ఔరా... ఆల్‌రౌండర్‌!

సాధారణంగా ఎవరైనా ఒక రంగంలో ప్రతిభ చూపితేనే మనం ఔరా అనుకుంటాం. ఈ చిన్నారి మాత్రం విభిన్న రంగాల్లో నైపుణ్యం సొంతం చేసుకుని అందరినీ అబ్బుర పరుస్తోంది. చిత్రలేఖనం,

Published : 19 Jun 2022 02:01 IST

సాధారణంగా ఎవరైనా ఒక రంగంలో ప్రతిభ చూపితేనే మనం ఔరా అనుకుంటాం. ఈ చిన్నారి మాత్రం విభిన్న రంగాల్లో నైపుణ్యం సొంతం చేసుకుని అందరినీ అబ్బుర పరుస్తోంది. చిత్రలేఖనం, వక్తృత్వం, వ్యాసరచన, కరాటేలో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పదుల సంఖ్యలో బహుమతులు గెలుచుకుంది. చిరుప్రాయంలో అంతరిక్ష పరిశోధనలు చేస్తూ ఓ ఆస్టరాయిడ్‌ను సైతం కనిపెట్టి ప్రశంసలు అందుకుంది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరంటే...

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన కుంచాల కైవల్యరెడ్డి, 13 ఏళ్ల ప్రాయంలోనే విభిన్న రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తోంది. నిడదవోలులో ఓ ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. నాన్న శ్రీనివాసరెడ్డి, తల్లి విజయలక్ష్మి కైవల్యను ఎల్‌కేజీ నుంచే కూచిపూడి, పియానో తరగతులకు పంపించటం మొదలుపెట్టారు.

ఏ పోటీలు పెట్టినా..
కైవల్యకు వయసుతో పాటు అన్ని విభాగాల్లో పాల్గొనాలన్న ఆసక్తి కూడా పెరగటం మొదలైంది. దీంతో బహుమతి వచ్చినా, రాకున్నా పాఠశాలలో ఏ పోటీలు పెట్టినా పాల్గొనేది. ఈ స్ఫూర్తితో 2019లో విక్రమ్‌ సారాబాయ్‌ శతజయంతి ఉత్సవాల్లో నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో ప్రథమ బహుమతి పొందింది. 2020లో ఇస్రో వరల్డ్‌ స్పేస్‌వీక్‌ సందర్భంగా నిర్వహించిన క్విజ్‌, వక్తృత్వ పోటీల్లో ప్రథమ స్థానం సాధించింది. 2018లో దిల్లీలో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో స్వర్ణంతో మెరిసింది. 2021లో బ్లాక్‌బెల్ట్‌ సాధించింది. కూచిపూడిలో అసాధారణ ప్రతిభ ప్రదర్శించి  ‘నాట్యబాల’ అవార్డును 2019లో అందుకుంది. 2021లో థేసారస్‌ అసోసియేషన్‌ వారు నిర్వహించిన రాష్ట్రస్థాయి చిత్రలేఖన పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. పెన్సిల్‌ డ్రాయింగ్‌, వాటర్‌ కలర్‌ పెయింటింగ్‌, ఆయిల్‌ పెయింటింగ్‌, కథలు రాయడం, తోలుబొమ్మలతో కథలు చెప్పటం వంటి నైపుణ్యాలకు గాను 2021లో ‘జీనియస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించుకుంది.

గ్రహశకలాన్నీ గుర్తించి..
2021లో జూపిటర్‌, మార్స్‌ గ్రహాల మధ్య ఉన్న ప్రధాన ఆస్టరాయిడ్‌ బెల్ట్‌లో ఓ కొత్త ఆస్టరాయిడ్‌ను కనుక్కొంది. ఇందుకుగాను ఐఏఎస్‌సీ నుంచి ప్రశంసాపత్రం, సీఎం జగన్మోహన్‌ రెడ్డి నుంచి రూ.లక్ష నగదు బహుమతి, ప్రశంసలు అందుకుంది. నాసా నిర్వహించిన ‘సైంటిస్ట్‌ ఫర్‌ ఏ డే’ అనే కాంటెస్ట్‌లో ఫైనలిస్టుగా నిలిచింది. 2022న ఆవర్తన పట్టికను బ్లాక్స్‌లో 1.38 నిమిషాల్లో అమర్చి ‘ఇంటర్నేషనల్‌ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ల్లో స్థానం దక్కించుకుంది. 2021లో ఇస్రో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో ప్రథమ బహుమతి గెలుచుకుంది. నెహ్రూ సైన్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ కళాశాల వారు 2022లో నిర్వహించిన జాతీయస్థాయి సైన్స్‌ ఎక్స్‌పో పోటీల్లో ‘సాంకేతికత సహాయంతో జంతువులు, ఇతర ప్రాణులను రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడవచ్చు’ అనే అంశంపై కైవల్య ప్రదర్శించిన ప్రాజెక్టు జాతీయస్థాయిలో ఉత్తమమైనదిగా ఎంపికైంది.

అంతరిక్ష శాస్త్రవేత్తగా ఎదగాలని...
ఇన్ని రంగాల్లో ప్రతిభ చూపిస్తున్నా.. ఈ చిన్నారి చదువును ఎప్పుడూ అశ్రద్ధ చేయటం లేదు. అన్నింటికీ సమాన ప్రాధాన్యం ఇస్తోంది. భవిష్యత్తులో అంతరిక్ష శాస్త్రవేత్త కావాలన్నదే లక్ష్యంగా కైవల్య ముందుకు సాగుతోంది. మరి ఈ బుజ్జి బహుముఖ ప్రజ్ఞాశాలికి ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దామా..

- ఉప్పాల రాజాపృథ్వీ,
ఈనాడు డిజిటల్‌, రాజమహేంద్రవరం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని