే బంగారం. వేరే నగలెందుకూ?’’ అంది.

సంజనతో వచ్చిన బంధువులావిడ ‘‘అదేమిటే నువ్వు వాళ్ళవైపు మాట్లాడుతున్నావ్‌. మనం మగపెళ్ళివారం... వంకలు పెట్టాలి... అది మన హక్కు’’ అంది నవ్వుతూ.

సంజన స్వర్ణ భుజం చుట్టూ చెయ్యివేసి ‘‘నిశ్చితార్థంరోజునే వదిన మా ఇంటి అమ్మాయి అయిపోయింది. తనని ఎవరు వేలెత్తిచూపినా నేను ఊరుకోను’’ అంది.

‘‘అమ్మో, నువ్వు నిజంగానే మీ వదినమీద ఈగను కూడా వాలనిచ్చేట్టులేవు’’ అంటూ అందరూ సరదాగా నవ్వారు.

సంజనవాళ్ళు వెళ్ళిన కాసేపటికి స్వర్ణను అలంకరిస్తున్నవాళ్ళూ బయటకు వెశ్ళారు.

కామేశ్వరి బుగ్గలు నొక్కుకుంటూ ‘‘ఆ పిల్ల గడుసుతనం ఎలాంటిదో నే చెప్పలేదూ... ఇప్పుడు నువ్వే చూశావుగా’’ అంది స్వర్ణతో.

స్వర్ణ ఆశ్చర్యపోతూ ‘‘అదేమిటి పిన్నీ, తను నన్నే సపోర్టు చేసిందిగా’’ అంది.

‘‘నీకేం తెలియదని నేనందుకే అంటున్నాను. మెచ్చుకుంటున్నట్లుగా మాట్లాడి నీకు కుచ్చుటోపీ పెట్టేసింది. ఆ మాత్రానికే నువ్వు నిజంగానే మురిసిపోతున్నావు. తనకెదురులేకుండా చేసుకోవటానికి మంచిమాటలతో అప్పుడే నీ ముందరికాళ్ళకు బంధమేస్తోంది’’.

స్వర్ణ కళ్ళెగరేస్తూ ‘‘అదేమిటో నేనూ చూస్తాగా’’ అంది.

* * *

స్వర్ణ అత్తగారింటికి వెళ్ళిపోయింది.

కొన్నాళ్ళ తరవాత..

కామేశ్వరి ఎవరో బంధువుల పెళ్ళికి వెళ్ళివస్తూ మధ్యలో స్వర్ణ అత్తగారి ఊళ్లోüఆగింది. అప్పుడు స్వర్ణ అత్తమామలు కూడా బంధువుల పెళ్ళికి వెశ్ళారు. కుమార్‌ ఆఫీస్‌కీ సంజన కాలేజీకీ వెళ్ళగా, స్వర్ణ ఒక్కతే ఇంట్లో ఉంది. పిన్నిని ఆనందంగా ఆహ్వానించింది.

కాసేపయ్యాక కామేశ్వరి ‘‘బాగా చిక్కినట్లున్నావే... మీ అత్తగారూవాళ్ళు నిన్ను కడుపునిండా తిననివ్వటంలేదా ఏమిటి?’’ అంటూ ఆరాతీసింది.

‘‘నీకు చిక్కినట్లు కనిపిస్తున్నానా’’ అంటూ స్వర్ణ నిట్టూర్చింది. దిగులుగా మొహంపెట్టి ‘‘ఈమధ్యలో నేను రెండు కేజీల బరువు పెరిగానని చెప్పి, ఇంకొక్క కేజీ అయినా పెరగటానికి వీల్లేదని సంజన నాకు వార్నింగ్‌ ఇచ్చి రాత్రిపూట పుల్కాలే తినాలని ఆర్డరేసింది. అప్పుడేమో అనుకున్నాగానీ పిన్నీ... నేనూ తన పెత్తనానికి తలవంచక తప్పలేదు’’ అంది.

కామేశ్వరి కళ్ళు పెద్దవిచేసి చూసింది. ‘‘చూశావా... చూశావా... నేను చెప్పిందెలా నిజమైందో! ఎంచుతుంటే మంచమంతా కంతలే అన్నట్లుగా ఉందీ సంబంధం అని నేనెంత మొత్తుకున్నా మీరెవరూ నా మాటల్ని లక్ష్యపెట్టలేదు. ఇప్పుడేమో ఏదో సామెత చెప్పినట్లుగా ఇంత బతుకూ బతికి చివరకు కడుపునిండా తినటానికి కూడా నోచుకోని పరిస్థితి దాపురించింది నీకు...’’ అంటూ 

కామేశ్వరి ముక్కు చీదేస్తుంటే, స్వర్ణ ఫక్కున నవ్వింది.

‘‘నేను తమాషా చేశాలే పిన్నీ’’ అంటూ మళ్ళీ అల్లరిగా నవ్వింది. ‘‘నీకు అసలు సంగతి చెప్పనా? మా అత్తగారికీ మామగారికీ కొలెస్ట్రాల్‌ పెరిగిందని నూనె వాడకం బాగా తగ్గించాలని డాక్టరు గట్టిగా హెచ్చరించారట. అందుకనే నెలకని తెచ్చిన నూనెతోనే గడపాలని సంజన రూలు పెట్టింది - ఖర్చు గురించి కాదు. వీళ్ళింట్లో రోజువారీ పండ్ల ఖర్చు వంద రూపాయలపైనే ఉంటుంది తెలుసా? ఇంకో సంగతి... మామయ్యగారు తను ఉద్యోగం చేస్తున్నాకదాని కుమార్‌ని తన శాలరీ అంతా బ్యాంకులో వేసుకోమని చెప్పారట. అయితే అతను ఫ్రెండ్స్‌తో పార్టీలకు ఖర్చు చేసేస్తుంటే, సంజన అన్నగారితో ఒక ఫ్లాట్‌ కొనిపించి, బ్యాంకు లోను ఇన్‌స్టాల్‌మెంట్స్‌కి ఎక్కువ మొత్తాన్ని జమచేసి, మిగతాది మాత్రమే అతని ఖర్చులకిస్తోందన్నమాట. అతని దుబారా ఖర్చుల్ని తగ్గించి ఆదాచేయించే ప్రయత్నమే తప్ప మరొకటికాదు. బరువు పెరిగి అందం, ఆరోగ్యం చెడగొట్టుకుంటానేమోననే శ్రద్ధతోనే సంజన నాకూ రూలు పెట్టింది. ఈ ఇంట్లో అందరిమధ్యా అపురూపమైన ఆత్మీయతానుబంధం ఉంది. ఒకరి మాటను ఒకరు కాదని మనసు నొప్పించలేరు. సంజన తన మాట ఎవరైనా వినకపోతే అలిగేమాట నిజమే పిన్నీ. అయితే ఆపేక్షతో ఆత్మీయతతో తను చెలాయించే అధికారానికి తలవంచటం ఇంట్లోవాళ్ళందరికీ ఇష్టమే’’.

ఒక క్షణం ఆగి స్వర్ణ మళ్ళీ చెప్పింది. 

‘‘మా అత్తగారు సంజన పెట్టే రూల్సు గురించి తమాషాగా, సరదాగా చెబితే, మీ రామాయమ్మవాళ్ళకి వేరేగా అర్థం అయింది. ఒకరి మాటలు ఇంకొకరి దగ్గరకు చేరేటప్పటికి వాటి రంగూ రుచీ మారిపోతాయనటానికి ఇదే ఉదాహరణ. అర్థమైందా పిన్నీ’’.

కామేశ్వరి స్వర్ణవైపు విచిత్రంగా చూసింది. అత్తగారింట్లోని లోటుపాట్ల గురించి ఏకరువు పెట్టకుండా వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడటం ఆమెకు మింగుడుపడలేదు.

మొహం చిట్లించి చూస్తూ ‘‘నువ్వో అమాయకురాలివి. ఎవరైనా నిన్ను చిటికెలో బుట్టలో పెట్టేయగలరు. అదలా ఉంచుగానీ... మా ఊళ్లో మీ ఆడబిడ్డకీ గురవయ్యగారి అబ్బాయికీ పెళ్ళి కుదిరిందని చెప్పుకుంటున్నారేమిటీ? ఈ పెళ్ళి జరగదనీ నీ దగ్గరేదో ఉపాయం ఉందనీ చెప్పావుగదే’’ అనడిగింది.

‘‘అవును... అన్నాను. ఈ పెళ్ళి ఆపటానికి నేను ఏ బాణాన్ని ఎక్కుపెట్టాలని అనుకున్నానో, సరిగ్గా అదే పాయింటును సంజన లేవనెత్తింది. దాంతో నేను మాట్లాడాల్సిన అవసరమే లేకుండాపోయింది మరి!’’

‘‘ఏమిటే అర్థంకాకుండా తికమకగా చెబుతున్నావూ. సరిగ్గా చెప్పు’’ కామేశ్వరి విసుక్కుంది.

‘‘సరే లే, వివరంగానే చెబుతాను. నేననుకున్నదేమిటంటే... ఈరోజుల్లో అందరూ అమ్మాయిలకి అబ్బాయిల్లాగే ఏ చదువైనా చెప్పిస్తున్నారు. అమ్మావాళ్ళు కూడా నన్నలాగే చదివించారు కదా! మాకు ఆరెకరాల పొలముంటే, నాకు మూడెకరాలు ఇచ్చారు. మిగతాది తమ్ముడికేగా. సంజన కూడా కుమార్‌లాగే చదువుకుంది. ఉన్న భూమిలో సగభాగంగా సంజనకి నాలుగెకరాలే ఇవ్వాలిగానీ అంతా ఇవ్వటం ఏం సబబు? తల్లిదండ్రులు పిల్లలకు తమ ఇష్టప్రకారమో లేక పరిస్థితులబట్టో ఎక్కువ, తక్కువలు ఇవ్వటం జరుగుతూనే ఉంటుందిగానీ మామూలుగా అయితే సమానంగానే ఇవ్వాలి కదా? ఈ పాయింటుతో సంజనకిచ్చే కట్నకానుకల విషయంలో నా అభ్యంతరాన్ని చెప్పాలనుకున్నాను’’.

‘‘నిజమేనేవ్, నీ ఆలోచన బాగానే ఉంది. చెప్పావా మరి?’’

‘‘అదేకదా నేను అంటున్నది... నాకా అవసరమే రాలేదని! నేను సంధించాలనుకున్న బాణాన్ని సంజన తన చేతిలోకి తీసేసుకుంది. తనకు ఈ కట్నకానుకల విషయం ముందుగా తెలియదు కాబోలు, మొన్నీమధ్య ఇక్కడకు మధ్యవర్తి వచ్చినప్పుడు పెళ్ళిమాటలు జరుగుతూంటే విని ఆశ్చర్యంగా నా అభిప్రాయాన్నే తనూ చెప్పింది. ‘తల్లిదండ్రులకి పిల్లలందరూ సమానమే కాబట్టి ఆస్తిపాస్తులూ సమానంగానే ఇవ్వాలిగానీ వాళ్ళ అంతస్తు పెద్దదని మీరు నాకు ఎక్కువ ఇవ్వటం ఏమిటీ... దీనికి నేనొప్పుకోను. వాళ్ళ తాహతుకి తగ్గ సంబంధాన్ని చూసుకోవచ్చని కబురు పంపించండి’ అని కచ్చితంగా చెప్పేసింది. తనమాట వినకపోతే ఊరుకోదని తెలుసుగదా, అందుకని అలాగే చేశారు’’.

‘‘బాగానే ఉంది, అలా అంటే వాళ్ళెందుకు ఒప్పుకుంటారూ... వాళ్ళేమైనా పిచ్చివాశ్ళా, ఇంతకుమించిన గొప్ప సంబంధం వాళ్ళకురాదని అనుకోవటానికి! వాళ్ళు వెనక్కిపోయుండాలే! మరి పెళ్ళి కుదిరిందని అనుకుంటున్నమాట నిజంకాదా?’’

‘‘నువ్వన్నట్లుగా వాళ్ళు పిచ్చివాళ్ళేం కాదు పిన్నీ, తెలివైనవాళ్ళే! అందుకే కోడలు తెచ్చే కట్నకానుకలకంటే ఆమె మనసే ముఖ్యమని తెలుసుకోగలిగారు. తనకంటే కూడా అందరి గురించీ ఎక్కువగా ఆలోచించే మంచి మనసున్న అమ్మాయి మా కోడలు కావటమే మాకు గొప్ప అదృష్టం. కట్నకానుకల పట్టింపులేదు అని చెప్పి సంబంధం ఖాయపర్చుకున్నారు. ఇదీ సంగతి... ఇప్పుడు అర్థమైందా?’’ చిరునవ్వుతో అడిగింది స్వర్ణ.

కామేశ్వరి చేదు మింగుతున్నట్లుగా మొహంపెట్టింది. ‘‘అంతా తనకే ఇస్తానంటే వద్దనేవాళ్ళు కూడా ఉంటారా? ఆ పిల్ల మాటల్ని నమ్మకు. ఏదో మాయామర్మం ఉండే ఉంటుంది... కనిపెట్టి చూస్తూండు. పెద్దలు కీడెంచి మేలెంచమని అన్నారు’’.

‘‘పిన్నీ...’’ కామేశ్వరి మాటలు పూర్తికాకముందే స్వర్ణ గట్టిగా అరిచింది. మరునిమిషంలోనే కోపాన్ని సంబాళించుకుంది.

కొందరికి తనవారిలో తప్పులు కనిపించవు. ఎదుటివారిలో మాత్రం ఒప్పులు కూడా తప్పులుగానే అన్పిస్తాయి. అదీ ఓ రోగ లక్షణమే. వ్యాధి ముదరకముందే మందు వేయాలి. పిన్ని మనసు నొచ్చుకుంటుందేమోనని ఉపేక్షించి ఊరుకోకూడదు అనుకున్న స్వర్ణ- అయోమయంగా చూస్తున్న కామేశ్వరితో స్థిరంగా చెప్పింది. ‘‘నిజమే పిన్నీ, మనవాళ్ళు కీడెంచి మేలెంచమని చెప్పారు. అంటే, ఏ విషయాన్నయినా రెండురకాలుగానూ ఆలోచించుకోమని అర్థంగానీ అన్నింటికీ కీడు మాత్రమే ఎంచమని కాదుగదా? అందరిలోనూ చెడుని మాత్రమే చూడటం చేటు తెస్తుంది. మంచిని మంచిగా చూడటమనేది మన మనసుకూ మంచిది... మేలు చేస్తుంది’’.

ముల్లు గుచ్చుకున్నట్లుగా చురుక్కుమంది కామేశ్వరికి. ‘ఇదేమిటి, గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్లుగా తనకే చెబుతోంది. చిన్నప్పటినుండీ తెలిసిన పిల్లేనా..!’ తలెత్తి స్వర్ణ వైపు విభ్రాంతిగా చూసింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని