వానర సామ్రాజ్యం!

అనగనగా వానరపురం అనే కోతుల రాజ్యం ఒకటి ఉండేది. అక్కడ అన్ని రకాల కోతులు కలసిమెలసి జీవించేవి. పైగా అక్కడి జీవులన్నీ మహా తెలివైనవి. చురుకైనవి కూడా. వానరపురం చుట్టుపక్కల చాలా

Published : 09 Jul 2022 00:57 IST

అనగనగా వానరపురం అనే కోతుల రాజ్యం ఒకటి ఉండేది. అక్కడ అన్ని రకాల కోతులు కలసిమెలసి జీవించేవి. పైగా అక్కడి జీవులన్నీ మహా తెలివైనవి. చురుకైనవి కూడా. వానరపురం చుట్టుపక్కల చాలా ఊర్లు ఉన్నాయి. ఒకప్పుడు అక్కడి కోతులన్నీ ప్రతిరోజూ తమ ఆకలి తీర్చుకొనేందుకు ఆ ఊళ్లలోకి వెళుతుండేవి. పగలంతా అక్కడే ఉండి.. చీకటి పడేలోగా అడవికి తిరిగొచ్చేవి. చాలా కాలం నుంచి మనుషులను దగ్గరి నుంచి చూస్తున్న కోతులకు వారిలాగే జీవించాలనే కోరిక కలిగింది. దాంతో ఎండు కట్టెలు, పెద్ద పెద్ద ఆకులతో ఊళ్లలో మాదిరి ఇళ్లను కట్టుకున్నాయి. రాత్రిళ్లు నిద్రపోయేందుకు మెత్తటి గడ్డితో పరుపులు తయారు చేసుకున్నాయి. పెద్ద కోతులు పగలంతా బయటకు వెళ్లి సేకరించి తెచ్చిన ఆహారాన్ని, సాయంత్రం ఇంట్లో పిల్లలతో కలసి ఆరగించేవి. అలా మనుషుల్లా జీవించసాగాయి.

కొన్ని కోతులు తోటల్లోంచి తాము తీసుకొచ్చి తినే పండ్లు, కూరగాయల్లోని విత్తనాల్ని వేరు చేసి భూమిలో నాటసాగాయి. అలా మొలకెత్తిన మొక్కలు, చెట్ల నుంచి వచ్చిన ఫలాలు, కూరగాయలతో తమ ఆకలి తీర్చుకోసాగాయి. తమ రాజ్యంలోనూ ప్రజాస్వామ్య విధానాలను అవలంబించసాగాయి. ఏటా ఎండాకాలం రాగానే రాజ్యంలోని కోతులన్నీ అడవి మధ్యలో ఉన్న ఒక పెద్ద మైదానంలో సమావేశమవుతాయి. ఎన్నికల్లో పోటీ చేసేవి.. ఓ గట్టు మీద నిల్చొని తమకు ఓటు వేసి గెలిపిస్తే వానర రాజ్యంలో చేపట్టబోయే పనుల గురించి వివరిస్తాయి. అలా ఒక్కో కోతి తన ఉపన్యాసాన్ని ముగించగానే, దానికి మద్దతు తెలిపేవన్నీ చేతులెత్తుతాయి. ఆ సంఖ్యను ఓ ముసలి కోతి లెక్కిస్తుంది. ఎవరికి ఎక్కువ మంది మద్దతు పలుకుతారో.. ఆ కోతి ఆ సంవత్సరానికి రాజుగా వ్యవహరిస్తుందన్నమాట. మళ్లీ ఏడాది తర్వాత ఎన్నికలు జరుగుతాయి.

ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వానర్‌ అనే కోతి తిరుగులేని మెజారిటీతో గెలిచి రాజపీఠంపై కూర్చుంది. వానర్‌కు అన్ని ఓట్లు రావటానికి కారణం అది ప్రజలకు ఇచ్చిన ఓ అద్భుత హామీ. తనకు ఓట్లేసి గెలిపిస్తే వానరపురంలో ఉన్న కోతులన్నింటికీ ప్రతిరోజు ఉచితంగా ఆహారం అందే ఏర్పాట్లు చేస్తానని అది మాట ఇచ్చింది. దాన్ని నిలబెట్టుకోవటానికి అది కండబలం ఉన్న వంద కోతులతో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసింది. అవన్నీ నాలుగైదు బృందాలుగా విడిపోయి.. రాజ్యం చుట్టుపక్కలున్న తోటల్లోకి వెళ్లి పెద్ద సంఖ్యలో పండ్లు, కూరగాయల్ని అడవికి తీసుకొచ్చేవి. రాజు ఆజ్ఞ మేరకు వాటిని ప్రజలకు సమానంగా పంచేవి. కష్టపడకుండానే తిండి దొరుకుతుండటంతో రాజ్యంలోని కోతులకు అడవిలోంచి బయటికెళ్లే అవసరం లేకుండాపోయింది. కొన్ని రోజులకు అవి వ్యవసాయం కూడా మానేశాయి. అందరూ వానర్‌ను గొప్ప పాలకుడని పొగుడుతుంటే.. అది ఆనందంతో పొంగిపోయేది.

కొన్ని ముసలి కోతులు మాత్రం ఇలా ఉచితంగా ఆహారం ఇవ్వటం వల్ల కోతుల్లో సోమరితనం పెరుగుతుందని వానర్‌ను హెచ్చరించాయి. కానీ, వానర్‌ వాటి హెచ్చరికలను పట్టించుకోలేదు. అలా కొన్నాళ్లు హాయిగా గడిచిపోయాయి. తమ తోటల్లోంచి పండ్లు, కూరగాయల్ని కోతులు దొంగిలిస్తున్నాయని ఎట్టకేలకు రైతులు గ్రహించారు. తమ పొలాలకు గట్టి కాపలా పెట్టారు. కోతులు రాగానే వాటిని కర్రలతో తరిమేసేవారు. చేసేది లేక.. వానర సైన్యం ఖాళీ చేతులతో అడవికి తిరిగొచ్చేది. వెళ్లిన ప్రతిసారి ఇదే జరుగుతుండటంతో.. అవన్నీ వెళ్లి రాజును కలిశాయి. ఇకనుంచి తోటల్లోకి వెళ్లలేమని తేల్చిచెప్పాయి. ఎంత ఆలోచించినా.. వానర్‌కు మరో ప్రత్యామ్నాయం కనిపించలేదు. గత్యంతరం లేక ఇక నుంచి ప్రజలకు ఉచితంగా ఆహారం ఇవ్వలేమని ప్రకటించింది. అంతవరకు ఉచితాలకు అలవాటు పడి సోమరులుగా మారిన కోతులు, ఆహారం కోసం బయటికెళ్లటానికి బద్ధకించాయి.

ఒకటీ రెండూ రోజుల తర్వాత.. ఆకలికి తట్టుకోలేకపోయాయి. అయిష్టంగానే ఆహారం కోసం మళ్లీ చుట్టుపక్కల ఊర్లలోకి వెళ్లాయి. అయితే అంతకు ముందు కోతులు తోటల్లో దొంగతనాలకు పాల్పడ్డాయన్న కోపంతో చాలా మంది మనుషులు వాటికి ఏమీ పెట్టేవారు కాదు. ఒకరిద్దరు జాలిపడి ఏదో ఒకటి ఇచ్చినా.. కోతుల్లో కోతులే పోట్లాడుకోసాగాయి. మరో మార్గం లేక నీళ్లు తాగేసి.. ఆకలితోనే అడవికి తిరిగొచ్చేవి. చివరకు ఆ కోతులకు జ్ఞానోదయమైంది. ఉచితాలు శాశ్వతం కావు.. వాటికి అలవాటు పడి మన పనిని వదిలేస్తే, ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవని వాటికి అర్థమైంది. ఎవరికి వారు కష్టపడి తిండి సంపాదించుకోవటమే మంచిదని గ్రహించాయి.

- డి.ఎం.బాషా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని