మార్పు మంచిదే!

చెన్నవరంలో శరభయ్య అనే వైద్యుడు ఉండేవాడు. ఆయన అత్యాశపరుడు. చుట్టుపక్కల శరభయ్య ఒక్కడే వైద్యుడు కావడంతో ఇక తప్పక అందరూ అతని దగ్గరికే చికిత్స కోసం వెళ్లేవారు. పేద, ధనిక తేడా లేకుండా వైద్యం కోసం వచ్చే వారి నుంచి ఎక్కువ మొత్తంలో ధనం వసూలు చేసేవాడు.

Published : 22 Aug 2022 00:20 IST

చెన్నవరంలో శరభయ్య అనే వైద్యుడు ఉండేవాడు. ఆయన అత్యాశపరుడు. చుట్టుపక్కల శరభయ్య ఒక్కడే వైద్యుడు కావడంతో ఇక తప్పక అందరూ అతని దగ్గరికే చికిత్స కోసం వెళ్లేవారు. పేద, ధనిక తేడా లేకుండా వైద్యం కోసం వచ్చే వారి నుంచి ఎక్కువ మొత్తంలో ధనం వసూలు చేసేవాడు. అందరినీ పీల్చిపిప్పి చేసి లక్షాధికారి అయ్యాడు. అద్భుతమైన భవనాన్ని నిర్మించుకున్నాడు.

శరభయ్య రకరకాల మొక్కలు, ఆకులు, వేర్లు, పువ్వులు, తేనె మొదలైన వాటిని వైద్యానికి ఉపయోగించేవాడు. వాటికి పెద్దగా ఖర్చయ్యేది కాదు. ఏ జబ్బుకు ఏ వైద్యం చేయాలో, వేటిని ఎంత శాతం కలిపి పసర్లు, గుళికలు, లేపనాలు తయారు చేసి, ఎలా వాడాలో అద్భుతంగా తెలుసు. దీని వల్ల మందుల తయారీకి తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ ధనం వసూలు చేసేవాడు.

ఒకసారి అంజనయ్య అనే పేదవాడు అనారోగ్యంతో శరభయ్య దగ్గరకు వచ్చాడు. ఆయన్ను పరీక్షించి వైద్యానికి చాలా ఖర్చవుతుందని పెద్ద మొత్తం చెప్పాడు. ‘అయ్యా! నేను పేదవాడిని. భార్యాబిడ్డలు కలవాడిని. అమ్మానాన్న కూడా నా మీద ఆధారపడి ఉన్నారు. అంత ధనం ఇచ్చుకోలేను. నాపై దయ చూపించండి. కాస్త తగ్గించి చెప్పండి’ అన్నాడు.

‘నేను అడిగినంత ఇస్తేనే వైద్యం ప్రారంభిస్తాను. లేదంటే వెళ్లిపోవచ్చు. మరో మాటకు తావులేదు’ అన్నాడు శరభయ్య. అంజనయ్య ఎంతగా ప్రాధేయపడినా శరభయ్య మనసు కరగలేదు. మాట మారలేదు. అంజనయ్య తన బంధువులు, మిత్రుల దగ్గర అప్పు చేసి, ఆ ధనం శరభయ్యకిచ్చి వైద్యం చేయించుకున్నాడు.

ఒకరోజు శరభయ్య ఇంటిలో నాగుపాము కనిపించింది. ఆయన వెంటనే కేకలు వేస్తూ భార్యాపిల్లలతో రోడ్డు మీదకు పరుగెత్తుకొచ్చాడు. ఏం చేయాలో శరభయ్యకు పాలు పోవడం లేదు. విషయం తెలిసి జనం గుమిగూడారు.

‘ఇంతపెద్ద ఇంటిలో సర్పం ఎక్కడ ఉందో? లోపలికెళితే ఏవైపు నుంచి వచ్చి కాటు వేస్తుందో? ఇప్పుడు ఏం చేయాలి?’ అని భయంతో వణికిపోతూ అంది శరభయ్య భార్య. ‘పాములను పట్టడం అంజనయ్యకు వెన్నతో పెట్టిన విద్య. చాలా మెలకువలు తెలిసిన నేర్పరి. ఆయన తప్ప ఈ చుట్టుపక్కల ఎవరూ పాములు పట్టేవారు లేరు’ అన్నారు జనం. ‘అంజనయ్య దగ్గరకు వెళ్లి పిలుచుకుని రండి’ అంది శరభయ్య భార్య.

అంజనయ్య తన దగ్గరికి జబ్బుపడి వచ్చినప్పుడు పేదవాడినని ఎంత ప్రాధేయపడినా దయ తల్చకుండా ఆకు పసర్లకు కూడా తాను అధిక ధనం వసూలు చేసిన విషయం గుర్తుకొచ్చింది శరభయ్యకు. అది మనసులో పెట్టుకుని అంజనయ్య ఎంతధనం అడుగుతాడో, అసలు రావడానికి ఒప్పుకుంటాడా.. అని సందేహించాడు. కానీ మరో మార్గంలేక అంజనయ్య ఇంటి దగ్గరకు వెళ్లి విషయం చెప్పాడు. వెంటనే అవసరమైన సామగ్రితో బయలుదేరి వచ్చాడు అంజనయ్య. ఇంటిలోకి ప్రవేశించాడు. అందరూ ఆతృతగా చూస్తున్నారు.

‘ఇంత పెద్ద ఇంటిలో పాము ఎక్కడ ఉందో... ఎలా వెదుకుతాడు? ఈలోగా పాము ఏమూల నుంచైనా వచ్చి కాటు వేస్తే ఎలా? ప్రాణాలకు తెగించి పామున్న ఇంట్లోకి వెళ్లాడు. ఏమి జరుగుతుందో.. ఏమో!’ అంటూ తలా ఒకమాట అంటున్నారు జనం.

అక్కడ ఉన్న వారందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. దాదాపు రెండు గంటల తర్వాత బయటకు వచ్చాడు అంజనయ్య, అతని చేతిలోని సంచిలో సర్పం కదులుతోంది. ‘అమ్మా! ఈ పామును తీసుకెళ్లి అడవిలో వదులుతాను. మీరు పిల్లలను తీసుకుని ఇంటిలోకి వెళ్లండి’ అని శరభయ్య భార్యతో చెప్పాడు అంజనయ్య. ఆమె అంజనయ్యకు నమస్కరించి వెళ్లింది. శరభయ్య అంజనయ్య దగ్గరకు వచ్చి ఎంతధనం అడుగుతాడోనని సందేహ పడుతూ... ‘పామును పట్టినందుకు ఎంత ధనం ఇవ్వాలో చెప్పండి’ అన్నాడు.

‘అయ్యా! ధనం కోసం నేను ఈ పని చేయలేదు. ఇంటిలోకి పాము దూరి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో భార్యాపిల్లలతో వీధిలో పడిన మీ పరిస్థితి చూసి నాకు చేతనైన సాయం చేశాను’ అంటూ మరోమాటకు తావివ్వకుండా వెళ్లిపోయాడు అంజనయ్య. ఆనాడు తాను ప్రవర్తించిన తీరు గుర్తుకొచ్చి సిగ్గుతో తలదించుకున్నాడు శరభయ్య. మానవత్వంతో ప్రాణాలకు తెగించి సాయపడిన అంజనయ్య ఉన్నత వ్యక్తిత్వానికి మనసులోనే నమస్కరించాడు శరభయ్య. ఆ రోజు నుంచి పేదలకు ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయంతో అంజనయ్యతో సహా పేదలందరికీ మేలు జరిగింది.

- డి.కె.చదువుల బాబు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని