ప్రవిక.. పుస్తకమే రాసింది చకచకా!

వయసు నాలుగున్నరేళ్లు... బుడిబుడి అడుగులతో, తడబడే ముద్దు ముద్దు మాటలతో సందడి చేసే వయసు. కానీ ఓ చిన్నారి ఈ వయసులోనే ఏకంగా పుస్తకమే రాసేసింది. ఎంచక్కా వరల్డ్‌ రికార్టూ కొట్టేసింది.. ఆ వివరాలేంటో తెలుసుకుందామా!

Published : 18 May 2022 00:38 IST

వయసు నాలుగున్నరేళ్లు... బుడిబుడి అడుగులతో, తడబడే ముద్దు ముద్దు మాటలతో సందడి చేసే వయసు. కానీ ఓ చిన్నారి ఈ వయసులోనే ఏకంగా పుస్తకమే రాసేసింది. ఎంచక్కా వరల్డ్‌ రికార్టూ కొట్టేసింది.. ఆ వివరాలేంటో తెలుసుకుందామా!

త్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ప్రవిక చరిత్ర సృష్టించింది. ఎల్‌కేజీ చదివే వయసులోనే ఓ పుస్తకం రాసింది. దానికి ‘ది లయన్‌ అండ్‌ ది బోన్‌’ అని పేరు పెట్టింది. ఇందుకుగానూ ‘వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ టాలెంట్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించింది. మనదేశం నుంచి ఈ ఘనత సాధించిన మొదటి వ్యక్తిగా నిలిచింది.

బొమ్మలూ వేసిందోచ్‌!
కేవలం పుస్తకం రాయడమే కాదు. అందులోని బొమ్మలనూ స్వయంగా ప్రవికే వేసింది. చాలా వేగంగా చిత్రాలు గీయడం ఈ చిన్నారి ప్రత్యేకత. అమ్మ, టీచర్ల సాయంతో పుస్తకానికి ఓ రూపం తీసుకొచ్చింది. ఇంతకీ ఈ పుస్తకంలో ఏముంటుందంటే.. మంచి, మానవత్వం, స్నేహం చుట్టూ కథ తిరుగుతుంది.

బుజ్జి రచయితగా గుర్తింపు
‘వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ టాలెంట్‌’ వాళ్లు గత మూడేళ్లుగా పిల్లలు రాసిన పుస్తకాలను సమీక్షిస్తున్నారు. ఆ వివరాలన్నీ పరిశీలించి ప్రపంచంలోకెల్లా అతిపిన్న వయస్కురాలైన రచయితగా మన ప్రవికను ప్రకటించేశారు. నిజంగా ఇంత చిన్న వయసులోనే బుజ్జాయి ఈ ఘనత సాధించటం నిజంగా గ్రేట్‌ కదూ! భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని