Updated : 18 May 2022 04:08 IST

గొప్ప పని!

శాలినీ దేశపు రాజు ఒక ప్రకటన చేస్తూ ‘ఎవరైతే ఒక గొప్ప పని చేస్తారో వారిని ఘనంగా సత్కరిస్తాను. ఈ ప్రకటన పండితులకు మాత్రమే పరిమితం. వారు తాము ఏ గొప్ప పని చేసినా, చేయకున్నా ఆస్థానానికి రేపు విధిగా హాజరు కావాలి’ అని చెప్పాడు.

ఆ ప్రకటన విన్న పండితులందరూ మరునాడు ఆస్థానానికి వెళ్లి రాజుతో తాము చేసిన గొప్పపని గురించి తెలిపారు. ఒక పండితుడు.. తాను అనేక ఆస్థానాల్లో సత్కారం పొందినట్లు చెప్పాడు. మరొకరు.. తాను అనేకమంది పండితులను ఓడించినట్లు చెప్పాడు. ఇంకొక పండితుడు.. తాను అనేక గ్రంథాలు రాసినట్లు చెప్పాడు. ఇలా ఎవరికి వారు తమ తమ గొప్పతనాన్ని చెప్పుకొన్నారు.

అప్పుడు రాజు.. ‘ఇంకా పండితులు ఎవరైనా సభకు హాజరు కాని వారు ఉన్నారా?’ అని ప్రశ్నించాడు. అప్పుడు ఒక పండితుడు లేచి.. ‘మహారాజా! అందరం వచ్చాం. కానీ ఒక్క జగన్నాథుడు మాత్రం రాలేదు’ అని అన్నాడు. రాజుకు కోపం వచ్చి ‘అతడు నా ఆజ్ఞను ధిక్కరిస్తాడా? గొప్ప పని చేసినా, చేయకపోయినా పండితులందరినీ సభకు రమ్మన్నప్పుడు.. రావాలి కదా!’ అని, అతని కోసం భటులను పంపాడు.

వారు జగన్నాథుడి ఇంటికి వెళ్లారు. కానీ ఆ ఇంటికి తాళం వేసి ఉంది. ఇరుగుపొరుగు వారిని అతని గురించి అడిగారు. ‘అతడు తన తల్లిదండ్రులతో పాటు ఇప్పుడే తన బంధువుల ఊరికి కాలినడకన వెళ్లాడు’ అని వాళ్లు చెప్పారు. భటులు వెంటనే గుర్రాలపై వేగంగా వెంబడించారు. అక్కడ దారిలో జగన్నాథుడు తన తల్లిదండ్రులను నెమ్మదిగా తీసుకువెళుతూ కనపించాడు. 

ఆ భటులు జగన్నాథుని దగ్గరకు వెళ్లగానే.. అతని తల్లి ఒకేసారి నడవలేక కుప్పకూలింది. వెంటనే జగన్నాథుడు ‘అమ్మా!’ అంటూ తల్లిని పైకి లేపి తన భుజాలపై కూర్చుండబెట్టుకొని మరో చేత్తో అతని తండ్రిని పట్టుకొని నడిపిస్తున్నాడు.
భటులు, జగన్నాథునితో.. ‘అయ్యా! మీరు రాజాస్థానానికి రావాలి. రాజుగారు మీపై చాలా కోపంతో ఉన్నారు. మిమ్మల్ని వెంటనే మాతో తీసుకొని రమ్మన్నారు’ అని చెప్పారు. అప్పుడు జగన్నాథుడు ‘నేను ఏమీ తప్పు చేయలేదే! రాజు గారు అడిగిన గొప్ప పని కూడా నేను ఏమీ చేయలేదు. నాకు ఏ కొలువు కూడా లేదు. పేదవాడైన నాతో రాజుగారికి పనేమిటి!’ అని అడిగాడు.

అప్పుడు వారు.. ‘ఈ రోజు మీరు తప్పకుండా సభకు హాజరు కావాల్సి ఉంటుంది. అది రాజాజ్ఞ’ అని అన్నారు. ‘మీరన్నది నిజమే. కానీ నేను రాజాస్థానానికి వస్తే నా ముసలి తల్లిదండ్రుల ఆకలిదప్పులను ఎవరు తీరుస్తారు? అందుకే నేను రాలేదు’ అని అన్నాడు జగన్నాథుడు. ‘అయ్యా! మీ అమ్మానాన్నతో పాటు మీరూ రాజాస్థానానికి రండి. మేము మీకు దారిలో సాయపడతాం. అక్కడ మీరు రాజు గారికి మీ సంజాయిషీ ఇచ్చుకోండి’ అని అన్నారు భటులు. జగన్నాథుడు సరేనని తన తల్లిదండ్రులతో పాటు రాజాస్థానానికి వెళ్లాడు.

రాజు కోపంతో.. ‘ఏం పండితుడా! నా ఆదేశాన్ని నీవు గమనించలేదా.. లేదా జ్ఞానిని అన్న అహంభావమా? నీవు చేసిన గొప్ప పని ఏదైనా ఉంటే చెప్పు! లేకపోతే లేదని చెప్పు!’ అని అన్నాడు. ‘మహారాజా! మాకు ఒక్కడే కొడుకు. వృద్ధులమైన మాకు అతడు సేవ చేస్తూ... కాలం గడుపుతున్నాడు. ఈ కారణం వల్లనే కనీసం కొలువు కోసం కూడా ప్రయత్నం చేయడం లేదు. అందువల్ల అతడు ఏదైనా తప్పు చేస్తే మమ్మల్ని శిక్షించండి. అమాయకుడైన మా కుమారుణ్ని కాదు’ అని జగన్నాథుడి తల్లిదండ్రులు వేడుకున్నారు.

అప్పుడు రాజు... ‘లేదు లేదు.. ఈ పండితులందరికన్నా మీ కుమారుడే చాలా గొప్ప పని చేశాడు. చేస్తున్నాడు కూడా. అతడు వృద్ధులైన మిమ్మల్ని సేవిస్తున్నాడంటే అంతకన్నా గొప్పపని ఇంకేముంటుంది. అతడే కాదు.. ఈ రాజ్యంలోని ప్రతి పౌరుడూ తమ వృద్ధ తల్లిదండ్రులకు సేవలు చేయాలి. వారిని చక్కగా చూసుకోవాలి. ఇదే గొప్ప పని. రాజ్యమంతటా దీన్ని నా ఆజ్ఞగా చాటింపు వేయిస్తాను’ అంటూ జగన్నాథుడిని ఘనంగా సన్మానించి, తన కొలువులో ఆస్థాన పండితుడిగా నియమించాడు.

- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని