కష్టం... నష్టం... ఇష్టం...!
ఒకసారి దూరపు బంధువుల ఇంట్లో పెళ్లని పట్నానికి వచ్చి కొడుకు ఇంట్లో ఉంది రుక్మిణమ్మ. నాయనమ్మ అన్నా, నాయనమ్మ చెప్పే కథలన్నా మనవడు గోపికి చాలా ఇష్టం. ఒకరోజు గోపి బడి నుంచి రాగానే, వాడి మీద కోడలు అరవటం విని హాల్లోకి వచ్చింది రుక్మిణమ్మ.
వాళ్ల అమ్మ అరుస్తుంటే ఏమీ మాట్లాడకుండా తలొంచుకుని లోపలికి వెళ్లిపోయాడు గోపి. ‘ఏమైంది? వాడు ఇప్పుడే కదా వచ్చింది. ఎందుకలా కోప్పడుతున్నావు.. వాడి మీద?’ మెల్లగా అడిగింది కోడల్ని రుక్మిణమ్మ.
‘బడిలో వాడికి ఆకలేస్తుందని ఉదయాన్నే లేచి ఏదో ఒకటి వండి, డబ్బాలో పెట్టి ఇస్తాం అత్తయ్యా. సగం తిని మిగతా సగం వెనక్కి తెచ్చేస్తాడు. రోజూ ఇంతే’ అని చెప్పింది కోడలు.
ఇంతలో కాళ్లూ, చేతులూ కడుక్కుని వచ్చాడు గోపి. వస్తూనే భోజనాల బల్ల మీద కూర్చుని డబ్బా తెరిచి, మిగిలిపోయిన అన్నాన్ని తినసాగాడు. మనవడు అలా డబ్బాలో మిగిలింది తినటం రుక్మిణమ్మకు అస్సలు నచ్చలేదు. కాసేపటికి గోపి అంతా తినేసి ఆడుకోవటానికి బయటకు వెళ్లిపోయాడు. రుక్మిణమ్మకు మనసు చివుక్కుమంది.
‘వాడిని అలా ఎందుకు తినమన్నావు? ఆరోగ్య సమస్యలొస్తాయి కదా?’ అని కోడల్ని అడిగింది రుక్మిణమ్మ. ‘తిననివ్వండి అత్తయ్యా. అప్పుడే వాడికి అన్నం విలువ తెలుస్తుంది. మధ్యాహ్నం తింటాడనే కదా పెట్టేది. కానీ మొత్తం తినడు. సగమే తిని తెచ్చేస్తాడు. దాని వెనుక ఎంతమంది కష్టం ఉందో వాడికి తెలియాలని, మేమే తినమంటున్నాం’ అని సమాధానం ఇచ్చింది కోడలు.
‘అది నిజమే. కానీ ఆరోగ్యం దెబ్బ తింటే కష్టం కదా!’ అంది రుక్మిణమ్మ. ‘ఈ రోజు ఉదయం చేసిందే కదా? ఆరోగ్యం ఎందుకు దెబ్బతింటుంది అత్తయ్యా..’ అంది కోడలు.
‘మూతపెట్టేసి ఉంటుంది కదా. త్వరగా పాడవుతుంది. సరే.. నేను చెప్పి చూస్తాలే. వింటాడేమో చూద్దాం’ అంది రుక్మిణమ్మ. ‘చెప్పండి... వింటే మంచిదేగా!’ అంది కోడలు.
ఆ రోజు రాత్రి మనవడికి కథలు చెబుతూ చెబుతూ.. వాడి చెవిలో ఏదో గుసగుసలాడింది రుక్మిణమ్మ. అంతే! ఆ మర్నాడు పట్టుకెళ్లింది అంతా తినేసి ఖాళీ డబ్బాతో వచ్చాడు.
కొడుకూ, కోడలూ ఆశ్చర్యపోతూ రుక్మిణమ్మ వైపు చూశారు. వాడికి వేడి వేడిగా టిఫిన్ చేసి పెట్టింది గోపి వాళ్లమ్మ. తింటూ తింటూ నాయనమ్మ వైపు చూసి నవ్వాడు గోపి. నవ్వుతూ తలూపింది రుక్మిణమ్మ.
వీళ్లిద్దరూ సైగలు చేసుకోవటం చూసి.. ‘ఇంతకీ ఏం మంత్రం వేశారు అత్తయ్యా వాడికి? మొత్తం తినేసి ఖాళీ డబ్బా తెచ్చాడు ఇంటికి’ అని ఆసక్తిగా అడిగింది కోడలు అత్తగారిని. ‘ఏముందమ్మా! అమ్మ ఉదయాన్నే లేచి నువ్వు తింటావని కష్టపడి అన్నం వండుతుంది. నువ్వు తినకుండా తెస్తే అమ్మకి కష్టం. ఆహారానికి, ఆరోగ్యానికి నష్టం. తినేసి వస్తే అమ్మకు, నాన్నకు ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే అమ్మ నువ్వు రాగానే ఇంకో కొత్త రకం ఏదైనా వేడి వేడిగా చేసి పెడుతుంది. సగం తిని మిగతా సగం ఇంటికి తెస్తే అదే తినాలి. నీకెంత కష్టం అన్నాను అంతే!’ అని సమాధానం ఇచ్చింది రుక్మిణమ్మ.
కోడలు నవ్వింది అత్తగారి ఉపాయానికి. ఆ తర్వాత మరెప్పుడూ అన్నం తినకుండా వెనక్కి తీసుకు రాలేదు గోపి. అంతేకాదు. తన స్నేహితులు ఎవరన్నా తినకపోయినా కష్టం, నష్టం, ఇష్టం అని చెప్పి తినేలా చేసేస్తున్నాడు. వాళ్లూ చెప్పింది చక్కగా వింటున్నారు.
- కన్నెగంటి అనసూయ
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Ponguleti: ఏడున్నరేళ్లుగా ఇబ్బందులు పెట్టారు: పొంగులేటి
-
India News
Pathaan: ‘పఠాన్’ సినిమా కోసం పక్క రాష్ట్రానికి దివ్యాంగుడు
-
Ts-top-news News
Hyderabad: సరదా తెచ్చిన సమస్య.. కాపాడిన తిరుమలగిరి పోలీసులు
-
Ap-top-news News
Tamil Nadu: తెలుగువారు తలచుకుంటే సాయంత్రానికి జీవో ఖాయం: కిషన్‌రెడ్డి
-
Ap-top-news News
Bachula Arjunudu: తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడి ఆరోగ్యం విషమం
-
India News
ట్రాన్స్‌జెండర్‌తో వివాహం.. యువకుడికి బంధువుల వేధింపులు