గూడు కట్టకుండానే గుడ్డు పెట్టేస్తా!

కోకిల రూపం.. తెల్లని వర్ణం.. చూడగానే విచిత్రంగా అనిపిస్తున్ననా పేరు వైట్‌టెర్న్‌.. నేనో సముద్ర పక్షిని.. మాకు కొన్ని ప్రత్యేకతలున్నాయి.. అవేంటో చదివేస్తారా మరి!  మా రూపం కాస్త కోకిలలా ఉంటుంది! మరో తమాషా విషయం ఏంటంటే.. అచ్చం దానిలానే మాకూ గూడు కట్టుకోవడం రాదు....

Published : 10 Feb 2020 00:31 IST

కోకిల రూపం.. తెల్లని వర్ణం.. చూడగానే విచిత్రంగా అనిపిస్తున్న

నా పేరు వైట్‌టెర్న్‌.. నేనో సముద్ర పక్షిని..

మాకు కొన్ని ప్రత్యేకతలున్నాయి.. అవేంటో చదివేస్తారా మరి!

బుల్లిపిట్ట.. బుజ్జిపిట్ట!

మేం కాస్త చిన్న పక్షులం

కానీ రెక్కలు మాత్రం వెడల్పుగా ఉంటాయి.

రెక్కలు విప్పితే 76 నుంచి 77 సెంటీమీటర్ల పొడవుంటాం.

మేం తెల్లగా.. చూడటానికి చాలా అందంగా ఉంటాం.

మాలో మరికొన్ని రకాలూ ఉన్నాయి.

ఒకే ఒక గుడ్డు పెడతాం..

మా రూపం కాస్త కోకిలలా ఉంటుంది! మరో తమాషా విషయం ఏంటంటే.. అచ్చం దానిలానే మాకూ గూడు కట్టుకోవడం రాదు.

అలా అని మేం వేరే పక్షి గూళ్లలో దొంగచాటుగా వెళ్లి గుడ్లు పెట్టం.

మేం చెట్ల కొమ్మలు, ఎత్తైన రాళ్లు, ఆఖరుకు భవంతుల మీదా గుడ్లు పెడతాం.

పేరుకు గుడ్లు అంటున్నాను కానీ.. మాలో చాలా పక్షులు ఓసారి ఒక గుడ్డు మాత్రమే పెడతాయి.

గుడ్డును పొదగడానికి 30 నుంచి 40 రోజుల సమయం పడుతుంది.

గుడ్డులోంచి వచ్చిన పిల్ల పెరిగి పెద్దదయ్యేంత వరకు దాని బాగోగులు మాలో ఆడ, మగ పక్షి రెండూ చూసుకుంటాయి.

మా విహారం.. పసిఫిక్‌ తీరం..

మేం ఎక్కువగా పసిఫిక్‌ సముద్రతీరంలో నివసిస్తుంటాం.

చిన్న చిన్న ద్వీపాల్లో గుడ్లు పెడుతుంటాం.

చిలీ, కొలంబియా నుంచి న్యూజిలాండ్‌ వరకు మేం ఎక్కువగా కనిపిస్తుంటాం.

చైనా నుంచి ఇండియా, దక్షిణ మాల్దీవులు, హిందూ మహా సముద్రంలోని దీవులు, సౌతాఫ్రికా తీరాల్లోనూ సందడి చేస్తుంటాం.

జపాన్‌, మడగాస్కర్‌, మెక్సికో, అట్లాంటిక్‌ మహా సముద్రతీరంలోని కొన్ని ద్వీపాల్లోనూ నివసిస్తుంటాం.

పిట్టకొంచెం జీవితం ఘనం!

మా జీవితకాలం కాస్త ఎక్కువే. మా బంధువొకరు 42 సంవత్సరాలు బతికి రికార్డు సృష్టించారు.

మమ్మల్ని ఇంట్లో పెంపుడు పక్షుల్లా పెంచుకునే వారూ ఉన్నారు.

పసిఫిక్‌ మహాసముద్రంలో ప్రయాణించే నావికులకు నేల ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు మేం చక్కగా సాయం చేస్తుంటాం.

చాలా పక్షులు దూరతీరాలకు వలస పోతుంటాయి కానీ మేం మాత్రం అలా కాదు.

మేమున్న ప్రాంతం నుంచి మేం అటుఇటుగా సుమారు 45 కిలోమీటర్ల పరిధి లోపలే తిరుగుతుంటాం.

అంటే సముద్రంలో మేం కనిపించామంటే... అక్కడికి దగ్గర్లోనే భూభాగం ఉందన్నమాట! ఇలా నావికులు మమ్మల్ని దిక్సూచిలా వాడుకుంటారన్నమాట.

చేపలంటే ఇష్టం..

క్కువగా మేం తీరంలోనే తచ్చాడుతుంటాం. కానీ గుడ్లు పెట్టే సమయంలో చెట్లు ఉండే ప్రాంతానికి వెళతాం.

మేము చిన్న చిన్న చేపల్ని ఇష్టంగా తింటాం.

కింగ్‌ఫిషర్‌ పక్షిలానే మేమూ నీటిలోకి నిట్టనిలువునా దూకి చేపలను వేటాడుతాం.

మేం చెట్ల కొమ్మలమీదే గూళ్లు లేకుండానే గుడ్లు పెడతాం కదా.. అప్పుడప్పుడు తుపాన్లు, బలమైన గాలుల కారణంగా మా గుడ్లు, పిల్లలు అపాయానికి గురవుతూ ఉంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని