కోతి.. తెలుసుకున్న నీతి!

రాధాపురంలో రాఘవయ్య అనే పెద్ద రైతు ఉండేవాడు. అతడి తోటలో ఓ కోతి ఉండేది. దానికి పొగడ్తలు అంటే ఇష్టం. ఎవరు పొగిడినా పొంగిపోయి తన దగ్గరున్న ఆహార పదార్థాలను ఇచ్చేసేది. కోతి బలహీనత గురించి తోటలోని చిన్న చిన్న జీవులన్నింటికీ తెలిసింది. దాంతో అవి కోతి దగ్గరకు వచ్చి కాసేపు పొగిడి, ఏదో ఒకటి తీసుకెళ్లేవి. క్రమక్రమంగా ఈ అలవాటు ఏ స్థాయికి చేరిందంటే.. జీవులు కొన్ని బృందాలుగా ఏర్పడి.

Published : 30 Jan 2021 00:57 IST

రాధాపురంలో రాఘవయ్య అనే పెద్ద రైతు ఉండేవాడు. అతడి తోటలో ఓ కోతి ఉండేది. దానికి పొగడ్తలు అంటే ఇష్టం. ఎవరు పొగిడినా పొంగిపోయి తన దగ్గరున్న ఆహార పదార్థాలను ఇచ్చేసేది.
కోతి బలహీనత గురించి తోటలోని చిన్న చిన్న జీవులన్నింటికీ తెలిసింది. దాంతో అవి కోతి దగ్గరకు వచ్చి కాసేపు పొగిడి, ఏదో ఒకటి తీసుకెళ్లేవి. క్రమక్రమంగా ఈ అలవాటు ఏ స్థాయికి చేరిందంటే.. జీవులు కొన్ని బృందాలుగా ఏర్పడి.. కోతి దగ్గరకు వెళ్లి నాలుగు మాటలు చెప్పి ఆహార పదార్థాలు కోరేవి. ఒకవేళ అవి దాని దగ్గర లేకపోతే పక్కనే ఉన్న ఊరిలోకి వెళ్లి తీసుకురమ్మనేవి. కోతి కూడా కాదనలేక అష్టకష్టాలు పడి అడిగిన వాటిని తెచ్చి ఇస్తుండేది.
ఒకరోజు కోతి దగ్గరకు కొన్ని కాకులు వచ్చాయి. దాన్ని పొగిడి ‘మాకు వేడి వేడి పరమాన్నం తినాలని ఉంది. ఎలాగైనా ఊళ్లోకి వెళ్లి తీసుకురా’ అని అడిగాయి. వాటి మాట కాదనలేక కోతి, గ్రామంలో తనకు తెలిసిన అవ్వ ఇంటికి వెళ్లింది. ‘అవ్వా! నీకు తోటలోంచి పండ్లు తీసుకొచ్చి ఇస్తాను గానీ ఇప్పుడు నాకు వేడి వేడి పరమాన్నం వండి ఇవ్వు. నా మిత్రులు కాకుల బృందానికి విందు ఇవ్వాలి’ అంది. ‘ఏంటి విశేషం?’ అడిగింది అవ్వ. ‘ఆ కాకులు నన్ను గొప్పగా పొగిడాయి. అందుకు ప్రతిఫలంగా పరమాన్నం కోరాయి’ అమాయకంగా చెప్పింది కోతి.
‘అలా ఏదో ఒక ప్రతిఫలం ఆశించి పొగిడేవారిని నమ్మకూడదు. నీకోసం అయితే పరమాన్నం వండి వడ్డిస్తాను.. తినిపో’ అంది అవ్వ. ‘పరమాన్నం వండి ఇవ్వాలనుకుంటే ఇవ్వు. లేకపోతే లేదు. అంతేగానీ నాకు నీతులు చెప్పొద్దు’ అని కోపగించుకుంది కోతి. ‘దీనికి బాధ కలిగితే తప్ప.. విషయం బోధపడేటట్లు లేదు’ అనుకొని కోతి కోరిన పరమాన్నం వండింది అవ్వ. దాన్ని ఒక కుండలో పెట్టి గుడ్డ చుట్టి ఇచ్చింది. చేతులు, శరీరం కాల్చుకోకుండా జాగ్రత్తగా తీసుకెళ్లమని చెప్పింది.
ఎంత జాగ్రత్తగా పట్టుకున్నా.. తీసుకెళ్లే క్రమంలో కోతి పొట్టకు, చేతులకు కుండ తగిలి బొబ్బలు వచ్చి చర్మం ఊడిపోయింది. అయినా, కాకుల కోసం మంటను ఓర్చుకొని.. కుండను తోటలోకి తీసుకెళ్లి విందు ఇచ్చింది. పరమాన్నం తినేసి.. కోతిని కాసేపు పొగిడి కాకులు తుర్రుమన్నాయి. గాయపడటంతో ఎక్కడికీ కదల్లేక అక్కడే ఓ చెట్టు కింద కూలబడిపోయింది కోతి.
మరుసటి రోజు మళ్లీ అవే కాకులు.. కోతి దగ్గరికి వచ్చి పొగడ్తలు కురిపించసాగాయి. అది నీరసంగా కళ్లు తెరచి ‘మిత్రులారా! నిన్న మీకోసం వేడి వేడి పరమాన్నం తెస్తుండగా.. నా శరీరం గాయపడింది. మీలో ఎవరైనా ఊళ్లోకి వెళ్లి వైద్యుడిని తీసుకురండి. నా ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మీ కోర్కెలు తీరుస్తా’ అంది.
ఆ మాటలతో కాకులు ముఖముఖాలు చూసుకొని.. ఏదో ఒక కారణం చెప్పి, ఒక్కొక్కటిగా అక్కడి నుంచి జారుకున్నాయి. అప్పుడు దానికి అవ్వ మాటలు గుర్తొచ్చాయి. ‘జీవితం పట్ల ఎంతో అనుభవం ఉన్న అవ్వ మాటకు విలువ ఇవ్వకుండా తప్పు చేశాను’ అని బాధపడింది. ఎలాగోలా ఓపిక కూడదీసుకొని అవ్వకు క్షమాపణ చెప్పేందుకు ఊళ్లోకి వెళ్లింది.
కోతి దుస్థితిని చూసిన అవ్వ.. వైద్యుడిని పిలిచి చికిత్స చేయించింది. ఆరోగ్యం కుదుటపడే వరకు తన దగ్గరే ఉంచుకుంది. ‘ఇకనైనా అతిగా పొగిడి ప్రతిఫలం కోరే సోమరిపోతులకు, స్వార్థపరులకు దూరంగా ఉండు. నిజంగా నీ సాయం అవసరమైన వారికి మాత్రం అండగా నిలబడు’ అని హితబోధ చేసి పంపించింది. అప్పటి నుంచి కోతి పొగడ్తలకు పొంగిపోకుండా తన పని తాను చూసుకునేది. 

- మీగడ వీరభద్రస్వామి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని