ఎగురుతుంటే... ఎంత బాగుంటుందో!

జలచరాలు గాల్లో ఎగురుతాయా? హా... ఎగురుతాయ్‌...మరి పాములు? అవీ ఎగిరేస్తాయ్‌...ఇవేనా? ఇంకొన్ని జీవులూ ఎగిరేస్తాయ్‌...నోరెళ్లబెట్టకుండా చదవండి కొలుగో  ఆ జీవులేంటో? వాటి ముచ్చట్లేంటో?

Published : 05 Feb 2020 00:24 IST

      జలచరాలు గాల్లో ఎగురుతాయా? హా... ఎగురుతాయ్‌...మరి పాములు? అవీ ఎగిరేస్తాయ్‌...ఇవేనా? ఇంకొన్ని జీవులూ ఎగిరేస్తాయ్‌...నోరెళ్లబెట్టకుండా చదవండి కొలుగో  ఆ జీవులేంటో? వాటి ముచ్చట్లేంటో?

కొలుగో... దీని పేరే చిత్రంగా ఉంది కదూ. ఇదో క్షీరదం. కోతులు, లెమర్లు దీనికి బంధువులు. అయితే అసలు గొప్ప ఇది కాదు. ఇది గాల్లో ఎగిరేస్తుంది. అందుకే దీనికి ఫ్లయింగ్‌ లెమర్‌ అనే పేరూ ఉంది. చిన్న కోతి పిల్లంత పరిమాణంలో ఉండే ఇది భలేగా గెంతుతుంది. ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకు ఎగురుతూ దాదాపు 230 అడుగుల నుంచి 500 అడుగుల దూరం వరకూ దూకేస్తుంది. దీని కాళ్ల దగ్గరుండే ప్రత్యేకమైన చర్మం వల్లే ఇది సాధ్యం. పగటి పూట చెట్లతొర్రల్లో, కొమ్మలపై విశ్రాంతి తీసుకుని చీకటిపడ్డాక వేటకు వెళుతుంది.


జపనీస్‌ ఫ్లయింగ్‌ స్క్విడ్‌

సముద్రాల్లో తిరుగాడే స్క్విడ్‌ పేరు విన్నారా? ఆక్టోపస్‌కి బంధువు. ఈ ఎగిరే స్క్విడ్‌ అందులో ఓ రకానికి చెందినది. ఎనిమిది చేతులతో రెండు టెంటకిల్స్‌తో ఒకటిన్నర అడుగుల పొడవుతో గమ్మత్తుగా ఉంటుంది. పసిఫిక్‌ సముద్రంలో ఎక్కువగా కనిపించే ఈ స్క్విడ్‌ ప్రత్యేకత ఏంటో తెలుసా? నీటి ఉపరితలంపై గాల్లో హాయిగా ఎగిరేస్తుంది. దాదాపు 150 అడుగుల ఎత్తు వరకు ఎగురుతుంటుంది. వలస వెళ్లేప్పుడు శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ఇంకా దాని శక్తిని ఆదా చేసుకోవడానికే ఇలా ఎగిరేస్తుందట.


ఫ్లయింగ్‌ స్నేక్‌

పాములంటే పాకేస్తాయనే అనుకుంటాం. కానీ సౌత్‌ఈస్ట్‌ఆసియా అడవుల్లో ఉండే క్రైసోపెలియా అనే పాము ఎగిరేస్తుంది. అంటే మరీ పక్షిలా కాదండోయ్‌. కానీ శరీరాన్ని ఎగరడానికి వీలుగా చదునుగా మార్చుకుని చటుక్కున గాల్లో ఎగురుతుంది. దీని పొట్టకున్న ప్రత్యేకత వల్ల చెట్లపైకి చకచకా ఎక్కేస్తుంది. అంతేనా ఒక కొమ్మ చెట్టు మీద నుంచి ఇంకో చెట్టుమీదకు గాల్లో ఎగురుతూ దూకేస్తుంది. ఆహార వేట కోసం, ఇంకా భూమ్మీదుండే శత్రుజీవుల నుంచి తప్పించుకోవడానికే ఇలా ఇది ఎగిరేస్తుంది. రెండు నుంచి 4 అడుగుల పొడవుండే ఈ పాము ఒకేసారి దాదాపు 100 మీటర్ల పొడవు దూకేస్తుంది.


 

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని