బహుమతి ఎవరికి?

‘పిల్లలూ! మీకో వారం రోజుల సమయం ఇస్తున్నా! మీకు కేటాయించిన పాఠాల్లోని ముఖ్యాంశాలు, కవి పరిచయం, పాఠానికి సంబంధించిన బొమ్మలు స్వయంగా వేసుకుని రావాలి. ఆగస్టు పదిహేనుకు పోటీ ప్రదర్శన ఉంటుంది. గెలిచిన వారికి బహుమతులు ఉంటాయి. చక్కగా వేయండి’ అన్నారు తెలుగు ఉపాధ్యాయురాలు సుగంధ. 

Updated : 26 Jul 2022 01:11 IST

‘పిల్లలూ! మీకో వారం రోజుల సమయం ఇస్తున్నా! మీకు కేటాయించిన పాఠాల్లోని ముఖ్యాంశాలు, కవి పరిచయం, పాఠానికి సంబంధించిన బొమ్మలు స్వయంగా వేసుకుని రావాలి. ఆగస్టు పదిహేనుకు పోటీ ప్రదర్శన ఉంటుంది. గెలిచిన వారికి బహుమతులు ఉంటాయి. చక్కగా వేయండి’ అన్నారు తెలుగు ఉపాధ్యాయురాలు సుగంధ. 

పిల్లలకు ఇలాంటి పోటీలు పెడితే రాయడం, గీయడమనే రెండు రకాల నైపుణ్యాలు పెంపొందుతాయి అనే ఆలోచన, నమ్మకం ఆమెకు. మిగతా ఉపాధ్యాయులు మాత్రం... ‘ఆ.. ఎందుకండీ ఇవన్నీ.. పిల్లలు గీస్తారా! రాస్తారా! వృథా శ్రమ’ అన్నారు. సుగంధ చిన్నగా నవ్వి,  ‘ప్రయత్నమైతే చేస్తున్నా. ఏం చేస్తారో చూద్దాం’ అంది. 

‘మరి పోటీలో గెలిచిన వారికి బహుమతులు ఎవరిస్తారు?’ మరో ప్రశ్న. ‘నేను ఇవ్వడానికి సిద్ధపడే ఈ పని చెప్పానండీ పిల్లలకు’ అంటూ తన పనిలో తాను మునిగి పోయింది సుగంధ. రేపే పోటీ ప్రదర్శన. పిల్లలైతే ఎప్పుడెప్పుడు తమకున్న నైపుణ్యాలను ప్రదర్శిద్దామా అని తహతహలాడుతున్నారు. రంగుల డ్రాయింగ్‌ షీట్లు కొనుక్కుని చెప్పినవన్నీ తూ.చ.తప్పకుండా చక్కగా వేసి, తీసుకొచ్చారు. సుగంధ టీచర్ను చూడగానే వాళ్లంతా ఒకరికొకరు పోటీ పడుతూ ‘ఇవి చూడండి మేడం ఎలా వేశానో.. ముందు నేను వేసినవి చూడండి మేడం’ అని గారాలు పోతూ అత్యుత్సాహంగా అంటున్నారు. వరుసగా వాళ్లు కూర్చున్న బెంచీల దగ్గరకు వెళ్లింది ఆమె.

సుగంధను బాగా ఆకర్షించింది ఓ దృశ్యం. అలాగే చూస్తుండి పోయింది. అది గమనించి.. ‘మేడం! భిక్షం... డ్రాయింగ్‌ షీట్స్‌ కొనుక్కోకుండా అట్ట ముక్కల మీద వేశాడు మేడం. మేం చెప్పాం కూడా. ఒరేయ్‌! మాలా డ్రాయింగ్‌ షీట్లు కొని వేయాలని.. డబ్బుల్లేవు. అమ్మ ఇవ్వలేదని, ఏవేవో కథలు చెప్పాడు. మేడం!’ అని పిల్లలు అన్నారు.

‘ఈ అట్ట ముక్కల కథేంటి!’ చెప్పవా అని సుగంధ అనబోయేంతలో ‘భిక్షం గాడు బిచ్చమడుక్కొచ్చాడు మేడం! దుకాణాల దగ్గరికి పోయి’ అని కిసుక్కున నవ్వారు పిల్లలు. ‘అలా అనొచ్చా! తప్పుకదా! సరే ఇవన్నీ రేపు చూద్దాం. పోటీకి రెడీగా ఉండండి’ అంటూ వెళ్లిపోయింది.

పిల్లలంతా వారికి కేటాయించిన స్థలంలో చక్కగా ప్రదర్శనకు పెట్టారు. భిక్షం తను కూడా రాసిన అట్టలను జాగ్రత్తగా అక్కడ పెట్టుకుని  నిలుచున్నాడు. న్యాయ నిర్ణేతగా మండల ఎంఈవో, మరో స్కూలు ఉపాధ్యాయుడు వచ్చారు. హెచ్‌ఎం గారు సుగంధ మేడమ్‌ను పక్కకు పిలిచి.. ‘మేడం! ఆ భిక్షాన్ని వద్దనక పోయారా? ఎందుకు పోటీలో ఉంచారు? అందరూ చక్కగా డ్రాయింగ్‌ షీట్స్‌లో తెస్తే ఇతడేమో ఇలా..’ అన్నాడు. ‘పోనీలెండి సర్‌! వాడూ కష్టపడి వేసుకుని వచ్చాడు కదా. ఒకవేళ ఎంఈవో గారు ఏమైనా అంటే అప్పుడు చూద్దాం’ అని నెమ్మదిగా అక్కడి నుంచి తప్పుకుంది. 

మధ్యాహ్నం సమావేశం ఏర్పాటు చేశారు హెచ్‌ఎం గారు. అందరు టీచర్లను, పిల్లలను పిలిచారు. అంతా నిశ్శబ్దంగా కూర్చున్నారు. హెచ్‌ఎం పిల్లల పోటీల గురించి చెబుతూ తెలుగు మేడం చొరవతో ఈ విధంగా పోటీ ఏర్పాటు చేశామని చెప్పారు. ఆ తర్వాత ఎంఈవో గారు మాట్లాడుతూ... ‘పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు, భాషా సామర్థ్యం పెంపొందించేందుకు చేసిన ప్రయత్నం చాలా బాగుంది’ అని మెచ్చుకున్నారు.

ఆ తర్వాత ఆయన న్యాయ నిర్ణేతగా బహుమతి పొందిన వారి పేర్లు చదువుతుంటే పిల్లల్లో, హెచ్‌.ఎం, మిగతా టీచర్లలో ఆశ్చర్యం. ‘మొదటి స్థానాన్ని గెలుచుకున్నాడు భిక్షం’ అనగానే ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అది గమనించిన ఏంఈఓ గారు..  ‘పిల్లలూ! మీ అమ్మానాన్నలు అంతో ఇంతో డబ్బు ఇచ్చారు కాబట్టి, డ్రాయింగ్‌ షీట్స్‌ కొనుక్కుని చక్కగా తీసుకొచ్చారు. మరి భిక్షం పరిస్థితి అలా కాదు. వాళ్ల ఇంట్లో  జబ్బు పడిన నాన్న. ఇంకా ముసలి తాత, నాన్నమ్మ ఉన్నారు. కాబట్టి తల్లిని డబ్బుల కోసం ఇబ్బంది పెట్టొద్దని ఈ ఆలోచన చేశాడు. అవి కూడా దుకాణాల వాళ్లు పారేసిన అట్టముక్కలతో.. ఇందాకే నాకు ఇదంతా చెప్పాడు’ అన్నారు.

‘ఇలా రా నాన్నా!’ అని దగ్గరికి పిలిచారు భిక్షాన్ని. ‘నీ మనసులో ఏముందో చెప్పు’ అనగానే అందరికీ నమస్కారం చేశాడు. మా బజార్లో వెళుతుంటే దుస్తుల దుకాణం బయట వీటిని చూశా. వాటికి ఓ వైపు తెల్లగా ఉంది. అట్టేమో గట్టిగా ఉంది. గోడకు తగిలించినా గాలికి కదలకుండా ఉంటాయి. అందుకని దుకాణం వాళ్లను అడిగి తీసుకున్నా’ అని భయంభయంగా చెప్పాడు. భిక్షం తెలివిని ప్రశంసిస్తూ అందరూ చేసిన కరతాళ ధ్వనులతో బడి మారుమోగింది.

- వురిమళ్ల సునంద


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని