పులుల అడ్ఢలో... సింహ స్వప్నం!

బాగున్నారా ఫ్రెండ్స్‌! నేను మీ చిన్నూని... ప్రతి వారంలాగే... ఈసారీ ఓ కోట చుట్టేసి వచ్చాను... ఇది అల్లాటప్పా కోట కాదండోయ్‌... కొండల నడుమ అడవిలో ఉన్న అందాల ఖిల్లా... పులుల మధ్యలో ఉన్న అద్భుతమైన కోట... ఇంతకీ దాని పేరేంటీ? ఎక్కడుంది?

Published : 21 Nov 2019 00:25 IST

కోట కథలు- రణ్‌థంభోర్‌

బాగున్నారా ఫ్రెండ్స్‌! నేను మీ చిన్నూని... ప్రతి వారంలాగే... ఈసారీ ఓ కోట చుట్టేసి వచ్చాను... ఇది అల్లాటప్పా కోట కాదండోయ్‌... కొండల నడుమ అడవిలో ఉన్న అందాల ఖిల్లా... పులుల మధ్యలో ఉన్న అద్భుతమైన కోట... ఇంతకీ దాని పేరేంటీ? ఎక్కడుంది?
ఖిల్లా లోపల చాలా ఆలయాలు ఉన్నాయి. మూడు కళ్లున్న గణపతి ఆలయం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. మనసులో ఏదైనా కోరుకుని.. దానిని ఒక చీటీ మీద రాసి.. వినాయకుడి విగ్రహానికి చదివి వినిపిస్తే.. ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకమట. శివాలయం, రామాలయాలు కూడా ఉన్నాయి. రెండు జైన మందిరాలు, ఒక మసీదు ఉన్నాయి.
జైత్‌సింగ్‌ కీ ఛత్రీనే.. న్యాయ్‌ కీ ఛత్రీ అని పిలుస్తారు. 32 స్తంభాలతో నిర్మించిన ఈ కట్టడం.. నేటికీ చెక్కు చెదరకుండా ఉంది. అప్పటి రాజులు ఇక్కడే తీర్పులు చెప్పేవారట.

రాజస్థాన్‌ తెలుసుగా. అదిగో అక్కడే ఉంది ఈ రణ్‌థంభోర్‌ కోట. ఆ రాష్ట్ర రాజధాని జైపుర్‌కు 190 కిలోమీటర్ల దూరంలో రణ్‌థంభోర్‌ నేషనల్‌ పార్క్‌లో ఉంటుందిది.
* అసలు ఈ కోటను ఎవరు? ఎప్పుడు? కట్టారని అక్కడున్న అంకుల్‌ని అడిగితే బోలెడు సంగతులు చెప్పారు.

* అవేంటంటే... రణ్‌థంభోర్‌ను అప్పట్లో రణస్తంభ అనీ, రణస్తంభపుర అని పిలిచేవారట. క్రీస్తుశకం 8వ శతాబ్దంలో చౌహాన్‌ వంశానికి చెందిన రాజులు ఇక్కడ చిన్న కోటను నిర్మించారట. అయితే దీనికి
కచ్చితమైన ఆధారాలు లేవట.

* పృథ్వీరాజ్‌ చౌహాన్‌ అనే చక్రవర్తి హయాంలో రణ్‌థంభోర్‌ కోట విస్తరించిందట. అదే సమయంలో ముహమ్మద్‌ ఘోరీ కోటపైకి దండెత్తాడు. యుద్ధంలో ఓడిపోయిన ఘోరీ.. క్షమాభిక్ష కోరడంతో.. ప్రాణాలతో వదిలేశాడట పృథ్వీరాజ్‌. కొన్నాళ్లకు మళ్లీ రణ్‌థంభోర్‌పైకి దండెత్తిన ఘోరీ.. కోటను వశం చేసుకోవడంతో పాటు పృథ్వీరాజ్‌ చౌహాన్‌ను చంపాడట.

* తెలుసా? ఈ కోట చుట్టూ పెద్ద పెద్ద కొండలు, గుట్టలు ఉన్నాయి. దట్టమైన అడవి ఉంది. అప్పట్లో ఇవి కోటకు సహజ రక్షణ కవచాలుగా ఉండేవి. అందుకే ఈ కోట శత్రురాజులకు సింహస్వప్నంగా ఉండేదట.
* 13వ శతాబ్దంలో మళ్లీ కోటపై చౌహాన్‌ రాజులకు పూర్తిస్థాయి ఆధిపత్యం లభించింది. వీరనారాయణ అనే రాజు.. ఖిల్లాను అజేయ దుర్గంగా తీర్చిదిద్దారట. చుట్టూ గోడలు, భారీ బురుజులు, కోట లోపల అపురూప నిర్మాణాలు ఎన్నో కట్టించారు. కోట ప్రవేశ మార్గంలో ఏడు భారీ ద్వారాలు ఏర్పాటు చేశారు. చుట్టూ 16 కిలోమీటర్ల వరకు పెద్ద ప్రహరీని నిర్మించారు. ఆయన తర్వాత వచ్చిన రాజులు కోటను మరింత పటిష్టం చేశారట.
* కోట లోపల జైత్‌సింగ్‌ కీ ఛత్రీ, అధూరీ ఛత్రీ, సుపారీ మహల్‌, బాదల్‌ మహల్‌, దుల్వా మహల్‌ వంటి నిర్మాణాలు ఉన్నాయి. కొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. అయినా ఈ రాతి కట్టడాల ఠీవీ మాత్రం తగ్గలేదు. ప్రతి నిర్మాణం ఆనాటి చరిత్రను తెలియజేస్తుంది.
* కోటలో మరో అద్భుతమైన కట్టడం హమ్మీర్‌ మహల్‌. ఐదంతస్తుల భారీభవనం.. ఆనాటి నిర్మాణకారుల పనితనాన్ని తెలియజేస్తుంది. ఈ భవనం భూగర్భంలో కూడా కొన్ని అంతస్తులు ఉండేవట.    ఈ మహల్‌లోనే రాజ ప్రముఖుల నివాసాలు ఉండేవట.
* కోట బయట నిర్మించిన జోగి మహల్‌లో ఒకప్పుడు సన్యాసులు, రుషులు ఉండేవారట. ఇప్పుడదే మహల్‌ను అతిథి గృహంగా మలిచారు. రణ్‌థంభోర్‌ పార్క్‌కు వచ్చిన సందర్శకులు ఇక్కడ బస చేసే వీలుంది.
* ఈ కోటను ఎప్పుడంటే అప్పుడు సందర్శించడానికి వీల్లేదు. రణ్‌థంభోర్‌ నేషనల్‌ పార్క్‌ తెరిచి ఉన్న కాలంలోనే కోట దగ్గరికి వెళ్లగలం. అక్టోబరు నుంచి ఫిబ్రవరి వరకే పార్క్‌ తెరిచి ఉంటుంది. సఫారీ వేళల్లో కోటను సందర్శించవచ్చు. దారిలో ఎన్ని పులులు, జింకలు, అడవి దున్నలు కనిపించాయో! నాకైతే భలేగా అనిపించింది. ఈసారి మరో కోట విశేషాలతో మళ్లీ వస్తాను.. బై బై!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని