వాళ్లందరిదీ ‘అప్నా స్కూల్‌’!

నేస్తాలూ.. మనలో చాలా మందికి పోలీసులంటే భయం ఉంటుంది కదా! అయినా, వాళ్లు మనలాంటి చిన్నపిల్లల్ని ఏమీ అనరు. పైగా ముద్దు చేస్తారు. అయినప్పటికీ మనలో చాలా మందికి వాళ్లంటే

Published : 14 Jul 2022 00:52 IST

నేస్తాలూ.. మనలో చాలా మందికి పోలీసులంటే భయం ఉంటుంది కదా! అయినా, వాళ్లు మనలాంటి చిన్నపిల్లల్ని ఏమీ అనరు. పైగా ముద్దు చేస్తారు. అయినప్పటికీ మనలో చాలా మందికి వాళ్లంటే వణుకే! ఓ ఖాకీ మావయ్య గురించి తెలుసుకుంటే మాత్రం అస్సలు భయపడం.. పైగా ఆయన చేస్తున్న పని వింటే ఆశ్చర్యపోతాం.. ఇంతకీ ఆయన ఏం చేస్తున్నారో తెలుసా..!

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం అయోధ్యకు చెందిన ఇన్స్‌పెక్టర్‌ రంజిత్‌ సింగ్‌ యాదవ్‌ అంటే పిల్లలకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన ఎంతో మంది పేద పిల్లలకు పాఠాలు చెబుతుంటారు. అందుకే ఆయన్ను స్థానికంగా ‘ఖాకీ గురువు’ అని పిలుస్తారు. ఆయన బండి చప్పుడే అక్కడి పిల్లలకు బడి గంట. చక్కగా పలకలు, పుస్తకాలు పట్టుకుని వచ్చి, పాఠాలు వినడానికి కూర్చుండిపోతారు.  

ముందు భయపడ్డారు..
ఈ మావయ్య అయోధ్యలో భిక్షాటన చేసే పిల్లల్ని చేరదీశారు. మొదట్లో వాళ్లతో మాట్లాడాలని ప్రయత్నిస్తే.. వారంతా ఖాకీ యూనిఫాం చూసి భయపడ్డారు. ఇలా కాదని ఆయన ఓ రోజు పొద్దున్నే బైక్‌ మీద ఆ పిల్లలుండే సరయు నదీ తీరానికి వెళ్లారు. వాళ్లంతా అప్పుడే తమ తల్లిదండ్రులతో కలిసి భిక్షాటన చేయడానికి బయలుదేరుతున్నారు. ‘మీకు చదువుకోవడం ఇష్టమేనా?’ అని ఈ మావయ్య వాళ్లను అడిగారు. వాళ్లంతా ఎంతో సంతోషంగా ఒప్పుకొన్నారు.

రోజూ ఉదయాన్నే...
కానీ వాళ్లను స్కూళ్లలో చేర్పించడానికి అవసరమైన ధ్రువపత్రాలు లేవు. దీంతో ఈ మావయ్యే సొంతంగా వాళ్లకు పాఠాలు చెప్పాలని నిర్ణయించుకున్నారు. వాళ్లకు కావాల్సిన పలకలు, పుస్తకాలు అన్నింటినీ ఈ పోలీసు మావయ్యే ఉచితంగా సమకూర్చారు. రోజూ ఉదయాన్నే వాళ్లు ఉండే ప్రాంతానికి వెళ్లి పాఠాలు చెప్పడం ప్రారంభించారు.

30 నుంచి 60..
మొదట్లో చాలా తక్కువ మంది పిల్లలే చదువు నేర్చుకోవడానికి ఆసక్తి చూపించారు. తర్వాత ఆ సంఖ్య 30కి చేరింది. ఈ మధ్యే 30 మంది కాస్తా.. 60 మంది అయ్యారు. ఓ చెట్టు కింద బ్లాక్‌ బోర్డు ఏర్పాటు చేసి, పరిసరాలు శుభ్రం చేసుకొని పిల్లలు పాఠాలు వింటున్నారు. వాళ్లు ఆ ప్రాంగణానికి ‘అప్నా స్కూల్‌’ అని పేరు కూడా పెట్టుకున్నారు.

ఇంతకీ ఎందుకిలా...  
భిక్షాటన చేసే పిల్లల్ని ఎవరూ పట్టించుకోనప్పుడు, ఈ పోలీసు మావయ్య ఎందుకంత ప్రేమ, ఆప్యాయత చూపించారో తెలుసా. ఈయన ఓ సాధారణ, పేద రైతు కుటుంబంలో పుట్టారు. తాను చదువుకునే సమయంలో ఒక్కోసారి పుస్తకాలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉండేవి కావట. అందుకే చదువుకోవాలని ఉండి, చదువుకోలేని పిల్లలకు సాయం చేస్తున్నారు. నేస్తాలూ... మరి మనం కూడా చక్కగా చదువుకుని, ఈ పోలీసు మావయ్యలాగా ఇతరులకు సాయం చేద్దామా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని