నా దూకుడు.. సాటెవ్వరు?

‘భయం అంటే ఏంటో తెలియని బ్లడ్‌ గ్రూప్‌ నాది.. సింహంతోనైనా ఒంటి చేత్తో పోరాడతా!’ ఇది ఏదో సినిమాలోని డైలాగ్‌ అనుకుంటున్నారా..  కానే కాదు.. ఇది నా గురించే! నా పేరు హనీబ్యాడ్జర్‌. ఓ బుల్లి ఎలుగుబంటి.. ముంగిస..  ఓ చిన్ని కుక్క.. అడవి ఉడత..  ఇలా కొన్ని జీవుల్ని మిక్సీలో వేసి తీస్తే వచ్చే జంతువులా ఉంటాను నేను!! ఇంకెందుకాలస్యం నా గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోండి మరి!...

Published : 20 Jan 2020 00:36 IST

‘భయం అంటే ఏంటో తెలియని బ్లడ్‌ గ్రూప్‌ నాది.. సింహంతోనైనా ఒంటి చేత్తో పోరాడతా!’ ఇది ఏదో సినిమాలోని డైలాగ్‌ అనుకుంటున్నారా..  కానే కాదు.. ఇది నా గురించే! నా పేరు హనీబ్యాడ్జర్‌. ఓ బుల్లి ఎలుగుబంటి.. ముంగిస..  ఓ చిన్ని కుక్క.. అడవి ఉడత..  ఇలా కొన్ని జీవుల్ని మిక్సీలో వేసి తీస్తే వచ్చే జంతువులా ఉంటాను నేను!! ఇంకెందుకాలస్యం నా గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోండి మరి!
నా అడ్డా ఆఫ్రికా... నేను ముక్కోపిని.. నా దారికి ఎవరైనా అడ్డువస్తే.. అంతే.. పోట్లాట పెట్టుకుంటా! ఓ విధంగా నేను చిన్నపాటి రౌడీనన్నమాట. నక్కలకు చుక్కలు చూపిస్తా... చిరుతపులికి చెమటలు పట్టిస్తా.. అడవి కుక్కల్ని అవాక్కయ్యేలా చేస్తా. కొండచిలువలను చంపేస్తా.. భయంకర విష సర్పాలనూ కరకరా నమిలేస్తా.. చివరకు సింహాలనూ ముప్పుతిప్పలు పెడతా!


తొడగొట్టు చిన్నా..

* నాకసలు భయమే వేయదు! ఇదేదో గొప్పల కోసం నేను చెప్పుకోవడం లేదు. ఏకంగా ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ వారే నేను భయంలేని జీవినని తేల్చేసి నాపేరిట రికార్డూ ఇచ్చారు.
* నా చర్మం చాలా మందంగా ఉంటుంది. ఇది నన్ను పులులు, సింహాలు, నక్కలు, అడవికుక్కలు, హైనాల దాడి నుంచి కాపాడుతుంది.
* దీనికి తోడు చర్మం వదులుగానూ ఉంటుంది. ఇది నేను స్వేచ్ఛగా అటూ ఇటూ కదలడానికి ఉపయోగపడుతుంది.
* చూస్తే చిన్నగా ఉంటాను కానీ.. చిరుతపులులు, నక్కలు, కొండచిలువలు.. ఆఖరుకు అడవికి రారాజైన సింహంతోనూ నేను తలపడగలను.
* నాకు రోషం.. పౌరుషం ఎక్కువ.. అందుకే సినిమాల్లో హీరోలు తొడగొట్టి ఫైట్‌ చేసినట్లు చివరి దాకా పోరాడతాను.


నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది!

* నా ధైర్యం, తెలివితేటలు, మొండితనం ఇవన్నీ నన్ను తిక్కజీవిగా చేశాయి. నా దుందుడుకుతనమే దీనికి కారణం.
* నాకు బలమైన పళ్లు, దవడలు, గోళ్లుంటాయి. ఇవే నా బలం. ఏదైనా జంతువు నా మీద దాడి చేసినప్పుడు నేను పళ్లు, పదునైన గోర్లతో వాటిపై ఎదురుదాడి చేస్తా.
* నాలోనూ చాలా రకాలున్నాయి. వీటిలో చిన్న చిన్న తేడాలుంటాయి.
* మా బంధువులు మీ దేశంలోనూ ఉన్నారు. వాటిని హాగ్‌ బ్యాడ్జర్స్‌ అంటారు. ఇంకా ప్రధానంగా.. ఆసియన్‌ బ్యాడ్జర్స్‌, జపనీస్‌ బ్యాడ్జర్స్‌, అమెరికన్‌ బ్యాడ్జర్స్‌ అనే రకాలు ప్రపంచంలో పలు చోట్ల ఉన్నాయి.


ఒక్కొక్కర్నీ కాదు.. షేర్‌ఖాన్‌!

* నా చేతిలో దెబ్బతిన్న జంతువులు మరోసారి నాతో పోరాటం అంటే భయపడతాయ్‌! ‘ఈ మొండివాడితో మాకు ఎందుకొచ్చిన గొడవ’ అని తోక ముడుస్తాయ్‌.
* అవతల జీవులు గుంపులుగా వచ్చినా.. ‘ఒక్కొక్కర్నీ కాదు.. షేర్‌ఖాన్‌’ అని వాటి మీదకు దూకుతాను!
* కానీ మేమూ ఓడిపోతుంటాం. సింహాల చేతిలో ఎక్కువగా ప్రాణాలు కోల్పోతుంటాం.
* చనిపోతామని తెలిసినా.. చివరి వరకు పోరాటం చేయడానికే చూస్తాం.
* ఇంతా చేస్తే మేం కేవలం 4 నుంచి 18 కిలోగ్రాముల బరువు ఉంటామంతే.
* నా జీవితం కాలం దాదాపు 10 సంవత్సరాలే.


బొజ్జ నిండా భోం చేస్తా..

* నాకు తేనె అంటే ఎంతో ఇష్టం. చక్కగా జుర్రేసుకుంటాను.
* ఇంకా.. చిన్న చిన్న పురుగులు, నత్తలు, కప్పలు, తాబేళ్లు, బల్లులు, పాములు, పక్షులు, గుడ్లు, ఎలుకల్ని తింటాను.
* ఇవన్నీ చూసి నేను కేవలం మాంసాహారినే అనుకునేరు! దుంపలు, వేర్లు వంటి వాటినీ ఆహారంగా తీసుకుంటాను.
* ప్రమాదకర పాములైన కోబ్రాలు, బ్లాక్‌మాంబాలనూ హాం.. ఫట్‌ చేసేస్తా.
* నేను పగటి పూట కంటే.. రాత్రి సమయాల్లో మరింత దూకుడుగా ఉంటాను.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని