అవ్వ నేర్పిన జీవిత పాఠం

అడవిలో కట్టెలు కొట్టి, వాటిని అమ్ముకొని సోమయ్య బతుకుతుండేవాడు. ఓరోజు దగ్గర్లో పులి గాండ్రింపు వినిపించడంతో వెంటనే పక్కనున్న చెట్టుపైకి ఎక్కి గుబురుగా ఉన్న చోట కూర్చున్నాడు. భయం భయంగా చెట్టు కిందకు చూడసాగాడు. ఇంతలో జింకను వేటాడిన పులి దాన్ని చెట్టు కిందకు తెచ్చి నింపాదిగా తింది.

Published : 22 Sep 2021 00:09 IST

అడవిలో కట్టెలు కొట్టి, వాటిని అమ్ముకొని సోమయ్య బతుకుతుండేవాడు. ఓరోజు దగ్గర్లో పులి గాండ్రింపు వినిపించడంతో వెంటనే పక్కనున్న చెట్టుపైకి ఎక్కి గుబురుగా ఉన్న చోట కూర్చున్నాడు. భయం భయంగా చెట్టు కిందకు చూడసాగాడు. ఇంతలో జింకను వేటాడిన పులి దాన్ని చెట్టు కిందకు తెచ్చి నింపాదిగా తింది. కడుపు నిండిన తర్వాత, మిగిలిన జింక మృత కళేబరాన్ని వదిలి వెళ్లిపోయింది. కొద్దిసేపటికి వెనక రెండు కాళ్లూ పనిచేయని నక్క ఒకటి ముందున్న రెండు కాళ్లతో తన దేహాన్ని ఈడ్చుకుంటూ వచ్చింది. పులి వదిలి వెళ్లిన జింకను తిని కడుపు నిండగానే మళ్లీ తన శరీరాన్ని ఈడ్చుకుంటూ వెళ్లిపోయింది.

సోమయ్య ఆశ్చర్యపోయాడు. ప్రతిరోజూ గుడికి వెళ్లి దేవుణ్ని మొక్కే తను ఇంత కష్టపడాలా? ఏనాడూ గుడికి వెళ్లని కుంటి నక్కకు మాత్రం ఆహారం ఉచితంగా లభించేలా చేసిన దేవుడిపై సోమయ్యకు కోపం వచ్చింది. ‘రేపు గుడికి వచ్చి నీ సంగతి తేలుస్తా’ అనుకున్నాడు. తాను కొట్టిన కట్టెలను త్వరత్వరగా మోపు కట్టుకుని తలపై పెట్టుకొని పట్టణంలో అమ్ముకోవడానికి బయలుదేరాడు.

మరుసటి రోజు గుడిలో దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత.. ‘నిన్ను అడగకుండానే.. నిన్న కుంటి నక్కకు ఆహారం ఎలా తెచ్చి ఇచ్చావో.. ఈ రోజు నాకూ అలాగే ఆహారాన్ని తెచ్చి ఇవ్వు’ అన్నాడు. తర్వాత గుడి ముందరున్న పెద్ద చెట్టు కిందకు వెళ్లి కూర్చున్నాడు. ఇలా రెండు రోజులు గడిచిపోయాయి. మూడోరోజు ఆకలి బాధ తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయాడు.

గుడి ముందు నుంచే పొలం పనికి వెళ్లే ఒక కాలులేని అవ్వ సోమయ్యను రెండు రోజులుగా గమనిస్తూనే ఉంది. పడిపోయి ఉన్న శివయ్య ముఖంపై ఆమె నీళ్లు చల్లి, తన వద్ద ఉన్న ఆహారాన్ని అతనికి తినిపించింది. ‘నాయనా! రెండు రోజులుగా ఇక్కడే ఉన్నావు. ఎందుకు?’ అంది. అడవిలో జరిగిన సంఘటన మొత్తం వివరించాడు సోమయ్య.

ఫక్కున నవ్విన అవ్వ.. ‘ఓరి వెర్రివాడా.. నిన్ను నువ్వు రెండు కాళ్లులేని నక్కతో ఎందుకు పోల్చుకున్నావు? నీకు అన్ని అవయవాలూ సక్రమంగానే ఉన్నాయి కదా! అలాంటప్పుడు పులితో ఎందుకు పోల్చుకోలేదు. అంగవైకల్యం ఉన్న నేనే ఈ వయసులో కుంటుతూ కర్రసాయంతో నడుస్తూ పొలం పనికి వెళ్లి నా కుటుంబానికి సాయపడుతున్నా.

నువ్వేమో దేవుడు తిండిపెడితే తిందామనుకుంటున్నావా? అసలు దేవుడు నేరుగా వచ్చి ఎవరికైనా ఆహారం అందివ్వడం నువ్వు చూశావా? వయసులో ఉన్నప్పుడు మనం సంపాదించి జాగ్రత్త చేసుకోవాలి. దాచుకున్న ధనాన్ని వృద్ధాప్యంలో పొదుపుగా వాడుకోవాలి. దేవుడే తిండి పెట్టాలి అనుకోవడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా?’ అంది అవ్వ.

ఏదో అనబోతున్న సోమయ్యను మధ్యలోనే ఆపి.. ‘మనిషిలా పుట్టిన మనం మనిషిలానే జీవించాలి. జంతువులతో మనకు పోలిక ఏమిటి? మనిషికి, జంతువులకు తేడా లేదా? మనిషివై పుట్టిన నువ్వు ఇప్పటికైనా మనిషిలా ఆలోచిస్తూ.. కష్టపడి సంపాదించుకొని జీవించు’ అని హితవు పలికింది అవ్వ. తన తప్పు తెలుసుకున్న సోమయ్య అవ్వ తనకు నేర్పిన జీవితపాఠం నచ్చి, ఆమెకు రెండు చేతులు జోడించి నమస్కరించాడు. ఎండుకర్రలు కొట్టి తెచ్చుకోవడానికి మళ్లీ అడవిబాట పట్టాడు.

- బెల్లంకొండ నాగేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని