టైగర్ కాదు... లైగర్‌

పంటల్లో హైబ్రీడ్‌ తెలుసు.. మరి జీవుల్లో తెలుసా? ఏంటి ఆశ్చర్యంగా ఉందా? కానీ జంతువుల్లోనూ హైబ్రీడ్‌వి ఉన్నాయి. వీటికి శాస్త్రవేత్తలు తమ ప్రయోగాలతో ప్రాణం పోశారు. అలాంటి కొన్ని జీవుల విశేషాలు తెలుసుకుందామా మరి..

Published : 28 Dec 2019 00:39 IST

హైబ్రీడ్‌ జీవులు

పంటల్లో హైబ్రీడ్‌ తెలుసు.. మరి జీవుల్లో తెలుసా? ఏంటి ఆశ్చర్యంగా ఉందా? కానీ జంతువుల్లోనూ హైబ్రీడ్‌వి ఉన్నాయి. వీటికి శాస్త్రవేత్తలు తమ ప్రయోగాలతో ప్రాణం పోశారు. అలాంటి కొన్ని జీవుల విశేషాలు తెలుసుకుందామా మరి..


లైగర్‌.. గర్జన..

మగ సింహం.. ఆడ పులి సంతానమే లైగర్‌! విచిత్రంగా ఇవి సింహం.. పులి కన్నా చాలా పెద్దగా ఉంటాయి. ఇవి కాస్త సింహంలానే గర్జిస్తాయి. మరో విషయం ఏంటంటే.. ఇవి చక్కగా ఈదగలవు. ఇలా పుట్టిన కొన్ని లైగర్లకు సింహాలకు వచ్చినట్లు జూలూ వచ్చింది. లైగర్లు భారీ కాయులు. ఇవి ఎంత వేగంగా బరువు పెరుగుతాయంటే.. అవి పుట్టిన మొదటి సంవత్సరంలోనే ప్రతి రెండు రోజులకు ఏకంగా కిలో బరువు పెంచుకుంటాయి. ఇలా ఇవి 165 కిలోల బరువుకు చేరుకుంటాయి. వాటికి మూడు సంవత్సరాల వయసు వచ్చే సరికి 320 కిలోల బరువు పెరుగుతాయి. హెరిక్యులస్‌ అనే లైగర్‌ ఏకంగా 550 కిలోల వరకు పెరిగింది. దీని పేరిట గిన్నీస్‌బుక్‌ వరల్డ్‌ రికార్డూ ఉంది. ఇది 2007లో చనిపోయింది. బాహుబలుల్లా ఇవి పెద్ద శరీరంతో ఉన్నా.. పాపం వీటి జీవిత కాలం చాలా తక్కువ. ఇవి ఎక్కువగా క్యాన్సర్‌ లాంటి వ్యాధులకు గురవుతుంటాయి. అయితే లైగర్లు జన్మించాలంటే అడవిలో సహజసిద్ధంగా కుదరదు. శాస్త్రవేత్తలే పలు ప్రయోగాల కోసం మగ సింహం.. కణాలను ఆడపులిలో ప్రవేశ పెట్టి వీటిని సృష్టిస్తారు. మరో విషయం ఏంటంటే.. మగపులి.. ఆడసింహం సంతానమూ ఉంది. దాన్ని టైగాన్‌ అంటారు. కానీ ఇది లైగర్‌ అంత పెద్దగా ఉండదు. మొట్టమొదట 1837లోనే రెండు లైగర్లు పుట్టాయి. కొన్ని జూలలో ఈ లైగర్లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. అత్యధికంగా అమెరికాలో ప్రస్తుతం 30, చైనాలో 20 లైగర్లున్నాయి. ప్రపంచం మొత్తం మీద ఇవి దాదాపు 100 వరకు ఉన్నాయని అంచనా.


అమ్మో పే..ద్ద వోల్ఫిన్‌!

మీకు డాల్ఫిన్‌ తెలుసు.. మరి వోల్ఫిన్‌! మగ ఫాల్స్‌ కిల్లర్‌ వేల్‌.. ఆడ బాటల్‌నోస్‌ డాల్ఫిన్‌ సంతానమే వోల్ఫిన్‌. డాల్ఫిన్లకు 88, షార్క్‌లకు 44 దంతాలుంటే.. వోల్ఫిన్లకు మాత్రం 66 పళ్లుంటాయి. ఇవి చూడటానికి డాల్ఫిన్లలానే కనిపించినా.. చాలా పెద్దగా ఉంటాయి. 12 నుంచి 22 అడుగుల వరకు పెరుగుతాయి. ఒక్కోటి దాదాపు 272 కిలోల వరకు బరువు పెరుగుతాయి. మొట్టమొదట వోల్ఫిన్‌ 1985లో హవాయిలోని సీలైఫ్‌ పార్క్‌లో జన్మించింది. వీటి జీవిత కాలం సుమారు 40 సంవత్సరాలు. ప్రస్తుతం కేవలం రెండంటే రెండే వోల్ఫిన్లు జీవించి ఉన్నాయి. అవీ సీలైఫ్‌ పార్కులోనే ఉన్నాయి.


కామా తల్లి.. లామా!

మగ ఒంటె ఆడ లామాకు పుట్టిందే కామా. మొట్టమొదటి కామా 1998లో దుబాయ్‌లో పుట్టింది. ఒంటెకున్న బలం లామాకున్న ఉన్ని ఉండటమే దీని ప్రత్యేకత. ఇవి ఎక్కువ వేడిని తట్టుకోగలవు. లామాలకన్నా కామాలు ఆరు రెట్లు ఎక్కువ బరువుంటాయి. 2002లో రెండో కామా పుట్టింది. 2008లో అత్యధికంగా 8 కామాలు జన్మించాయి.


జోర్స్‌ జోరు

మగ జీబ్రా(కంచర గాడిద)... ఆడ గుర్రానికి పుట్టిందే జోర్స్‌. దీనికి గుర్రం లక్షణాల కంటే.. కంచరగాడిద లక్షణాలే ఎక్కువ వచ్చాయి. కాళ్లు, మెడమీద మరిన్ని చారలు ఎక్కువ వచ్చాయి. మెడ మీద గుర్రానికి ఉన్నట్లే జుట్టు వచ్చింది. అలాగే మగ జీబ్రా ఆడ గాడిదకు పుట్టిన వాటిని జోన్‌కీ, ఆడ జీబ్రా మగ గాడిదకు పుట్టిన వాటిని జీడాంక్‌ ఇలా కొన్ని కొత్త జీవుల సృష్టి జరిగింది. ఇవన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. కానీ కొన్ని చిన్న చిన్న తేడాలుంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని