గుర్రం ఎగిరింది.. కల చెదిరింది!
నందవరంలో నివసించే చంద్రయ్య దగ్గర ఒక అందమైన గుర్రం ఉంది. దాని కాళ్లకు గజ్జెలు కట్టి నాట్యం చేయడం నేర్పాడు. అవి ఘల్లుఘల్లుమని శబ్దం చేస్తుంటే భలే ఉండేది. పెళ్లిళ్లు, జాతర్లలో గజ్జెలగుర్రంతో నాట్యం చేయించడానికి చంద్రయ్యను పిలిచేవారు. అందుకుగాను డబ్బులు ఇచ్చేవారు. అతనికి చందు అనే కొడుకు ఉన్నాడు. అప్పుడప్పుడు సెలవుదినాల్లో చందూను వెంటతీసుకెళ్లేవాడు చంద్రయ్య. గజ్జెలగుర్రం నాట్యం చూసి ఆనందించే వాడు.
ఒక రోజు ఒక పెళ్లికి వెళ్లి ఇంటికి వచ్చే వేళకు సాయంత్రమైంది. గుర్రాన్ని కట్టేసి తండ్రీకొడుకులు అలసటతో మంచంపై వాలిపోయారు. వెంటనే నిద్ర పట్టేసింది. కొద్దిసేపటి తర్వాత ఇంటి బయట నుంచి ఎవరో గట్టిగా పిలుస్తుండడంతో లేచి వచ్చారు.
ఇంటి ముందు బారెడుగెడ్డం, మూరెడు మీసం ఉన్న ఒక పొట్టి మనిషి ఉన్నాడు. అతను చంద్రయ్యతో ‘అయ్యా! నా పేరు జడలయ్య. మా ఇంట్లో తాతలకాలం నాటి నాలుగు గజ్జెలు ఒక రాగిచెంబులో ఉన్నాయి. ఏ ఉపయోగం లేని వీటిని తరతరాలుగా ఇంట్లో ఖాళీగా ఉంచుకోవడం ఎందుకు.. అందుకే అమ్మెద్దామనుకుంటున్నాను’ అని చెప్పి, గజ్జెలను తీసి చేతికిచ్చాడు. చంద్రయ్య వాటిని అటూఇటూ కదిలించాడు. అవి శ్రావ్యంగా, ఎంతో మధురమైన శబ్దంతో మోగాయి. చంద్రయ్య వాటిని కొని గుర్రం కాళ్లకు కట్టాడు.
‘చల్ చల్ గుర్రం.. గజ్జెల గుర్రం.. నాట్యం చెయ్!’ అన్నాడు. లయబద్ధంగా గుర్రం కదలసాగింది. ‘నాన్నా! నన్ను కొత్త గజ్జెల గుర్రంపైన ఎక్కించవా?’ అన్నాడు చందు. వాడు అలా అడగడం, అప్పుడప్పుడు గుర్రంపై ఎక్కించి కళ్లెం గట్టిగా పట్టుకోమని చెప్పడం, అటూ ఇటూ తిప్పి కొద్దిసేపటి తర్వాత కిందకు దింపడం మాములుగా జరిగేదే! చందూకు గుర్రం మీద కూర్చొని ఆకాశంలో విహరించాలని కోరిక. గుర్రం మీద కూర్చోగానే ఎప్పటిలానే ‘చల్ చల్ గుర్రం.. గజ్జెల గుర్రం.. ఆకాశంలో ఎగురుదామా!’ అన్నాడు. అంతే.. గుర్రం గజ్జెలను ఘల్లుఘల్లున కదిలించి మెల్లిగా పైకి లేచింది. చందు ఆశ్చర్యంగా, ఆనందంగా కిందకు చూడసాగాడు. ఇల్లు, పచ్చని చెట్లు చిన్నవిగా కనిపించసాగాయి. మనుషులు చిన్న చిన్న చీమల్లా కనిపిస్తున్నారు. అందరూ విచిత్రంగా పైకి చూస్తున్నారు.
చల్లగాలి ఆహ్లాదంగా చందూను తాకుతోంది. ఒక పావురం వచ్చి చందు భుజంపై వాలింది. ఒక గద్ద తలమీద ఎగురుతూ పలకరించి వెళ్లింది. కొద్ది దూరంలో అందమైన తెల్లకొంగలు బారుగా ఎగురుతున్నాయి. కింద కొండలు, కోనలు, లోయలు, పచ్చని చెట్లు, పారుతున్న నదులు, జలపాతాలు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి.
గుర్రం మెల్లిమెల్లిగా ఇంకా పైపైకి పోతోంది. అది ఇలా ఎగరడానికి మాయగజ్జెలే కారణం అనుకుంటూ చందూ.. ‘చల్ చల్ గుర్రం.. నా చలాకీ గజ్జెలగుర్రం..’ అంటూ ఆనందంగా ఆకాశంలో మేఘాల మధ్య ప్రయాణిస్తున్నాడు. కొద్దిసేపటి తర్వాత గుర్రం నెమ్మదిగా కిందకు దిగసాగింది. ‘కిందకు దిగొద్దు. నిన్నే.. కిందకు దిగొద్దు. ఇంకా కొద్దిసేపు ఆకాశంలో తిరుగుదాం’ అంటూ చందు కేకలు వేయసాగాడు.
‘ఎందుకలా అరుస్తున్నావ్?’ అంటూ నాన్న చందును తట్టిలేపాడు. కళ్లు తెరిచి చూశాడు. నాన్న పక్కన నిద్రపోయి ఉన్నాడు. ఇదంతా కల అని అప్పుడు అర్థమైంది. తన అందమైన కల గురించి నాన్నకు చెప్పాడు. ‘నాకు గుర్రంపై కూర్చొని ఆకాశంలో ఎగరాలని ఉంది నాన్నా’ అని ఎప్పుడూ అంటుంటేవాడివి కదా. ఆ కోరిక నీలో బలంగా ఉంది. మనసులోని ఆ కోరిక నీకు కలగా వచ్చింది’ అన్నాడు చంద్రయ్య.
‘నాన్నా! మళ్లీ ఇలాంటి కల రాదా?’ అడిగాడు చందు. ‘ఎందుకు రాదూ! పడుకునేముందు కళ్లు మూసుకుని నిద్ర పట్టేవరకూ ఈ కలను గుర్తు చేసుకుంటూ, నిద్రలోకి జారుకో. ఏదో ఒక రోజు మళ్లీ గజ్జెలగుర్రంపై ఎగురుతావు. ఈ కోరికలాగే బాగా చదువుకుని ఉన్నతస్థాయికి చేరుకోవాలనే కోరికను బలంగా పెంచుకుని కష్టపడితే చదువనే గజ్జెలగుర్రంపై ఆకాశమంత ఎత్తున ఉన్నతస్థాయిలో ప్రయాణిస్తావు’ అని చెప్పాడు చంద్రయ్య.
- డి.కె.చదువుల బాబు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు
-
Crime News
కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Movies News
దేవుడితో పని పూర్తయింది!.. పవన్‌తో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్‌ను పంచుకున్న సముద్రఖని
-
Ap-top-news News
ఎమ్మెల్యే అనిల్ ఫ్లెక్సీకి పోలీసుల పహారా