రెండు కోతులు.. ఓ పులి!

ఒక అడవిలో మామిడి చెట్టు మీద రాము, సోము అనే రెండు కోతులు స్నేహంగా ఉండేవి. అవి రెండూ ప్రతిరోజూ అడవంతా తిరిగేవి. వాటి చలాకీతనాన్ని చూసి ఇతర జీవులు ముచ్చటపడేవి. కానీ సోము వారం రోజులుగా చెట్టు దిగలేదు. మామిడిపళ్లు తింటూ చెట్టు మీదే కాలక్షేపం చేయసాగింది. దాన్ని ఎలాగైనా చెట్టు దించాలనుకుంది రాము.

Updated : 08 Jan 2022 05:11 IST

క అడవిలో మామిడి చెట్టు మీద రాము, సోము అనే రెండు కోతులు స్నేహంగా ఉండేవి. అవి రెండూ ప్రతిరోజూ అడవంతా తిరిగేవి. వాటి చలాకీతనాన్ని చూసి ఇతర జీవులు ముచ్చటపడేవి. కానీ సోము వారం రోజులుగా చెట్టు దిగలేదు. మామిడిపళ్లు తింటూ చెట్టు మీదే కాలక్షేపం చేయసాగింది. దాన్ని ఎలాగైనా చెట్టు దించాలనుకుంది రాము.

‘సోమూ! బొప్పాయి తోటకు వెళదామా?’ అంది రాము. ‘ఛీ..ఛీ.. బొప్పాయి పళ్లంటే నాకు ఇష్టం లేదు. నువ్వెళ్లు’ అంది సోము.

‘నువ్వు వారం రోజులుగా బయటకే రాలేదు. చూడడానికి మాత్రం బాగానే ఉన్నావు. ఏమైంది నీకూ’ అంది రాము. ‘ఏం లేదు.. ఏం లేదు!’ అంటూ కంగారుపడి చెట్టు దిగి రాము వెంట బొప్పాయి తోట వైపు నడిచింది.

అవి రెండూ అలా నడుస్తూ.. నడుస్తూ.. ఉండగా దారిలో కుందేలు క్యారెట్‌ బుట్ట నెత్తిన పెట్టుకుని నడుస్తూ కనిపించింది.

‘ఏంది కుందేలు మామా! ఏమున్నాయి బుట్టలో’ అడిగింది రాము. ‘తియ్యని, తాజా క్యారెట్లు.. ఎన్ని కావాలో తీసుకోండి’ అని బుట్టను కిందకు దించింది కుందేలు. రాము రెండు తీసుకుంది. ‘నువ్వూ తీసుకో అల్లుడూ?’ సోమును చూస్తూ అంది కుందేలు.

‘ఛీ.. ఛీ.. క్యారెట్లంటే నాకు ఇష్టం ఉండవు. నువ్వు బయలుదేరు’ అంది సోము. అవి రెండూ అలా నడుస్తూ, నడుస్తూ ఉండగా దారిలో ఆవు, తన దూడకు పాలు ఇస్తూ కనిపించింది. ‘సోమూ, రామూ.. మీరిద్దరూ ఎటో వెళ్తున్నట్లున్నారు? కొన్ని పాలు తాగి వెళ్లండి’ అంది ఆవు.

‘యాక్‌.. పాలా? నాకు పడవు’ అంది సోము. రాము కొన్ని పాలు తాగి ముందుకు కదిలింది. అవి రెండూ బొప్పాయి తోటకు వెళ్లాయి. చెరువు గట్టున బొప్పాయి తోట అందంగా కనిపించింది. బొప్పాయి పళ్ల వాసన వాటికి తగిలింది. ‘సోమూ! నాకు దాహంగా ఉంది. చెరువులో నీళ్లు తాగుతాను. ఈలోగా రెండు పండు బొప్పాయిలు కోసుకురా.. తిందాం’ అంది రాము. కానీ సోము అక్కడి నుంచి కదలకుండా నీడన కూర్చుంది.

‘వెళ్లు.. వెళ్లు..’ అని మళ్లీ అంది రాము. ఇక తప్పక సోము చెట్టెక్కి రెండు బొప్పాయిలు తీసుకువచ్చింది. కానీ అవి పండువి కావు. పచ్చిగా ఉన్న రెండు పెద్ద కాయలు. ‘అంజీ! నీకు బొప్పాయి ఇష్టం లేకపోతే తినకు. అంతేకానీ పండువి తెమ్మంటే.. ఇలా పచ్చివి తీసుకురావటం నాకు నచ్చలేదు. అసలేమైంది నీకూ!’ అంది రాము.

ఇంతలో ఆకలి మీదున్న ఒక పులి అటు వేగంగా రాసాగింది. వెంటనే రాము చెట్టెక్కింది. సోము మాత్రం కదలలేదు. సోముకు దగ్గరగా వచ్చి పులి పంజా విసిరింది. కానీ వెంటనే చెట్టుపై నుంచి సోమును పట్టుకుని పైకి లాగింది రాము. దాంతో పులిపంజా నుంచి తప్పించుకుంది సోము. కాసేపు పులి అక్కడే ఆశగా ఎదురు చూసి వెళ్లిపోయింది.

సోము వణుకుతూ.. ‘మిత్రమా! నన్ను క్షమించు! నాకు వారం క్రితం నుంచి కళ్లు మసకబారాయి. ఎదురుగా ఏముందో స్పష్టంగా కనిపించడం లేదు. అందుకే నేను పులిరాకను వెంటనే గుర్తించలేకపోయాను. నువ్వు కాపాడకపోయి ఉంటే నేను దానికి ఆహారం అయిపోయి ఉండేదాన్ని’ అంది.

రాముకు, సోము వారం రోజులుగా ఎందుకు చెట్టు దిగలేదో, చలాకీగా ఎందుకు లేదో అర్థమైంది. సోమును దగ్గరకు తీసుకుని ‘మిత్రమా! భయపడకు.. ప్రకృతి వైద్యం ద్వారా ఆహార విధానంలో మార్పు చేసుకుంటే కంటిచూపు తప్పక మెరుగు పడుతుంది’ అంది రాము.

తర్వాత అవి రెండూ పండిన బొప్పాయిలను తిన్నాయి. తిరిగి వెళ్లేటప్పుడు సోము ఆవు దగ్గర పాలు, కుందేలు దగ్గర క్యారెట్లు తీసుకుంది. రోజూ ఆకుకూరలు, క్యారెట్లు, పాలు ఆహారంలో ఉండేలా చూసుకుంది. కొద్ది రోజులకు సోము కంటిచూపు మెరుగైంది. తిరిగి ఎప్పటిలా చూడగలుగుతోంది. చలాకీగా అడవంతా తిరిగింది. ఆనాటి నుంచి పోషకాహారం తీసుకోవడం మానలేదు సోము.

- పైడిమర్రి రామకృష్ణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని