ఈత రాణి చేపలోయ్! ...నడుస్తాయంతే!

ఇది సముద్రం అడుగుభాగంలో చేతులతో నడుస్తుంది. చేపేంటీ నడవడమేంటీ? అంటారా? నిజమే. ఈ చేపకు చేతులుంటాయి. అంటే మొప్పల స్థానంలో దీనికి బలమైన చేతుల్లా కనిపించే కండరాలు బయటకు పొడుచుకువచ్చి ఉంటాయి. మొప్పలు ఉండవు. అందుకే ఇది సరిగా ఈదలేదన్నమాట. ఆరు అంగుళాల పొడవు వరకు పెరుగుతుంది

Published : 08 Jan 2020 01:05 IST

కొన్ని చేపలున్నాయ్‌... ఉండేది నీటిలోనే... కానీ అన్నిచేపల్లా ఈత కొట్టవ్‌... మరి ఏం చేస్తాయ్‌? చదివేయండి చకచకా!


ఫ్రాగ్‌ ఫిష్‌

ఈ చేప చూడండి ఎలా నడుస్తుందో! దీనికి స్విమ్‌ బ్లాడర్‌ ఉండదు. అందుకే ఇలా చకచకా నడిచేస్తుందన్నమాట. ఇది తన ప్రాణ రక్షణ కోసం వివిధ రూపాల్లోకి మారిపోతూ శత్రుజీవుల్ని తికమక పెట్టేస్తుంది. కొన్నిసార్లు దీని నోటి పరిమాణాన్ని 12 రెట్లు పెంచేస్తూ బుల్లి బుల్లి జీవుల్ని గుటుక్కుమంటూ మింగేస్తుంది.


హ్యాండ్‌ ఫిష్‌

ఇది సముద్రం అడుగుభాగంలో చేతులతో నడుస్తుంది. చేపేంటీ నడవడమేంటీ? అంటారా? నిజమే. ఈ చేపకు చేతులుంటాయి. అంటే మొప్పల స్థానంలో దీనికి బలమైన చేతుల్లా కనిపించే కండరాలు బయటకు పొడుచుకువచ్చి ఉంటాయి. మొప్పలు ఉండవు. అందుకే ఇది సరిగా ఈదలేదన్నమాట. ఆరు అంగుళాల పొడవు వరకు పెరుగుతుంది. బుల్లి చేపల్లాంటి చిన్నచిన్న జీవులను ఆహారంగా తింటూ బతికేస్తుంది. ఆస్ట్రేలియా, టాస్మేనియా దేశ సముద్రాల్లో తిరిగాడేస్తుంది.


బ్లాబ్‌ ఫిష్‌

ఇది చేపల్లోనే చాలా చిత్రమైనది. ఎముకలు లేకుండా చాలా లావుగా వింతగా ఉంటుంది. చూస్తుంటేనే దీని శరీరం మెత్తమెత్తగా ఉందనిపిస్తుంది కదూ. ఈ చేప శరీర సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ. అందుకే సముద్రపు అడుగుభాగంలో తేలియాడుతూ ఉంటుంది. అంటే ఇది ఈదదన్నమాట. ఇది ఉన్నచోటుకే ఏవన్నా జీవులు వచ్చినప్పుడు తిని జీవించేస్తుంటుంది.


బ్యాట్‌ ఫిష్‌

ఇది దాదాపు 14 అంగుళాల వరకు పొడవు పెరుగుతుంది. దీనికి దృఢమైన మొప్పలుంటాయి. అయితే వీటితో ఏం చేస్తుందో తెలుసా? సముద్ర అడుగు భాగంలో గబగబా నడిచేస్తుంది. ఆ నడక చూస్తే అచ్చం గబ్బిలం నడుస్తున్నట్లు అనిపిస్తుంది. అందుకే దీనిని బ్యాట్‌ ఫిష్‌ అంటారు. నీటిలో ఉండే చిన్న చిన్న జీవులు దీని ఆహారం. ఈ చేపల్లో దాదాపు 60 రకాల జాతులున్నాయి. పరిసరాల్లో దాక్కుంటూ భలేగా శత్రువుల్ని బోల్తా కొట్టిస్తుంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు