నక్కల గుంపులు.. కుందేళ్ళ మందలు!

జపాన్‌లోని మియగి జావో పర్వతాల దగ్గర  మియగి జావో ఫాక్స్‌ పేరుతో ఓ ఊరుంది. ఇక్కడ అడుగుపెడితే చాలు బోలెడన్ని నక్కలు ఎదురొస్తాయి. పదో ఇరవయ్యో కాదు.. వాటి సంఖ్య వందల్లో ఉంటుంది. స్వేచ్ఛగా అటూ ఇటూ తిరిగేస్తుంటాయి నచ్చినట్టు ఊళ పెట్టేస్తుంటాయి. కానీ ఎవరికీ హాని చేయవట. కొన్ని నలుపు రంగులో, మరికొన్ని గోధుమ, తెలుపు రంగుల్లో ఉండే ఈ నక్కల్లో చాలా రకాల జాతులే ఉంటాయి. ఈ నక్కల లోకాన్ని చూడ్డానికి  ఎక్కడెక్కడి నుంచో సందర్శకులు వస్తుంటారు. ఎంచక్కా వాటితో ఫొటోలు దిగుతూ సంబరపడిపోతుంటారు.

Updated : 06 Nov 2019 00:41 IST

అడవుల్లో రకరకాల జంతువులుంటాయని తెలుసు కదా! మరి ఒకేచోట ఒకే రకమైన జీవులుండే దీవులున్నాయి తెలుసా? ఇంతకీ అవి ఎక్కడున్నాయ్‌? వాటిల్లో ఏమున్నాయ్‌?

అన్నీ నక్కలే!

జపాన్‌లోని మియగి జావో పర్వతాల దగ్గర  మియగి జావో ఫాక్స్‌ పేరుతో ఓ ఊరుంది. ఇక్కడ అడుగుపెడితే చాలు బోలెడన్ని నక్కలు ఎదురొస్తాయి. పదో ఇరవయ్యో కాదు.. వాటి సంఖ్య వందల్లో ఉంటుంది. స్వేచ్ఛగా అటూ ఇటూ తిరిగేస్తుంటాయి నచ్చినట్టు ఊళ పెట్టేస్తుంటాయి. కానీ ఎవరికీ హాని చేయవట. కొన్ని నలుపు రంగులో, మరికొన్ని గోధుమ, తెలుపు రంగుల్లో ఉండే ఈ నక్కల్లో చాలా రకాల జాతులే ఉంటాయి. ఈ నక్కల లోకాన్ని చూడ్డానికి  ఎక్కడెక్కడి నుంచో సందర్శకులు వస్తుంటారు. ఎంచక్కా వాటితో ఫొటోలు దిగుతూ సంబరపడిపోతుంటారు.

నెమళ్ల అందాలే!

జూలో ఒకటో రెండో నెమళ్లను చూస్తేనే సంబరపడిపోతాం. మరి ఒకే చోట వందలాది నెమళ్లు ఉంటే? చూడ్డానికి రెండు కళ్లూ చాలవు కదూ. అలాంటి ప్రాంతమొకటి జర్మనీలో ఉంది. బెర్లిన్‌ నగరానికి దగ్గర్లో హావెల్‌ నదీ తీరంలో ఓ దీవి ఉంది. దీనికి పికాక్‌ ఐలాండ్‌ అని పేరు. చెట్లపైన, నదీ తీరాన, పూదోటల్లో ఎటూ చూసినా నెమళ్లే. వీటి సోయగాల్ని చూడ్డానికి సందర్శకులు ఇక్కడికి చాలామంది వచ్చేస్తుంటారు. కెమెరాల్లో నెమళ్ల అందాల్ని బందించేస్తుంటారు.

నిండా మ్యావ్‌ మ్యావ్‌లే!

జపాన్‌లో ఓ దీవి ఉంది. తషిరోజిమా దాని పేరు. దాంట్లోకి వెళ్లామో లేదో ‘మ్యావ్‌ మ్యావ్‌’ మంటూ అరుపులు వినిపిస్తాయి. ఎందుకంటే అది పిల్లుల దీవి మరి. దీనికి క్యాట్‌ హెవెన్‌ ఐలాండ్‌గా పేరు. ఇక్కడ జనాభా చాలా తక్కువ. పిల్లుల సంఖ్యే ఎక్కువ. స్థానికులు పిల్లిని అదృష్టంగా భావిస్తుంటారు. ఇదో మంచి పర్యటక ప్రాంతం. ఈ పిల్లుల్ని చూడ్డానికి చాలామందే వస్తుంటారు. కుక్కలను ఈ దీవిలోకి అనుమతించరు.

కుందేళ్ల ప్రపంచం!

కుందేలు మనల్ని చూస్తేనే తుర్రుమని పారిపోతుంది. కానీ ఒకచోట బుజ్జిబుజ్జి కుందేళ్లు ఎంచక్కా మన దగ్గరకు వచ్చేస్తాయి. గుంపులు గుంపులుగా తిరిగేస్తాయి. వాటికిష్టమైన గింజల్ని, కూరగాయల్ని పెడితే ఎంచక్కా తినేస్తుంటాయి. అరె.. ఎక్కడబ్బా? అంటే జపాన్‌లోని హిరోషిమా నగరానికి దగ్గర్లో. ఒకునిషిమా అనే దీవిలో. ఇక్కడ ఎక్కడ చూసినా కుందేళ్లు ఉంటాయి. అందుకే దీనికి ర్యాబిట్‌ ఐలాండ్‌ అని పేరు. ఇంతకీ ఇక్కడికి ఈ కుందేళ్లు ఎలా వచ్చాయంటే... అప్పట్లో జపాన్‌ ప్రభుత్వం ఈ దీవిని విషపూరిత వాయువుల్ని పరీక్షించడానికి వాడుకునేదట. ఎవరో ఇక్కడ కొన్ని కుందేళ్లు వదిలివెళ్లారట. ఆ తర్వాత అవే వందలు, వేలు అయ్యాయని చెబుతారు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని