నీళ్లలో చిరుతలు

చిరుతంటే వేగానికి చిరునామా! రూపంలోనూ ప్రత్యేకం.. చుడటానికి చుక్కలతో చక్కగా ఉంటుంది. మరి చేపలకూ ఆ మచ్చలు వస్తే.. అచ్చం నీటిలో చిరుతల్లా ఉండవూ! మనం ఈరోజు అలాంటి కొన్ని వింత జలచరాల గురించి తెలుసుకుందామా?లెపర్డ్‌ ఈల్‌.. అట్లాంటిక్‌ మహాసముద్రంలో కనిపిస్తుంది. ఇది చూడటానికి చిరుతపులి మచ్చలతో.. పాములా పొడవుగా భయంకరంగా ఉంటుంది...

Updated : 18 Jan 2020 00:37 IST

చిరుతంటే వేగానికి చిరునామా! రూపంలోనూ ప్రత్యేకం.. చుడటానికి చుక్కలతో చక్కగా ఉంటుంది. మరి చేపలకూ ఆ మచ్చలు వస్తే.. అచ్చం నీటిలో చిరుతల్లా ఉండవూ! మనం ఈరోజు అలాంటి కొన్ని వింత జలచరాల గురించి తెలుసుకుందామా?


ఈ..  ఈల్‌..   కళ్లు జిగేల్‌!

లెపర్డ్‌ ఈల్‌.. అట్లాంటిక్‌ మహాసముద్రంలో కనిపిస్తుంది. ఇది చూడటానికి చిరుతపులి మచ్చలతో.. పాములా పొడవుగా భయంకరంగా ఉంటుంది. సముద్రపు నీటిలో ఒక్కసారిగా కళ్లు జిగేల్‌ మనిపించేలా ఇది కనిపిస్తుంది. చిన్న చిన్న చేపల్ని, ఇతర సముద్ర జీవుల్ని ఇది ఆహారంగా తీసుకుంటుంది. ఇవి 64 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాయి.


ష్‌.. బుష్‌ ఫిష్‌

దీని పేరు లెపర్డ్‌ బుష్‌ ఫిష్‌. ఈ చేపల జన్మస్థలం కాంగో నది పరివాహకం. మధ్య ఆఫ్రికాలో ఎక్కువగా ఇవి కనిపిస్తుంటాయి. ఈ చేపలు చాలా నెమ్మదిగా పెరుగుతాయి. అందుకే వీటిని ఎంచక్కా అక్వేరియాల్లోనూ పెంచేస్తుంటారు. ఇవి వేగంగా ప్రవహించే నదుల్లోనూ, నీరు నిలువ ఉండే మడుగులు, చెరువుల్లోనూ బతకగలవు. వీటి శరీరంపై అచ్చం చిరుతపులిలాగే మచ్చలు ఉంటాయి. ఇవి పేరుకు తగ్గట్లే చాలా దూకుడుగా కనిపిస్తాయి. తమకంటే చిన్నచేపల్ని కళ్లు మూసి తెరిచేంతలో హాం..ఫట్‌ మనిపిస్తాయి


చూడచక్కని క్యాట్‌ ఫిష్‌!

లెపర్డ్‌ క్యాట్‌ ఫిష్‌లో మళ్లీ కొన్ని రకాలున్నాయి. ఇవి ఎక్కువగా అమెజాన్‌ నదుల్లో కనిపిస్తుంటాయి. చుక్కల్లో కొద్ది పాటి తేడాలతో ఉంటాయి. ఇవి ఎక్కువగా చిన్న చిన్న చేపలు, నత్తలు, ఇతర జీవుల్ని తిని జీవిస్తుంటాయి.


అయ్‌.. బాబోయ్‌ పఫర్‌ ఫిష్‌!

మీకు పఫర్‌ ఫిష్‌ అంటే తెలిసే ఉంటుంది కదా.. బంతిలా ఉబ్బిపోయి.. ముళ్లతో కనిపిస్తుంటుంది. లెపర్డ్‌ పఫర్‌ ఫిష్‌ తెలుసా?! ఇవీ సముద్రంలోనే ఉంటాయి. మళ్లీ ఇందులో రెండు రకాలుంటాయి. ఒకటి పసుపు వర్ణంతో నల్లటి చుక్కలతో ఉంటే.. మరో రకం లేత గోధుమ వర్ణంతో తెల్లని చుక్కలతో ఉంటుంది. పసుపు రంగులో ఉండేవి చిన్నగా ఉంటే.. లేత గోధుమ రంగులోవి కాస్త పెద్దగా ఉంటాయి.


అమ్మో.. చుక్కల షార్క్‌

దీన్ని లెపర్డ్‌ షార్క్‌ అని అంటారు కానీ.. నిజానికి దీని చారలు కాస్త కొండచిలువను పోలి ఉంటాయి. ఇవి ఎక్కువగా పసిఫిక్‌ మహాసముద్రంలో కనిపిస్తుంటాయి. ఇవి 1.2 మీటర్ల నుంచి 1.5 మీటర్ల పొడవు వరకు పెరుగుతుంటాయి. ఇవి ఎక్కువగా తీరానికి దగ్గర్లోనే తిరుగుతుంటాయి. చిన్న చిన్న చేపల్ని, సముద్ర జీవుల్ని తింటుంటాయి. ఇవి మనుషులకు మాత్రం ఎలాంటి హానీ చేయవు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని