Updated : 11 Jan 2023 06:32 IST

రామయ్య నిజాయతీ!

పార్వతీపురం గ్రామస్థులు కొందరు.. ఊరి పొలిమేర అడవిలో ఎండిన చెట్ల కొమ్మలను కొట్టి, వాటిని సంతలో అమ్మేవారు. అలా వచ్చిన కొద్దిపాటి సొమ్ముతోనే జీవనం సాగించేవారు. వారిలో రామయ్య కూడా ఒకడు. చాలా నిజాయతీపరుడు కూడా! రామయ్య ప్రతి రోజూ అన్నం తినే ముందు ఒక ముద్దను పక్కనే బండ మీద పెట్టేవాడు. దాన్ని రోజూ ఓ కాకి తిని వెళ్లిపోయేది. చుట్టుపక్కల వారందరూ ‘ఎవరైనా.. అలా కాకికి రోజూ అన్నం పెడతారా?’ అని నవ్వుకునేవారు. రామయ్య మాత్రం అవేమీ పట్టించుకునేవాడు కాదు. ప్రతిరోజూ అన్నం పెట్టే రామయ్యకు ఎలాగైనా సహాయం చేయాలని అనుకుంది కాకి.

ఒకరోజు ఒక దొంగను భటులు తరుముతూ పార్వతీపురం పొలిమేర వైపు వచ్చారు. ఆ దొంగ.. తన చేతిలో ఉన్న మూటను పక్కన పారేసి పరుగు తీశాడు. భటులు అతడిని వెంబడించసాగారు. అంత కష్టపడినా, లాభం లేకపోయింది. ఇదంతా అక్కడే ఉన్న ఆ కాకి చూసింది. ఆ మూటలో ఏదో విలువైన వస్తువు ఉందనుకుంది. వెంటనే దాన్ని కాళ్లతో పట్టుకుని రామయ్య చేతి సంచిలో పడేసింది. సాయంత్రం రామయ్య కట్టెల మోపును తలపైన పెట్టుకుని, ఆ చేతి సంచిని తీసుకుని అందరితోపాటు సంతకు బయలుదేరాడు. అక్కడ ఆ కట్టెలను అమ్మి తిరిగి ఇంటికి చేరుకున్నాడు. అతని భార్య సీత సంచిలో అన్నం పెట్టుకునే గిన్నెను తీసేందుకు చూడగా.. అందులో మూట కనిపించడంతో ఏంటా అని విప్పి చూసింది.  అందులో ఉన్న ఆభరణాన్ని చూసి ‘ఏమండీ.. ఈ నగ ఎక్కడిది?’ అని భర్తను అడిగింది. అది వజ్రాల హారం కావడంతో దాన్ని చూసి రామయ్య నివ్వెరపోయాడు. ‘అమ్మో! ఇది సంచిలోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఇది మన దగ్గర ఉంటే ప్రమాదం. ఇప్పుడే వస్తాను’ అని దాన్ని తీసుకొని గ్రామాధికారి వద్దకు వెళ్లి విషయం చెప్పాడు.

‘ఇది రాజు గారిది.. పద’ అని ఇద్దరూ కోటకు చేరుకుని మహారాజును కలిశారు. రామయ్యకు దొరికిందని ఆ హారాన్ని రాజుకు ఇచ్చాడు గ్రామాధికారి. రాజు ఆ హారాన్ని చూసి.. ‘యువరాణి వనవిహారం చేస్తుండగా ఒక దొంగ ఈ హారాన్ని దొంగిలించాడని తెలిసింది. ఆ దొంగ పారిపోతుండగా భటులు తరిమినా దొరకలేదు. అది రామయ్యకు దొరకడం విచిత్రంగా ఉంది. ఇంత విలువైన హారాన్ని నిజాయతీగా తెచ్చి ఇచ్చినందుకు ఇవిగో తీసుకో’ అని అయిదు బంగారు నాణేలు ఇవ్వబోయాడు.

‘మహారాజా! కాయకష్టం చేసుకునేవాణ్ని. ఇవి తీసుకుని సోమరిగా మారలేను.. క్షమించండి’ అని చెప్పి గ్రామాధికారితోపాటు ఇంటికి చేరుకున్నాడు రామయ్య. రాజు, మంత్రి చెవిలో ఏదో చెప్పాడు. మరుసటి రోజు సాయంత్రం సంతలో రామయ్య కట్టెల మోపును అమ్ముతుండగా వాటిని ఒకతను కొన్నాడు. తరువాత రోజు ఉదయం అతను రామయ్య ఇంటికి చేరుకుని.. ‘నిన్న సాయంత్రం నీ దగ్గర కొన్న కట్టెల్లో కొన్ని విలువైన కట్టెలు కూడా కలిశాయి. వాటిని కూడా మామూలు ధరకే అమ్మావు. అని నాకు ఎంతో ఉపయోగపడ్డాయి’ అని ఎక్కువ మొత్తంలో డబ్బును రామయ్య చేతిలో పెట్టి పరుగులాంటి నడకతో వెళ్లిపోయాడు. ఆ సంఘటనకు రామయ్య, సీత బిత్తరపోయారు. రామయ్య ఆ మూటను తీసుకొని కోటకు చేరుకుని, రాజుకు జరిగింది చెప్పాడు.

‘రామయ్యా! ఇందులో తప్పేముంది. నీకు తెలియకుండానే విలువైన చెట్టు కట్టెలు కొట్టి ఉంటావు’ అన్నాడు రాజు. ‘మహారాజా! నాకు ఏ కొమ్మ వాసన ఎలాంటిదో తెలుసు.. ఎండిన కొమ్మలను కొట్టుకునే మేము విలువైన వాటిని కొట్టడమా? అయినా మా ప్రాంతంలో అంతటి విలువైన చెట్లు పెరగవు. ఈ ధనాన్ని రాజ్యంలో మంచి పనులకు వినియోగించండి’ అని రాజుకు ఇచ్చి వెళ్లిపోయాడు రామయ్య. మారువేషంలో వచ్చి కట్టెలు కొన్నది.. తనకు అదనంగా డబ్బు ఇచ్చింది మంత్రేనని రామయ్యకు తెలియదు. ‘మంత్రీ.. ఈ రామయ్య ఏంటి.. అసలు డబ్బుకు ప్రలోభపడడా?’ అని ఆశ్చర్యంగా అడిగాడు మహారాజు. ‘అంతే మహారాజా! కొందరు తమ రెక్కల కష్టాన్నే నమ్ముకొని జీవిస్తుంటారు. అటువంటి నిజాయతీపరులను మనం మార్చలేం’ అని సమాధానమిచ్చాడు మంత్రి.

యు.విజయశేఖర రెడ్డి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు