కోతి చేతికి బంగారు కిరీటం!

యువరాజు కీర్తిసింహుడికి వేట అంటే ఇష్టం. ఒకరోజు మంత్రి, నలుగురు సైనికులతో కలిసి సమీపంలోని దట్టమైన అడవికి వేటకు వెళ్లారు. అక్కడ వారికి చిన్న చిన్న కుందేళ్లు, పిచ్చుకలు మాత్రమే కనిపించాయి.పెద్ద జంతువుల కోసం యువరాజు బృందం అడవి లోపలకు చాలా దూరం వెళ్లింది. అక్కడ వారికి లోతైన ఓ లోయ కనిపించింది. ఆ భయంకరమైన లోయలో ఏముందోనని ఆసక్తితో యువరాజు ఒక రాయి మీదకు ఎక్కి తొంగి చూడసాగాడు.

Published : 14 Mar 2021 00:50 IST

యువరాజు కీర్తిసింహుడికి వేట అంటే ఇష్టం. ఒకరోజు మంత్రి, నలుగురు సైనికులతో కలిసి సమీపంలోని దట్టమైన అడవికి వేటకు వెళ్లారు. అక్కడ వారికి చిన్న చిన్న కుందేళ్లు, పిచ్చుకలు మాత్రమే కనిపించాయి.
పెద్ద జంతువుల కోసం యువరాజు బృందం అడవి లోపలకు చాలా దూరం వెళ్లింది. అక్కడ వారికి లోతైన ఓ లోయ కనిపించింది. ఆ భయంకరమైన లోయలో ఏముందోనని ఆసక్తితో యువరాజు ఒక రాయి మీదకు ఎక్కి తొంగి చూడసాగాడు.
‘యువరాజా! జాగ్రత్త. లోయ చాలా లోతుగా ఉంది’ అని ఒక సైనికుడు హెచ్చరించాడు.
‘నేను ఈ రాయి పక్కనున్న చెట్టు కొమ్మ పట్టుకున్నానులే సైనికా’ అంటూ మరింత వంగి లోయలోకి చూశాడు. అంతే.. యువరాజు బంగారు కిరీటం జారి రాళ్ల మీద పడి దొర్లుకుంటూ లోయలో చెట్ల మధ్య పడిపోయింది.
‘అయ్యో! కిరీటం పడిపోయింది. ఇప్పుడెలా?’ అని యువరాజు బాధపడ్డాడు.
‘మనం లోపలకు వెళ్లి కిరీటం తేవాలంటే చాలా కష్టం. లోయ భయంకరంగా ఉంది. అందులోనూ సూర్యాస్తమయం కావొస్తుంది. ప్రాణాలను పణంగా పెట్టడం కన్నా మరొకటి చేయించుకోవడం మంచిది’ అని మంత్రి సలహా ఇచ్చాడు.
‘సరే, వెనక్కు వెళ్లిపోదాం పదండి..’ అని యువరాజు తన బృందంతో కలిసి రాజధానికి తిరుగు పయనమయ్యాడు.   అలా లోయలో పడిపోయిన కిరీటం సరిగ్గా ఓ చెట్టు మీద కూర్చున్న కోతి తల మీద అలంకరణగా నిలిచింది. ఆ ఊహించని పరిణామానికి కోతి ఆశ్చర్యపోయి తడిమి చూసుకునే సరికి.. అది కిరీటం అని అర్థమైంది. ఇదంతా దేవుడి పనేనని, ఇకనుంచి తనే రాజునని, అందరికంటే తనే గొప్ప అని ఇతర జంతువుల మీద పెత్తనం చెలాయించసాగింది.
కేవలం కిరీటం వల్ల రాజరికం రాదని.. మంచితనం, నాయకత్వ లక్షణం, ఆలోచనా శక్తి ఉంటేనే గొప్పవారు అవుతారని ఓ ఏనుగు కోతికి హితవు చెప్పింది. అయినా, అది ఆ మాటలు వినిపించుకోలేదు సరికదా గిన్నె కోడి తల మీద ఉండే ఎర్రటి భాగాన్ని చూసి వెక్కిరించింది. ‘నీది కేవలం చర్మం మాత్రమే. కానీ, నా తలపై విలువైన బంగారు కిరీటం ఉంది’ అని హేళన చేయసాగింది. కోడి మాత్రం అవేమీ పట్టించుకునేది కాదు.
మరుసటి రోజు కోతి కిరీటం ఉందన్న అహంకారంతో, తల కిందకు దించకుండానే ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకు దూకింది. ఓ కొమ్మను అందుకునే క్రమంలో పట్టుతప్పి కిందనే ఉన్న ఒక ఊబిలో పడిపోయింది. మునిగిపోతున్న కోతి అరుపులు విన్న గిన్నె కోడి వెంటనే అక్కడకు వచ్చింది. ప్రమాదాన్ని గ్రహించి అడవిలోని ఇతర జంతువులకు కబురు పెట్టింది. అవి వచ్చేలోగా మర్రి చెట్టు ఊడలు కోసి.. తాడులా చేసి కోతికి విసిరింది కోడి. అన్ని జంతువులు కలిసి దాన్ని బయటకు లాగి కాపాడాయి.  
ప్రాణాలు దక్కించుకున్న కోతి కాసేపటి తర్వాత కోలుకుంది. ‘కిరీటం అంటే అధికారం కాదు బాధ్యత. అవసరం ఉన్నవారికి సహాయ పడటం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే మంచితనం. మనలోని మంచితనమే అసలైన కిరీటం. పుట్టుకతో దేవుడు ఇచ్చిన వాటిని ఎగతాళి చేయకూడదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. దాన్ని గుర్తించి ప్రోత్సహించాలి’ అని ఏనుగు కోతికి వివరించి చెప్పింది.
‘అవును.. నేను చాలా తప్పులు చేశా. అనవసరంగా కోడిని ఎగతాళి చేశా. అయినా, అవేమీ మనసులో పెట్టుకోకుండా ఈరోజు నా ప్రాణాలను రక్షించింది. మంచితనమే అసలైన కిరీటం అని తెలుసుకున్నా’ అని కోతి వెక్కివెక్కి ఏడ్చింది. కోడికి క్షమాపణ చెప్పి.. తన తలపై ఉన్న కిరీటాన్ని తీసి ఊబిలో పడేయడంతో జంతువులన్నీ సంతోషించాయి.

- కంచనపల్లి వెంకట కృష్ణారావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని