వికటించిన కోతి ప్రయోగం!

మెల్లగా శబ్దం కాకుండా తన కాళ్ల వెనక నుంచి ఎవరో వెళ్లడం గమనించిన గుర్రం బలంగా లాగిపెట్టి ఒక తన్ను తన్నింది. ఆ దెబ్బకు కోతి ‘ఓర్నీ.. ఏంటీ అన్యాయం. చచ్చేటట్లు తన్నావే!’ అంది. ‘అయ్యో.. కోతీ! నువ్వా.. చీకట్లో నా వెనక కాళ్ల దగ్గర ఎవరో తచ్చాడుతున్నట్లు అనిపిస్తే దొంగవచ్చాడు అనుకొని లాగిపెట్టి తన్నా’ అంది గుర్రం. ‘అవును నీ

Published : 26 Sep 2021 01:54 IST

మెల్లగా శబ్దం కాకుండా తన కాళ్ల వెనక నుంచి ఎవరో వెళ్లడం గమనించిన గుర్రం బలంగా లాగిపెట్టి ఒక తన్ను తన్నింది. ఆ దెబ్బకు కోతి ‘ఓర్నీ.. ఏంటీ అన్యాయం. చచ్చేటట్లు తన్నావే!’ అంది. ‘అయ్యో.. కోతీ! నువ్వా.. చీకట్లో నా వెనక కాళ్ల దగ్గర ఎవరో తచ్చాడుతున్నట్లు అనిపిస్తే దొంగవచ్చాడు అనుకొని లాగిపెట్టి తన్నా’ అంది గుర్రం. ‘అవును నీ దగ్గర ఏడువారాల నగలున్నాయట కదా! వాటికి ఆశపడి దొంగ వస్తాడు’ అంది కోతి వెటకారంగా. ‘సరే కానీ ఈ చీకట్లో ఏం వెదుకుతున్నావ్‌?’ అంది గుర్రం.

‘ఇక్కడ కలబంద మొక్క చూసిన గుర్తు. శబ్దం చేస్తే నీకు నిద్రాభంగమని నెమ్మదిగా వచ్చా’ అంది కోతి. ‘అయ్యో.. ఎంత పని జరిగింది. నీకు మూతి పగలడంతోపాటు ముళ్లు కూడా గుచ్చుకుని ఉంటాయి’ అంది గుర్రం. ‘అవునవును.. చావుతప్పి కన్నులొట్టబోవడం అంటే ఏమిటో అనుభవపూర్వకంగా తెలుసుకున్నా’ ఒంట్లోకి దిగిన ముళ్లను తీసుకుంటూ బాధగా అంది కోతి.

కాసేపటి తర్వాత చెట్టు మొదట్లో కూర్చుని కర్పూరం, జాజికాయ, జాపత్రి, యాలకుల్లాంటి వాటితోపాటు పలురకాల వనమూలికలు కలిపి మెత్తగా నూరుతూ మధ్యలో పన్నీరు చల్లసాగింది కోతి. ‘రాత్రి కావస్తున్నా.. నిద్రపోకుండా.. ఏదో మూలికాలేపనం తయారు చేస్తున్నట్లున్నావు. ఏంటో అది’ అని ఉత్సుకతతో అడిగింది ఎలుగుబంటి.

‘అవును ఎలుగుబంటీ.. ఇది నిత్య యవ్వన లేపనం. ఇది ఒక్కసారి శరీరంపైన రాసుకుంటే అసలు ముసలితనమే రాదు. బతికి ఉన్నంతకాలం యవ్వనవంతులుగానే వెలిగిపోతారు. నాకు ఈ మూలికా రహస్యం జాతరలో ఇద్దరు మనుషులు చెప్పుకొంటుంటే తెలిసింది. ఈ లేపనం నాకు మాత్రమే సొంతం. కాస్త మన రాజు సింహానికి ఇచ్చి ఎంచక్కా మంత్రిపదవి తీసుకుంటా’ అని కోతి ఆనందంగా చెప్పింది. తాను తయారు చేసిన లేపనాన్ని అంతా ఎండు సొరకాయ బుర్రలో నిండుగాపోసి ఆకులను ఉండగా చేసి మూతలా పెట్టింది. అది చాలా బరువుగా ఉండటంతో చెట్టు మొదట్లోనే భద్రపరిచి.. చెట్టుపైకెక్కి నిద్రపోయింది.

మరుసటి రోజు ఉదయం సొరకాయను భుజానపెట్టుకుని మృగరాజు దగ్గరకు వెళ్లింది కోతి. అప్పటికే అడవిలోని జంతువులను సమావేశపరిచి మాట్లాడుతున్న సింహం.. ‘ఏంటి.. కోతీ.. ఇలా వచ్చావు?’ అంది. ‘ప్రభూ! ఇది యవ్వన లేపనం. దీన్ని రాసుకుని కొద్దిసేపు ఎండలో నిలబడితే, వారు జీవితాంతం యవ్వనవంతులుగా ఉంటారు’ అంది కోతి.

‘నిన్ను నేను నమ్మలేను. ముందుగా నువ్వే పూసుకో. తర్వాత నా శరీరానికి రాసుకుంటా’ అంది సింహం. ‘తమరి ఆజ్ఞ’ అని సొరకాయ బుర్రలోని జావలాంటి లేపనాన్ని మూతి దగ్గర నుంచి తోక చివరిదాకా దట్టంగా పట్టించుకుంది కోతి. తర్వాత ఎండలో నిలబడింది. కాసేపటికి దానికి మూతి దగ్గర దురద పుట్టింది. క్రమేపీ ఒళ్లంతా దురదలు, మంటలూ మొదలయ్యాయి. ఉన్నది రెండు చేతులు కానీ ఒళ్లంతా ఒకేసారి దురద పెట్టడంతో ఎలా గీరుకోవాలో తెలియని కోతి, నేలపై పడి దొర్లసాగింది.

‘ముందు ఆ నీళ్లలో దిగు. లేకుంటే ఆ దురదకు నీ చర్మం ఊడి వచ్చేస్తుంది. ప్రకృతిలో ప్రతి ప్రాణీ జన్మించి, దశలవారీగా ఎదిగి, చివరకు మరణిస్తుంది. అంతేకానీ ఇలా కృత్రిమ ప్రయోగాలు చేస్తే ఇలానే వికటిస్తాయి. ఎవరైనా ప్రకృతి ధర్మానికి లోబడి జీవించాల్సిందే. ఎక్కడైనా యవ్వన లేపనాలు ఉంటాయా?’ అంది కుందేలు.

‘ఈ మనుషుల మాటలు ఇంకెప్పుడూ నమ్మొద్దు’ అనుకుంది కోతి. ‘హమ్మయ్య! ఇంకా నయం ఆ లేపనం నేను రాసుకోలేదు. బతికిపోయాను. ఇకపై ఆ కోతి మాటలు అస్సలు నమ్మొద్దు’ అని సింహం ఓ నిర్ణయానికి వచ్చింది.

- బెల్లంకొండ నాగేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని