పక్షులే అయినా... పాలు పడతాయి!

మనకు ఎక్కడైనా కనిపించే పక్షి పావురం.. ఈ రోజు మన పేజీలో కనిపించేందుకు సిద్ధమైంది.. దాని కబుర్లేంటో అదే చెప్పేస్తానంటోంది. నేస్తాలూ! అంతా బాగే కదూ! నేను పావురాన్ని. అందమైన దాన్ని. మీ శాంతి చిహ్నాన్ని. మీ పాటల్లో పల్లవిని. ఎక్కడంటే అక్కడ కనిపించేదాన్ని.

Published : 14 Oct 2019 00:21 IST

మనకు ఎక్కడైనా కనిపించే పక్షి పావురం.. ఈ రోజు మన పేజీలో కనిపించేందుకు సిద్ధమైంది.. దాని కబుర్లేంటో అదే చెప్పేస్తానంటోంది.
నేస్తాలూ! అంతా బాగే కదూ! నేను పావురాన్ని. అందమైన దాన్ని. మీ శాంతి చిహ్నాన్ని. మీ పాటల్లో పల్లవిని. ఎక్కడంటే అక్కడ కనిపించేదాన్ని. మరి మా జాతి విశేషాలేంటో మీకు వివరించేద్దామని ఎగురుకుంటూ ఇలాగొచ్చేశా.    
ఎక్కడైనా పక్కా లోకల్‌!
* ప్రపంచంలో ఎక్కువగా కనిపించే పక్షులం మేమే. అంతటా మా బంధువులున్నారు. ఒక్క అంటార్కిటికాలో తప్ప. సహారా ఎడారిలో కొంచెం భాగం తప్ప. అంటే ఆరు ఖండాల్లో మేమున్నట్లేగా.

* మా రూపం గుర్తురాగానే అందరికీ తెల్లటి పావురం గుర్తొస్తుంది. లేకపోతే బూడిద రంగులో ఉండే పెద్ద పావురమో!  మరేమో ఇవే కాదు. మాలో మొత్తం 310 వరకూ రకాలున్నాయి తెల్సా.
* గడ్డి విత్తనాల్ని ఇష్టంగా తింటాం. వీటితోపాటు గింజలు, పండ్లను ఎక్కువగా భోంచేస్తాం.
* ముందు దృష్టినంతా నేలపై ఉన్న గింజల్ని ఏరడంపై పెడతాం. అలా ఏరిన గింజల్ని అన్న వాహికలో ఆపుతాం. అది మా తిండికి మొదటి స్టాప్‌. అప్పుడు కావాలంటే మా అన్నవాహిక కాస్త సాగినట్లుగా అవుతుంది. తర్వాత మెల్ల మెల్లగా బొజ్జలోకి
పంపి అరిగించుకుంటాం.  

డౌ, పీజన్‌.. తేడా ఉంది!
* ఆంగ్లంలో మమ్మల్ని మీరంతా డౌస్‌, పీజన్స్‌ అని పిలుస్తారు కదూ. అయితే ఇందులో అందరికీ తెలియని విషయం ఒకటుంది. మాలో చిన్న జాతులవి డౌస్‌. పెద్ద జాతులవి పీజన్స్‌. అంటే బూడిద రంగులో మీ దగ్గరంతా ఎక్కువగా కనిపించేవన్నీ పీజన్లే.
* పది వేల ఏళ్ల క్రితం నుంచే మమ్మల్ని మీరు పెంపుడు పక్షుల్ని చేసుకున్నారు.
* మాలో అతి పెద్ద రకంవి న్యూగినియాలోని క్రౌన్డ్‌ పీజన్‌లు. ఇవి రెండు నుంచి నాలుగు కేజీల బరువుంటాయి. న్యూ వరల్డ్‌ గ్రౌండ్‌ డౌలు అతి చిన్న రకంవి. దాదాపుగా పిచ్చుకంతే ఉంటాయివి.
* మేం దాదాపు మూడు నుంచి ఐదేళ్లపాటు బతికేస్తాం.
నాన్న నుంచీ పాలొస్తాయి!
* మేం గుడ్లు పెట్టే కాలం రాగానే పుల్లలతోనే గూళ్లు పెట్టుకుంటాం. భవనాల సందుల్లో, మట్టి గోడల్లో ఇలా ఎక్కడైనా గూళ్లు ఏర్పాటు చేసుకుంటాం.
* తల్లి పావురాలం ఒక సీజన్‌లో దాదాపుగా రెండు గుడ్లు పెట్టి పొదుగుతాం. రెండు వారాల్లోనే అవి పిల్లలవుతాయి. వీటిని ఆంగ్లంలో స్క్వాబ్స్‌ అంటారు.
* మామూలుగా అన్ని పక్షులూ ఏం చేస్తాయి? ఇలా అప్పుడే పుట్టిన పిల్లలకు ఎక్కువ ప్రొటీన్‌ ఉన్న ఆహారం తెచ్చి నోటికి అందిస్తుంటాయి కదూ. పిల్లలు తొందరగా ఎదగడం కోసం దాదాపుగా పక్షులన్నింటిలో ఇదే తీరు కనిపిస్తుంది. అయితే మేం మాత్రం ఇందుకు భిన్నం. క్షీరదాల్లా పిల్లలకు పాలిచ్చి పెంచుతాం.
* మా గొంతు భాగంలో పాలను ఉత్పత్తి చేసే గ్రంథులుంటాయి. గుడ్లు పిల్లలయ్యేనాటికి మాలో ఆడ, మగ పావురాలు రెండింటికీ పాలు స్రవిస్తాయి. ఆ పాలను ఆంగ్లంలో క్రాప్‌ మిల్క్‌, పీజన్‌ మిల్క్‌లాంటి పేర్లతో పిలుస్తారు. వాటిని మా నోటి నుంచి పిల్లల నోట్లోకి అందిస్తాం. తండ్రి పక్షి నుంచీ పాలు ఉత్పత్తి అవడమే మా జాతిలోని విశేషం.  
* అలా పాలు తాగి ఎదిగిన పిల్లలు 10 నుంచి 15 రోజుల్లోపు గూటిని వదిలి వెళ్లిపోతాయి. కాస్త పెద్దయిన దగ్గర నుంచి మళ్లీ అవి గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. ఇలా మా జీవితచక్రం తిరుగుతూ ఉంటుంది. అంతే మరి. వెళ్లొస్తానే!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని