పెద్దపులి బాబోయ్‌.. పే...ద్ద పులి!

కుoదేలు ఆహారం కోసం చాలా దూరం వెళ్లింది. అక్కడో పచ్చిక బయలు కనిపించగానే, తన పంట పండిందనుకుంది. ఆశగా అటువైపు పరుగెత్తింది. దగ్గరకు వెళ్లేసరికి, కోపంగా తనవైపే చూస్తున్న పెద్దపులి కనిపించడంతో ఒక్కసారిగా దాని గుండె ఆగినంత పనైంది.

Updated : 10 May 2023 04:32 IST

కుoదేలు ఆహారం కోసం చాలా దూరం వెళ్లింది. అక్కడో పచ్చిక బయలు కనిపించగానే, తన పంట పండిందనుకుంది. ఆశగా అటువైపు పరుగెత్తింది. దగ్గరకు వెళ్లేసరికి, కోపంగా తనవైపే చూస్తున్న పెద్దపులి కనిపించడంతో ఒక్కసారిగా దాని గుండె ఆగినంత పనైంది. అంతే... ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగు అందుకుంది. పులి వెంటపడుతుందేమోనన్న భయంతో వెనుతిరిగి చూడకుండానే పరుగులో వేగం పెంచింది. కుందేలు కంగారును చూసిన లేడి పిల్ల.. ‘మిత్రమా.. మిత్రమా..’ అంటూ గట్టిగా కేకలు వేసింది. ‘హమ్మయ్యా.. లేడి పిల్ల పిలుస్తుందంటే పులి వెంబడించడం లేదన్నమాట’ అనుకుంటూ ఆగింది కుందేలు.

‘ఎందుకిలా ఆయాస పడుతూ పరుగు తీస్తున్నావు? ఏదైనా పందెంలో పాల్గొనేందుకు సాధన చేస్తున్నావా ఏంటి?’ అంటూ హాస్యమాడింది లేడి పిల్ల. ‘అక్కడా.. అక్కడా.. పులి..’ అని చెబుతుండగానే ‘అమ్మో.. పులా?’ అంటూ లేడి పిల్ల పరుగు అందుకుంది. కుందేలు కూడా దానికి జత కలిసింది. అవి రెండూ ఆగకుండా పరుగుపెట్టడాన్ని అడవి మేక చూసింది. ‘మిత్రులారా.. మీరిద్దరూ పరుగు పందెం పెట్టుకున్నారా?’ అంటూ దూరం నుంచే గట్టిగా అడిగింది. ‘అడవి మేక ఆపిందంటే.. వెనక పులి జాడ లేనట్టుగా ఉంది’ అనుకుంటూ ఆగాయవి. ‘పరుగు పందెం కాదు.. కుందేలు మిత్రుడికి తూర్పు కొండల దగ్గరున్న పచ్చిక బయళ్లలో పులి కనిపించిందట’ అంటూ విషయం చెప్పింది లేడి పిల్ల. ‘అయ్య బాబోయ్‌.. పులే..’ అంటూ అడవి మేకా పరుగు అందుకుంది. దాని వెనకే కుందేలు, లేడి పిల్లా ఉరకసాగాయి.

ఆయాస పడుతూ పరుగు పెడుతున్న ఆ మూడింటికీ ‘ఆగండక్కడ..’ అనే కేక వినిపించింది. ఒక్క క్షణం ఆగి, చుట్టూ చూశాయి. కొద్దిదూరంలో వాటికి నక్క కనిపించింది. ‘అలా వణికిపోతున్నారేంటి..?’ అంటూ వెటకారంగా అడిగిందది. ‘తూర్పు కొండల పచ్చిక బయళ్లలో పులి ఉందట..’ అంది లేడి పిల్ల. ‘ఈ అడవిలో ఇంకో పులా?’ అంటూ ఆశ్చర్యపోయింది నక్క. ‘నిజమే నేను చూశాను.. దాని బారి నుంచి తప్పించుకొని ఇలా పారిపోయి వచ్చా’ అంది కుందేలు. ‘ఎక్కడి నుంచో వచ్చిన పులికి మన అడవి జంతువులను వేటాడే హక్కు లేదు.. అదే జరిగితే ఇక మనకు ఎముకలు మాత్రమే మిగులుతాయి. ఈ విషయాన్ని వెంటనే మన అడవిలో ఉండే పులికి చెప్పాలి’ అంటూ పరుగు తీసింది నక్క.  

పులి గుహకు చేరి, విషయం మొత్తం చెప్పగానే.. ‘ఈ అడవిలో అదో, నేనో ఏదో ఒకటే ఉండాలి’ అంటూ గాండ్రించిందది. ఎప్పటి నుంచో పులి మాంసం తినాలన్న తన కోరిక ఈ విధంగా నెరవేరబోతున్నందుకు నక్క లోలోపలే సంబరపడింది. బయటకు మాత్రం.. ‘పులిరాజా.. మీ సత్తా చూపించండి. మీ బలమైన తలతో ఆ పులిని ఢీకొడితే వచ్చిన దారినే పారిపోవడం ఖాయం’ అంటూ దాన్ని మరింత రెచ్చగొట్టింది. వేటకు సిద్ధపడిన పులి తూర్పు కొండల వైపు పరుగు ప్రారంభించింది. అక్కడికి చేరగానే.. గాండ్రిస్తూ చుట్టూ చూసింది. ఓ చోట మరోపులి కనిపించడంతో.. అదే వేగంతో వెళ్లి దాని తలను బలంగా ఢీ కొట్టింది. ఆ దెబ్బతో తన కంటి మీద నుంచి కారుతున్న రక్తాన్ని చూసిన పులి బెంబేలెత్తిపోయింది.

దాని బలం ముందు తాను దిగుదుడుపే అనుకొని, వచ్చిన దారినే పరుగుపెట్టింది. మాంసం మీది ఆశతో కలలుగంటూ వస్తున్న నక్క దానికి ఎదురైంది. ‘నువ్వు కూడా పరుగెత్తు. నా రక్తాన్నే కళ్ల జూసిందంటే దాని బలం అంచనా వేయడం కష్టమే’ అంది పులి. ఆ మాటలతో నక్కకూ భయం పట్టుకుంది. గాయంతో బాధపడుతున్న పులి, దాని వెనకాలే నక్క పరుగు చూసిన కుందేలు, అడవి మేక, లేడి పిల్లకు ఏం జరిగిందో అర్థం కాక మౌనంగా ఉండిపోయాయి. కొద్దిసేపటికి వాటి దగ్గరకు ఓ కోతి వచ్చింది. ‘దారి తప్పిన జంతువుల్లా ఏమిటా వెర్రి ముఖాలు?’ అంటూ వాటిని పలకరించింది. రెండు పులుల మధ్య నలిగిపోతున్న తమ బాధను పూస గుచ్చినట్లు చెప్పుకొచ్చింది కుందేలు.

దాంతో కోతి పకపకా నవ్వసాగింది. ‘మేమంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటుంటే.. నీకు తమాషాగా ఉందా?’ అంటూ అడవి మేక కోప్పడింది.

‘తూర్పు కొండల పచ్చిక బయళ్లలో ఉన్నది నిజమైన పులి కాదు.. అది ఒక శిల్పం. పక్కనే ఉన్న గ్రామం నుంచి దొంగలు ఎత్తుకొచ్చి.. అక్కడ పడేసినట్లున్నారు. ఆ రాతిని తలతో ఢీకొంటే దెబ్బ తగలక ఇంకేం అవుతుంది?’ అంటూ మళ్లీ నవ్విందా కోతి. ‘అంటే.. మనం ఇంతసేపు భయపడింది విగ్రహాన్ని చూశా..’ అని జంతువులు అనుకున్నాయి.

బి.వి.పట్నాయక్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని