పాదరసంలా చదివేయండి!

చిన్నూకి జ్వరం వచ్చిందని వాళ్ల అమ్మ థర్మామీటర్‌తో చెక్‌చేసింది..చిన్నూ దాన్ని చూస్తుండగా చేజారి కిందపడి పగిలిపోయింది... వెంటనే అందులోంచి ఓ ద్రవం బయటకు వచ్చింది...ఇదేంటబ్బా? ఇందులో ఎందుకుంది? ఎక్కడ దొరుకుతుందిది? అంటూ బోలెడు డౌట్లు వచ్చేశాయి... ఇంకేముంది? బాబాయ్‌ రాగానే ఆ సందేహాలన్నీ తీర్చేసుకున్నాడు...మరి మనమూ తెలుసుకుందామా? ఆ సంగతులేంటో?...

Published : 07 Jan 2020 00:21 IST

చిన్నూకి జ్వరం వచ్చిందని వాళ్ల అమ్మ థర్మామీటర్‌తో చెక్‌చేసింది..

చిన్నూ దాన్ని చూస్తుండగా చేజారి కిందపడి పగిలిపోయింది...

వెంటనే అందులోంచి ఓ ద్రవం బయటకు వచ్చింది...

ఇదేంటబ్బా? ఇందులో ఎందుకుంది? ఎక్కడ దొరుకుతుందిది?

అంటూ బోలెడు డౌట్లు వచ్చేశాయి... ఇంకేముంది? బాబాయ్‌ రాగానే ఆ సందేహాలన్నీ తీర్చేసుకున్నాడు...

మరి మనమూ తెలుసుకుందామా? ఆ సంగతులేంటో?

చిన్నూ: బాబాయ్‌ నీకోసమే ఎదురుచూస్తున్నా. మరేమో పొద్దున్న థర్మామీటర్‌ పగిలిపోయి అందులోంచి ఓ ద్రవం వచ్చింది. అదేంటో చెప్పవూ?

బాబాయ్‌: ఓ.. అదా? పాదరసం. మెర్క్యురీ అంటారు. బుధగ్రహాన్ని మెర్క్యురీ ప్లానెట్‌ అంటారని తెలుసుగా. ఆ గ్రహం పేరు పాదరసానికి పెట్టారు. దీని గురించి ఎప్పుడూ వినలేదా?

చిన్నూ: ఓహో మెర్క్యురీ అంటే ఇదేనా?

బాబాయ్‌: అవును చిన్నూ. ద్రవరూపంలో ఉన్న ఏకైక లోహం పాదరసమే.

చిన్నూ: ఇంతకీ లోహం అంటే ఏంటసలు? థర్మామీటర్లో ఇదే ఎందుకు ఉంది?

బాబాయ్‌: రేకులుగా, తీగలుగా సాగదీయగల్గినదాన్నే లోహం అంటారన్నమాట. ఇక ఇదే థర్మామీటర్లో ఎందుకు ఉంటుందంటే... పాదరసానికి ఉష్ణ వ్యాకోచం ఎక్కువ. అంటే ఏమాత్రం వేడి తగిలినా ఇది ఎక్కువగా వ్యాకోచిస్తుంది. అందుకే మనకు జ్వరం వస్తే దీని వల్ల వెంటనే తెలిసిపోతుంది.

చిన్నూ: అలాగా! ఇంతకీ ఈ పాదరసం మిగతా వాటికన్నా వేరుగా ఉంటుందేం?

బాబాయ్‌: పాదరసానికి తలతన్యత (సర్ఫేస్‌ టెన్షన్‌) ఎక్కువ. అందుకే ఇది కొద్ది పరిమాణంలో ఉన్నప్పుడు గుండ్రని పూసల్లా చుట్టుకుపోతుంది.

చిన్నూ: ఓహో! అసలు ఇది ఎక్కడ దొరుకుతుంది?

బాబాయ్‌: ఇది అచ్చంగా పాదరసంలా ప్రకృతిలో దొరకదు. పాదరసం, గంధకం కలిసి ఉన్న రూపంలో దొరుకుతుంది. దీన్నే సినబార్‌ ఖనిజం అంటారు. దీన్ని వేడి చేసినప్పుడు వచ్చే పాదరసపు ఆవిర్లను చల్లబరచి పాదరసాన్ని తయారు చేస్తారు. తర్వాత తయారైన పాదరసంలో ఏమైనా మలినాలు ఉంటే వాటిని తొలగించేందుకు శుద్ధి చేస్తారు. అలా స్వచ్ఛమైన పాదరసాన్ని తీస్తారు.

చిన్నూ: పాదరసం వేరే మూలకాలతో కలుస్తుందా?

బాబాయ్‌: అవును. సులువుగా బంగారం, వెండి, జింక్‌, కాడ్మియం వంటి లోహాలతో కలిసి మిశ్రమ లోహాలుగా ఏర్పడుతుంది. ఈ మిశ్రమలోహాలను ఎమాల్‌గమ్‌లు అంటారు.

చిన్నూ: బాబోయ్‌ ఇంకానయం. పొద్దున కాస్తలో అమ్మ చేతి బంగారు గాజులపై పడేది?

బాబాయ్‌: పడితే రెండూ కలిసిపోతాయి.

చిన్నూ: అబ్బో ఇది డేంజర్‌ అయితే.

బాబాయ్‌: అవును మరి. చాలా విషపూరితమైంది కూడా. పాదరసం ఎక్కువ పరిమాణంలో మన శరీరంలోకి వెళితే చాలా ప్రమాదం. ఇది చర్మం ద్వారా కూడా శరీరంలోకి వెళ్లగలదు. శరీరంలో పేరుకుందంటే తీవ్రమైన అనారోగ్యం కలుగుతుంది. చనిపోయే ప్రమాదమూ ఉంది. ఇంకో సంగతి. పాదరసం కాలిపోదు. వేడికి పాదరసం ఆవిర్లు వెలువడుతాయి. ఇవి చాలా ప్రమాదకరమైనవి.

చిన్నూ: నాకు భయమేస్తోంది?

బాబాయ్‌: ఎందుకు చిన్నూ?

చిన్నూ: పొద్దున్న పాదరసం నా శరీరంలోకి ఏమైనా వెళ్లి ఉంటే? దాంతో చాలాసేపు ఆడుకున్నా...

బాబాయ్‌: హ్హ.. హ్హ. మరేం ఫర్వాలేదులే. బద్దలైన థర్మామీటరు నుంచి బయటకు వచ్చిన పాదరసాన్ని పొరపాటున ఎవరైనా మింగినా శరీరంలోంచి బయటకు వచ్చేస్తుంది. శరీరం దాన్ని పెద్దగా గ్రహించదు. పాదరసాన్ని ముట్టుకుంటే చాలా స్వల్ప పరిమాణంలో శరీరంలోకి వెళుతుంది. దీని వల్ల ఎటువంటి హాని ఉండదు.

చిన్నూ: ఇంతకీ ఈ లోహంతో ఏమైనా ఉపయోగం ఉందా?

బాబాయ్‌: చాలానే ఉన్నాయ్‌ చిన్నూ. పాదరసాన్ని ఉపయోగించి థర్మామీటర్లు, బెరామీటర్లు ఇంకా ఇతర శాస్త్రీయ పరికరాలు తయారుచేస్తారు. పాదరసం మంచి విద్యుత్‌వాహకం. దీన్ని ఉపయోగించి ప్రత్యేకమైన స్విచ్‌లు తయారుచేస్తారు. వీధి దీపాల్లో, ఫ్లోరసెంట్‌ ల్యాంప్‌ల్లో, ప్రకటనల గుర్తుల్లో పాదరసపు ఆవిర్లు వాడతారు. ఖనిజం నుంచి బంగారాన్ని ఉత్పత్తి చేయడానికి ఎమాల్‌గమ్‌లు ఉపయోగిస్తారు. దంత వైద్యంలో రంధ్రాలు పూడ్చడానికి ఎమాల్‌గమ్‌లు వాడతారు. డ్రైసెల్‌ బ్యాటరీల జీవితకాలం పెరిగేందుకు కూడా ఈ ఎమాల్‌గమ్స్‌ ఉపయోగపడతాయి. ఇంకా ఇతర మూలకాల ఉత్పత్తిలో, ద్రవ దర్పణాల తయారీలో పాదరసం చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ఇతర మూలకాలతో కలిసి పాదరసం ఎన్నో ఉపయోగకరమైన సమ్మేళన పదార్థాలుగా మారుతుంది. గాయాలపై క్రిమి సంహారిణిగా, బ్యాక్టీరియాను చంపే యాంటీసెప్టిక్‌గా, మెర్క్యురీ బ్యాటరీల తయారీకి ఉపయోగపడుతుంది.

చిన్నూ: అబ్బో చాలా గొప్పదే. అసలు ఈ పాదరసం ఎక్కడెక్కడ దొరుకుతుంది?

బాబాయ్‌: స్పెయిన్‌లోని అవ్‌మాడెన్‌ గనుల నుంచి తవ్విన ఖనిజం నుంచి పాదరసాన్ని ఉత్పత్తి చేస్తారు. ఈ పాదరసం చాలా నాణ్యమైంది. యుగోస్లేవియా, కాలిఫోర్నియా, ఇటలీల్లోకూడా ముడిపాదరసం లభిస్తుంది. ప్రపంచానికి సరఫరా అయ్యే పాదరసంలో సగభాగం స్పెయిన్‌, ఇటలీల నుంచే ఉత్పత్తి అవుతోంది.

చిన్నూ: అన్నట్టూ బాబాయ్‌! ఇనుములా ఇదీ లోహమే కదా. మరి దీనికీ తుప్పు పడుతుందా?

బాబాయ్‌: పాదరసం ఆక్సిజన్‌తో చర్య జరుపుతుంది. ఈ చర్య చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఎక్కువకాలం ఇలా చర్య జరిగిన తర్వాత పాదరసానికి తుప్పు పడుతుంది. ఇనుముకు తుప్పు పట్టినప్పుడు కనిపించినట్టు దీని తుప్పు కనిపించదు.

చిన్నూ: అబ్బో దీనికి చాలా సీనే ఉంది. బోలెడు విషయాలు చెప్పావ్‌ బాబాయ్‌. అమ్మకు తెలుసో లేదో చెప్పొస్తా! బైబై!

- సి.వి. సర్వేశ్వర శర్మ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని