మాయా టోపీ!

రాజధానికి సమీప గ్రామమైన సత్తుపల్లిలో సత్తెయ్య అనే ఓ పేదవ్యక్తి ఉండేవాడు. టోపీలు కుట్టి నగరానికి తీసుకెళ్లి అమ్మేవాడు. అలా వచ్చిన డబ్బులతో జీవనం సాగించేవాడు. చిన్న పిల్లలకి బొమ్మల అలంకరణతో, ఆడవారికి ఫ్యాషన్‌గా, మగవారు మెచ్చేలా, పండితులకు సన్మానాల కోసం, ఎండ నుంచి రక్షణ ఇచ్చేవి.

Updated : 29 Sep 2022 00:27 IST

రాజధానికి సమీప గ్రామమైన సత్తుపల్లిలో సత్తెయ్య అనే ఓ పేదవ్యక్తి ఉండేవాడు. టోపీలు కుట్టి నగరానికి తీసుకెళ్లి అమ్మేవాడు. అలా వచ్చిన డబ్బులతో జీవనం సాగించేవాడు. చిన్న పిల్లలకి బొమ్మల అలంకరణతో, ఆడవారికి ఫ్యాషన్‌గా, మగవారు మెచ్చేలా, పండితులకు సన్మానాల కోసం, ఎండ నుంచి రక్షణ ఇచ్చేవి.. ఇలా రకరకాల టోపీలను చాలా అందంగా, సౌకర్యవంతంగా కుట్టేవాడు. దాంతో సత్తెయ్య టోపీలకు గిరాకీ బాగుండేది. తక్కువ లాభానికి అమ్ముతుండటంతో ఆదాయం అంతంత మాత్రంగానే ఉండేది.

తన ఒక్కగానొక్క కొడుకు మల్లేశ్‌ను పెద్ద చదువులు చదివించి గొప్ప ఉద్యోగిగా చూడాలని కలలు కనేవాడు. కానీ, ఎంత కష్టపడినా మల్లేశ్‌కు చదువు అబ్బలేదు. దాంతో తమ వృత్తి అయిన టోపీలు కుట్టడాన్నే నేర్పడం ప్రారంభించాడు సత్తెయ్య. చురుకైన వాడు కావడంతో ఎంతో ఇష్టంగా పని నేర్చుకున్నాడు. అలా కొద్దిరోజుల్లోనే టోపీలు కుట్టడంలో నైపుణ్యం సంపాదించాడు. వయసు మీద పడుతున్న సత్తెయ్యకు కొడుకు జీవనోపాధి గురించిన బెంగ తీరింది.

అలా కొన్ని రోజులు గడిచాయి. శరీరంలో సత్తువ సన్నగిల్లిన సత్తెయ్య.. కొడుకును పిలిచాడు. ‘నాయనా.. నువ్వు టోపీలు కుట్టి మాత్రమే బతుకు. కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ అటక మీద ట్రంకు పెట్టెలో ఉన్న మన తాత ముత్తాతల టోపీని ఎన్నటికీ తీయనని నాకు మాటివ్వు. చిన్నప్పుడు మా నాన్న చెప్పిన మాటను నేను ఇప్పటికీ పాటించాను’ అని చెప్పాడు. సరేనంటూ మాట ఇచ్చాడు మల్లేశ్‌. తండ్రికి మాట అయితే ఇచ్చాడు కానీ, ఎలాగైనా ఆ టోపీని చూడాలని అనుకున్నాడు. తండ్రి, తాత కూడా ఆ పెట్టెను తాకలేదని తెలిసి ఆశ్చర్యపోయాడు మల్లేశ్‌.

కొన్నాళ్లు గడిచాక.. కుతూహలంతో తన తండ్రి నిద్రలో ఉన్న సమయం చూసి, చప్పుడు చేయకుండా అటకపైకి ఎక్కాడు మల్లేశ్‌. కష్టం మీద తుప్పు పట్టిన ట్రంకు పెట్టె మూత తీశాడు. లోపల చేయి పెట్టగానే.. ఓ టోపీ తగిలింది. అక్కడ వెలుతురు సరిగా లేకపోవడంతో దాన్ని తీసుకొని కిందకు దిగాడు. వెలుగులో ఆ కుచ్చుల టోపీని చూసిన మల్లేశ్‌ కళ్లు తళుక్కుమన్నాయి. ‘ఇంత గొప్ప పనితనంతో చక్కనైన బంగారు జరీ దారాల అల్లికలు, కుట్లతో కూడిన టోపీని ఊహించడమే సాధ్యం కాని పని. మా తాతకు తాత కుట్టాడో.. ఆయన ముత్తాత కుట్టాడో కానీ.. నిజంగా అద్భుతం’ ఇలా అనుకుంటూ మురిసిపోతూ ఆ టోపీ పెట్టుకున్నాడు.

ఇంతలో అప్పడాలు అమ్మే పక్కింటి పాపయ్య వచ్చాడు. ‘మల్లేశూ! మల్లేశూ!’ అంటూ ఎదురుగానే ఉన్న మల్లేశ్‌ని వెతకసాగాడు. మల్లేశ్‌ పిలిచినా, తట్టినా అతడికి తెలియడం లేదు. దాంతో ఆ టోపీ పెట్టుకుంటే మనుషులు అదృశ్యమవుతారని మల్లేశ్‌కి అర్థమైంది. ‘ఇక డబ్బుకు లోటేముంది? జమీందార్ల పెట్టెల్లో ఉన్న డబ్బంతా నాదే..’ అనుకుంటూ పట్టరాని ఆనందంతో కేరింతలు కొట్టాడు. టోపీ పెట్టుకుని వీధిలో అటూ ఇటూ నడిచాడు. ఎవరికీ తాను కనిపించడం లేదని నిర్ధారణ చేసుకున్నాడు. ‘నేను నగరానికి వెళ్లినపుడల్లా ఒక మార్గంలోకి పోకుండా రాజభటులు అడ్డుకుంటుంటారు. మొదట అక్కడ ఏముందో తెలుసుకోవాలి’ అనుకొని నగరానికి చేరుకున్నాడు. భటులను దర్జాగా దాటుకుని ఠీవీగా నడుస్తూ ముందుకు సాగాడు.

కొంతసేపు నడిచాక ఒక ఉద్యానవనం.. దాని మధ్యలో చక్కని సరస్సు కనిపించింది. ఆ సరస్సులో జలకాలాడేందుకు ఆ రాజ్య యువరాణి తన ఆభరణాలన్నింటినీ తీస్తూ.. ఒక పట్టు వస్త్రంలో ఉంచడం గమనించాడు మల్లేశ్‌. ఆ వజ్రాభరణాలను చూసి నివ్వెరపోయాడతను. ‘ఎలాగైనా ఆ మూట ఎతుకెళ్లి, పొరుగుదేశం చేరుకుంటే చాలు. అక్కడ జమీందారులా బతికేయవచ్చు’ అని మనసులో నిశ్చయించుకున్నాడు.  యువరాణితోపాటు చెలికత్తెలు కాస్త పక్కకు వెళ్లగానే.. మల్లేశ్‌ ఆత్రంగా పరుగెత్తాడు.

ఒకసారి చుట్టుపక్కల చూసి.. వంగి కొలనుగట్టున ఉన్న నగల మూటను పైకి తీశాడు. అతడు అలా వంగడంతో తలపైనున్న టోపీ ఊడి నీటిలో పడిపోయింది. తడి తగలగానే అది మాయమైంది. అపరిచిత వ్యక్తిని చూసిన యువరాణి, చెలికత్తెలు కెవ్వున అరిచారు. పరుగు పరుగున అక్కడకు చేరుకున్న రాజభటులు, మల్లేశ్‌ను బంధించి అక్కడ నుంచి తీసుకెళ్లారు. టోపీ చూపించి, అసలు ఏం జరిగిందో చెబుదామంటే.. అది మాయమైపోయింది. దాంతో ఎంత గగ్గోలు పెట్టినా భటులు అతడి మాటలు పట్టించుకోలేదు. ‘తండ్రి మాట వింటే నాకీ పరిస్థితి వచ్చేది కాదు కదా!’ అనుకొని బాధపడ్డాడు మల్లేశ్‌.

- గుడిపూడి రాధికారాణి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని