మా ఒళ్లు బంగారమా !

చూడగానే ధగధగమని మెరిసిపోతాయి... బంగారం రంగులో చమక్కుమంటాయి... ఇవి బొమ్మల సంగతులేమో అనేసుకోకండి... మేలిమిఛాయలో మెరిసే జీవుల విశేషాలు!...

Published : 13 Nov 2019 00:41 IST

చూడగానే ధగధగమని మెరిసిపోతాయి... బంగారం రంగులో చమక్కుమంటాయి... ఇవి బొమ్మల సంగతులేమో అనేసుకోకండి... మేలిమిఛాయలో మెరిసే జీవుల విశేషాలు!

కనకపు కోతి!

ఇదేంటీ చూస్తే బుల్లి సింహంలా ఉంది అనుకుంటున్నారా? కానీ ఇదో కోతి. పేరు గోల్డెన్‌ లయన్‌ టమరిన్‌. బంగారంలాంటి మెరిసే బొచ్చు ఉండటం దీని మరో ప్రత్యేకత. ఆరు నుంచి పది అంగుళాల పరిమాణంలో ఉండే ఈ కోతి ఎక్కువగా చెట్లపైనే జీవించేస్తుంది.రోజంతా చురుగ్గా ఉండి రాత్రిపూట చెట్ల తొర్రల్లో పడుకుంటుంది. పండ్లు, పూలు, పురుగులు, చిన్న చిన్న జీవుల్ని తింటూ కడుపు నింపుకొంటుంది.  ఎక్కువగా బ్రెజిల్‌ అడవుల్లో కనిపిస్తుంది.

పసుపుపచ్చ నత్త!

దీని పేరు గోల్డెన్‌ యాపిల్‌ స్నెయిల్‌. ఇది మంచినీటిలో ఎక్కువగా తిరుగాడేస్తుంటుంది. దీని పుట్టిల్లు దక్షిణ అమెరికా. దీని పేరు విన్నప్పుడే అర్థమై ఉంటుంది ఈ నత్త ప్రత్యేకత ఏంటో. పసుపు పచ్చ రంగులో గమ్మత్తయిన ఆకారంలో ఉంటుంది. అందుకే దీన్ని ఎక్కువగా అక్వేరియాల్లో పెంచుకుంటారు. దీనికి మొప్పలూ, ఊపిరితిత్తులూ ఉంటాయి. అందుకే ఇది నీటిలోనూ నేలపైనా బతికేస్తుంది.

వేలాడే పసిడి!

గబ్బిలం పేరు వినగానే చిరాకైన రూపం గుర్తుకు వస్తుంది. కానీ ఒక గబ్బిలం ఉంది. పేరు గోల్డెన్‌ బ్యాట్‌. ఇది పసిడి రంగులో కనువిందు చేస్తుంది. మామూలు గబ్బిలంలానే ఉన్నా రంగు మాత్రం భలేగా ఉంటుంది. దక్షిణ అమెరికాలో ఎక్కువగా కనిపిస్తుందిది. శాస్త్రవేత్తలు దీన్ని బొలీవియాలో కనిపెట్టారు. దీనికి మ్యోటిస్‌ మిడస్టాక్‌టస్‌ అనే పేరు పెట్టారు.

మెరిసే ముంగిస!

ఇలాంటి ముంగిసను చూసుండరు కదూ. దీని పేరు గోల్డెన్‌ స్లెండర్‌ ముంగిస. అచ్చం బంగారంతో చేసిపెట్టారా దీని వెంట్రుకల్ని అన్నట్టుగా మెరిసేలా కనిపించేస్తుంది కాబట్టే దీనికా పేరు పెట్టారన్నమాట. ఆఫ్రికాలో ఎక్కువగా ఉంటుంది. పొడవైన తోకతో చురుకైన కళ్లతో ఉంటుంది. ఒంటరిగానూ, గుంపులుగానూ జీవించేస్తుంటాయివి.

బంగారు ముక్క!

ఇది పాకుతూ ఉంటే ఇక్కడేదో బంగారం ముక్క పడ్డట్టుందే అనిపించేస్తుంది. కానీ ఇదో పురుగు. పేరు గోల్డెన్‌ టార్టాయిస్‌ బీటిల్‌. ఇంకా గోల్డ్‌బగ్‌ అనీ పిలిచేస్తారు. తళుక్కుమంటూ మెరిసిపోతుంది. శత్రువుల కళ్లు కప్పడానికి ఇది రంగులు కూడా మార్చుకుంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని