మారిన కొడుకు

ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు. వ్యవసాయంలో ఎన్నోకష్టాలకు ఓర్చాడు. అయినా ఎంతో ఓపికతో సాగు చేసి ధనవంతుడయ్యాడు. అతడికి లేకలేక ఒక కొడుకు పుట్టాడు. చిన్నప్పటి నుంచీ అతిగారం చేసి పెంచడంతో జులాయిగా తయారయ్యాడు. చదువు అబ్బలేదు. తండ్రి కష్టపడి సంపాదించిన డబ్బును వృథా చేసేవాడు....

Published : 29 Jun 2020 00:32 IST

క ఊర్లో ఒక రైతు ఉండేవాడు. వ్యవసాయంలో ఎన్నోకష్టాలకు ఓర్చాడు. అయినా ఎంతో ఓపికతో సాగు చేసి ధనవంతుడయ్యాడు. అతడికి లేకలేక ఒక కొడుకు పుట్టాడు. చిన్నప్పటి నుంచీ అతిగారం చేసి పెంచడంతో జులాయిగా తయారయ్యాడు. చదువు అబ్బలేదు. తండ్రి కష్టపడి సంపాదించిన డబ్బును వృథా చేసేవాడు.

బాగా ఆలోచించి రైతు ఒకనాడు తన కొడుకును దగ్గరకు పిలిచి ‘బాబూ! నేను చనిపోయిన తర్వాత ఈ ఆస్తి అంతా నీదే అవుతుంది. కానీ ఈ ఆస్తిని నీవు నిలబెట్టుకోలేవేమోనని బాధ పడుతున్నా. కాబట్టి నువ్వు కూడా డబ్బు సంపాదించగలనని నిరూపించు. వెంటనే ఆస్తినంతా నీకిచ్చివేస్తాను’ అన్నాడు.

‘సరే! అలాగే చేస్తాను’ అన్నాడు కొడుకు. ఆ రోజే పనికి బయలు దేరాడు. అంతవరకు వెన్నంటే తిరిగిన స్నేహితులు ఒక్కసారిగా దూరం జరిగారు. చదువు సంధ్య లేనివాళ్లకు ఉద్యోగం ఎవరిస్తారు? ఏ పనీదొరక్క ఒక ధాన్యం మిల్లులో బస్తాలు మోసే కూలీగా చేరాడు. మొదటి రోజు వందరూపాయలు సంపాదించాడు. సంతోషంగా తీసుకెళ్లి తండ్రికి ఇచ్చాడు. వెంటనే రైతు ఆ డబ్బుల్ని తీసుకెళ్లి బావిలో పడేశాడు. మర్నాడు కూడా పనికి వెళ్లి కొడుకు తెచ్చిన డబ్బును రైతు అలాగే బావిలో వేశాడు. అయిదు రోజులు అలాగే పడేసిన తర్వాత ఆరోరోజూ తండ్రి డబ్బును నూతిలో పడేస్తుంటే అడ్డుకొని ‘అదేంటి నాన్నా! నేను ఎంతో కష్టపడి మూటలు మోసి సంపాదించిన నా కష్టార్జితాన్ని అలా నూతిలో పడేస్తున్నావెందుకు?’ అని అడిగాడు కొడుకు.

దానికి సంతోషంతో రైతు, కొడుకును అభినందిస్తూ ‘ఈ సమయం కోసమే నేను చూస్తున్నా. నీ సంపాదన నీళ్ల పాలవుతోందని బాధపడిపోతున్నావు. నా డబ్బును నువ్వు జులాయిగా మారి జల్సాల కోసం ఖర్చు చేసినప్పుడు నేను ఎంత బాధపడ్డానో నీకు తెలియజెప్పడానికే నేను ఇలా చేశాను. డబ్బు సంపాదించడం కష్టం.. ఖర్చు చేయడం చాలా తేలిక. ఇప్పటికైనా నీకు అర్థమైంది సంతోషం’ అన్నాడు.

కొడుకు తన తప్పు తెలుసుకుని.. తనను క్షమించమని తండ్రిని వేడుకున్నాడు. అప్పటి నుంచి డబ్బును దుబారా చేయడం మాని.. కష్టపడటం నేర్చుకున్నాడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని